ఈ మధ్య కాలంలో థియేటర్స్ కి వచ్చిన కొన్ని సినిమాలు, నెల తిరక్కుండానే ఓటీటీ సెంటర్ కి వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన సినిమాల జాబితాలో తాజాగా చేరిన సినిమానే 'గేమ్ ఆన్'. దయానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఇలా థియేటర్లకు వచ్చి అలా వెళ్లిపోయింది. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 2001 నుంచి 2011 మధ్యలో జరుగుతుంది. సిద్ధార్థ్ ( గీతానంద్) హైదరాబాద్ లో ఒక గేమింగ్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతను మోక్ష (వాసంతి)ని లవ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉంటారు. సిద్ధార్థ్ తన ఆఫీసులో రాహుల్ తో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటాడు. ఒక రోజున సిద్ధార్థ్ జాబ్ పోతుంది. మోక్ష - రాహుల్ కలిసి తనని మోసం చేశారనే విషయం అతనికి అర్థమవుతుంది. దాంతో అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఒక కాల్ వస్తుంది. 'రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్' అనే పేరుతో అతని ముందుకు కొన్ని టాస్కులు వస్తుంటాయి. ఆ టాస్కులు పూర్తి చేసిన వెంటనే అతని ఎకౌంటులో డబ్బుపడిపోతూ ఉంటుంది. దాంతో సిద్ధార్థ్ ఆత్మహత్య ఆలోచన మానేసి, విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే గతంలో సిద్ధార్థ్ తో కలిసి పనిచేసిన తార, (నేహా సోలంకి) తనని లవ్ చేయవలసిందేనంటూ అతని జీవితంలోకి అడుగుపెడుతుంది.
అదే సమయంలో 'రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్' నుంచి సిద్ధార్థ్ కి ఒక టాస్క్ వస్తుంది. అర్జున్ గోస్వామి (జెమినీ సురేశ్) ఇంటికి వెళ్లి, అతని ల్యాప్ ట్యాప్ ను నాశనం చేయమని .. సిద్ధార్థ్ అలాగే చేస్తాడు .. ఆ తరువాత అర్జున్ గోస్వామిని షూట్ చేయమని అజ్ఞాత వ్యక్తి చెబుతాడు. గేమ్ గా ఎంతవరకైనా వెళతానుగానీ, హత్య మాత్రం చేయనని సిద్ధార్థ్ తేల్చి చెబుతాడు. తాము చెప్పినట్టుగా చేయకపోతే, అతని గతాన్ని గురించి అందరికీ చెప్పవలసి ఉంటుందని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తాడు.
సిద్ధార్థ్ తాత సూర్యనారాయణ (శుభలేఖ సుధాకర్) అనీ, అతని తల్లి (మధుబాల) గురించి తనకి తెలుసునని .. ఆ తరువాత జరిగిన ఒక మర్డర్ గురించి కూడా తనకి తెలుసునని అవతల వ్యక్తి బిగ్గరగా నవ్వుతాడు. గేమ్ పేరుతో తనని కావాలనే ఎవరో టార్గెట్ చేశారనీ .. వాళ్ల ఉచ్చులో తాను చాలావరకూ చిక్కుకున్నాననే విషయం సిద్ధార్థ్ కి అర్థమవుతుంది. అయినా అతను అర్జున్ గోస్వామిని హత్య చేయనని చెబుతాడు. తన గతాన్ని గురించి ఎవరికి తెలిసుంటుందా అనే ఆందోళన మొదలవుతుంది.
అంతకుముందు చాలా సౌమ్యుడిగా ఉండే సిద్ధార్థ్, ఒక్కసారిగా మారిపోవడాన్ని తార గమనిస్తుంది. తనకి కనిపించని మరో కోణం అతని జీవితంలో ఉందనే విషయం ఆమె గ్రహిస్తుంది. అతనెవరనేది తెలుసుకోవాలనుందని అంటుంది. అప్పుడు 'రామచంద్రాపురం'తో ముడిపడిన తన గతాన్ని గురించి సిద్ధార్థ్ చెప్పడం మొదలుపెడతాడు. అతని గతం ఎలాంటిది? గేమ్ పేరుతో అతణ్ణి టార్గెట్ చేస్తున్నది ఎవరు? అవతల వాళ్లకి సిద్ధార్థ్ గతం ఎలా తెలుసు? అనేవి ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అంశాలు.
బడ్జెట్ పరంగా .. కాస్టింగ్ పరంగా చూసుకుంటే ఇది చిన్న సినిమా. కానీ కంటెంట్ కాస్త కొత్తగానే అనిపిస్తుంది. గేమ్ పేరుతో హీరోను ఇరికించడానికి విలన్ చేసే ప్రయత్నం, చివరి నిమిషంలో అది గ్రహించిన హీరో ఆ ఉచ్చులో నుంచి బయటపడటానికి ట్రై చేయడం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. హీరో పాత్రలో రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయి. కథలో సందర్భాలకు తగినట్టుగా ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
కొత్త హీరోనే అయినా బాగానే చేశాడు. ఇక నేహా సోలంకి ఇక్కడి వారికి పెద్దగా పరిచయం లేదు. ఆ పాత్రలోను వేరియేషన్స్ ఉన్నాయి. నటనతోను .. గ్లామర్ పరంగాను ఆమె ఆకట్టుకుంటుంది. ఆదిత్య మీనన్ పాత్ర కూడా చాలా బలంగా కనిపిస్తుంది. శుభలేఖ సుధాకర్ - మధుబాల తమ పాత్రలకి న్యాయం చేశారు. అయితే మామ కోడళ్లుగా ఈ రెండు పాత్రలు ప్రవర్తించే తీరు, వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది.
సూర్యనారాయణ తన కొడుకును పోగొట్టుకుంటాడు. కోడలు ఇంటిపట్టునే ఉంటుంది. పదేళ్ల మనవడు స్కూల్ కి వెళ్లి వస్తుంటాడు. ఎవరో ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి, తన కూతురుకు తల్లి కావాలని సూర్యనారాయణతో అంటే, అతనితో తన కోడలు పెళ్లి జరిపిస్తాడు. కొత్త తండ్రిని తన మనవడు అంగీకరించడని చెప్పి, ఆ కుర్రాడు స్కూల్ కి వెళ్లి తిరిగి వచ్చేలోగా ఆమెకి పెళ్లి చేసి పంపించేస్తాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని సూర్యనారాయణ అంటే, తన కొడుకు భవిష్యత్తు కోసమే తాను ఆ రోజున అలా చేయవలసి వచ్చిందని ఆ తల్లి అంటుంది. కథలోని అత్యంత కీలకమైన ఈ పాయింటును ప్రేక్షకుల ముందు సమర్ధించుకోవడం కష్టమే. ఈ అంశం విషయంలోనే ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడతారు. ఆ తరువాత వచ్చే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అనవసరమైన సీన్స్ లేకుండా, ఆసక్తికరమైన డ్రామానే నడుస్తూ ఉంటుంది.
దయానంద్ టేకింగ్ .. అరవింద్ విశ్వనాథన్ ఫొటోగ్రఫీ .. అభిషేక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తంలో మూడు నాలుగు సాంగ్స్ ఉంటాయి. వాటిలో హీరో - హీరోయిన్ మధ్య వచ్చే 'ఈ వేళ నా మదిలో' అనే రొమాంటిక్ సాంగ్ అలరిస్తుంది. వంశీ అట్లూరి ఎడిటింగ్ కూడా ఓకే. ఫైట్స్ ను డిజైన్ చేసిన తీరుకి కూడా మంచి మార్కుల ఇవ్వొచ్చు. యావరేజ్ కంటెంట్ ఉన్నప్పటికీ, హీరో - హీరోయిన్ పెద్దగా తెలియక పోవడం వలన, థియేటర్లకు ఈ సినిమా వచ్చివెళ్లిన విషయం ఎవరికీ తెలియలేదేమో అనిపిస్తుంది.
'గేమ్ ఆన్' - (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
| Reviews
Game On Review
- ఈ నెల 2న థియేటర్లకు వచ్చిన సినిమా
- నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్
- వాస్తవానికి దూరంగా అనిపించే కీలకమైన పాయింట్
- ఫరవాలేదనిపించే ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం
- గ్లామర్ పరంగా మెరిసిన నేహా సోలంకి
Movie Name: Game On
Release Date: 2024-02-27
Cast: Geethanandh, Neha Solanki, Adithya Menon, Madhoo, Subhalekha Sudhakar
Director: Dayanand
Music: Abhishek
Banner: Kasthuri Creations
Review By: Peddinti
Game On Rating: 2.50 out of 5
Trailer