చైతన్యరావు నటుడిగా ఎదుగుతూ వెళుతున్నాడు. చిన్న సినిమాలతో ప్రస్తుతం అతను బిజీగా ఉన్నాడు. ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన 'వాలెంటైన్స్ నైట్' క్రితం ఏడాదిలో థియేటర్లకు వచ్చింది. చాలా ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టింది. ఈ రోజు నుంచే ఈ సినిమా 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. టైటిల్ తోనే యూత్ లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయిలో కనెక్ట్ అయిందనేది చూద్దాం.
అజయ్ (చైతన్యరావు) ఎఫ్.ఎమ్.రేడియోలో ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. అతను ప్రియ (లావణ్య) కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఒక రోజున లావణ్యను కలుసుకున్న అజయ్, తమ పెళ్లి జరగదని ఆమెతో చెబుతాడు. తనని మరిచిపొమ్మని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హఠాత్తుగా అతను ఎందుకు అలా ప్రవర్తించాడనేది లావణ్యకి అర్థం కాదు.
రాఘవ (శ్రీకాంత్ అయ్యంగార్) శ్రీమంతుడు. అక్రమ వ్యాపారాలను చేస్తూ చాలా వేగంగా ఎదుగుతాడు. అతని కూతురు వేద (దివ్య) పెళ్లీడుకొచ్చిన అమ్మాయి. తల్లిలేని పిల్ల కావడం వలన, రాఘవ తన కూతురును గారం చేస్తాడు. ఫలితంగా ఆ అమ్మాయి డ్రగ్స్ కి బానిస అవుతుంది. ఆ విషయం తెలియని రాఘవ, ఆమెకి అడిగినంత డబ్బు ఇస్తూ వెళుతుంటాడు. డబ్బు గురించి తప్ప అతను మరి దేని గురించీ ఆలోచన చేయడు. కుటుంబానికి సంబంధించిన ఏ విషయాలను పట్టించుకోడు.
తన భార్య స్థానంలోకి అతను మాయ (బిందు చంద్రమౌళి)ని తీసుకొస్తాడు. అయితే ఆమె అంటే 'వేద'కి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఇక మరో వైపున సిటీలో డ్రగ్స్ రాకెట్ విపరీతంగా నడుస్తూ ఉంటుంది. మైఖేల్ చేతుల మీదుగా డ్రగ్స్ సప్లై అవుతూ ఉంటుంది. అమ్మాయిలను డ్రగ్స్ కి బానిసలను చేసి, వాళ్లు మత్తులో ఉండగా 'దాదా'కి అమ్మేస్తూ ఉంటాడు. అలాంటి అతని దృష్టి 'వేద'పై పడుతుంది. ఆమెను 'దాదా'కి అమ్మేయడానికి అవసరమైన సన్నాహాలను అతను చేసుకుంటూ ఉంటాడు.
రాఘవ స్నేహితుడు మ్యాడీ (రవివర్మ) మాయతో చనువుగా ఉంటున్నాడనీ, కాలేజ్ రోజుల్లో వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారనే విషయం రాఘవకి తెలుస్తుంది. దాంతో అతను ఇటు మాయపై .. అటు మ్యాడిపై కోపంతో రగిలిపోతాడు. ఆవేశంలో అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? ప్రియకి అజయ్ దూరం కావడానికి కారణం ఏమిటి? డ్రగ్స్ సప్లయర్ ఉచ్చులో వేద చిక్కుకుంటుందా? అసలు ఇంతకీ 'దాదా' ఎవరు? అనే అంశాలతో ఈ కథ నడుస్తుంది.
ఈ సినిమాకి రచన .. దర్శకత్వంతో పాటు, సంగీతాన్ని కూడా అనిల్ గోపిరెడ్డి సమకూర్చాడు. కంటెంట్ పరంగా చూసుకుంటే .. ఇది చాలా చిన్న కథ ... చిన్న బడ్జెట్ లో నడిచే కథ. చిన్న సినిమాలో కంటెంట్ ఉండకూడదనేం లేదు. కానీ ఇక్కడ ఉన్న కంటెంట్ లో కొత్తదనమేం లేదు. పరిస్థితులు .. అపార్థాలు .. అనర్థాలు అనే మూడు అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు.
హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి, ఇకపై తమ ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోతాడు. అందుకు కారణం ఏమిటా తెలుసుకుందామనుకున్న ప్రేక్షకుడు, క్లైమాక్స్ వరకూ అలాగే కూర్చుంటాడు. హీరో - హీరోయిన్ ను ముందుగానే విడదీయడంతో రొమాంటిక్ సాంగ్స్ కి అవకాశం లేకుండా పోయింది. పైగా టైటిల్ ను బట్టి అక్కడ ఏదో రొమాంటిక్ టచ్ ఉంటుందని యూత్ ఆశిస్తుంది. కానీ అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెబుతూ, మిగతా కథ ముందుకు వెళుతుంది.
టైటిల్ వైపు నుంచి ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. కానీ అలాంటి సన్నివేశాలేం పడలేదు. అందువలన చైతన్యరావు ఒక హీరోగా కాకుండా ఒక ప్రధానమైన పాత్రగానే కనిపిస్తాడు. సునీల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చినా, ఒకటి రెండు సీన్స్ తరువాత ఆ పాత్ర ఆచూకీ ఉండదు. దర్శకుడు కొన్ని లాజిక్స్ ను కూడా పట్టించుకోలేదు. అతను కథను రెడీ చేసుకున్న తీరు చూస్తే, క్లైమాక్స్ కి వచ్చేసరికి, అపార్థాలు తొలగిపోయి పాత్రలు కలిసిపోవడం .. అప్పటివరకూ చెడ్డదారిలో నడిచిన వాళ్లంతా మంచి దారిలోకి మారిపోవడమన్నట్టుగా చూపించాడు.
కథలో ఎలాంటి అనూహ్యమైన మలుపులు కనిపించవు. ట్విస్టులు అని దర్శకుడు అనుకున్నవి ఆడియన్స్ ను పెద్దగా కదిలించవు. కొన్ని అంశాలకు సంబంధించిన సస్పెన్స్ ను రివీల్ చేసినా, ఆడియన్స్ వైపు నుంచి పెద్దగా స్పందన ఉండదు. అందుకు కారణం ఆ స్థాయిలో కథను అల్లుకోకపోవడమే. ఇక జయపాల్ రెడ్డి ఫొటోగ్రఫీ .. అనిల్ గోపిరెడ్డి సంగీతం .. మధు రెడ్డి ఎడిటింగ్ ఓకే.
'వాలెంటైన్స్ నైట్' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
| Reviews
Valentines Night Review
- చైతన్యరావు నుంచి 'వాలెంటైన్స్ నైట్'
- ప్రధానమైన కథాంశంగా కనిపించని లవ్ ట్రాక్
- ఆకట్టుకోని మలుపులు .. ట్విస్టులు
- కెనెక్ట్ కాని ఎమోషన్స్
- సాదాసీదాగా సాగే కథ
Movie Name: Valentines Night
Release Date: 2024-02-15
Cast: Chaitanya Rao,Lavanya Sahukara,Sunil, Posani Krishna Murali,Srikanth Iyengar,Mukku Avinash, Ravi Varma
Director: Anil Gopireddy
Music: Anil Gopi Reddy
Banner: Swan Movies
Review By: Peddinti
Valentines Night Rating: 2.25 out of 5
Trailer