క్రితం ఏడాది తమిళంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'సబా నాయగన్' ఒకటిగా కనిపిస్తుంది. అరవిందన్ జయబాలన్ - అయ్యప్పన్ జ్ఞానవేల్ నిర్మించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 22వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అశోక్ సెల్వన్ .. మేఘ ఆకాశ్ .. కార్తీక మురళీధరన్ .. చాందినీ చౌదరి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, కార్తికేయన్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ రోజు నుంచే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ 2007 - 2016కి మధ్యలో జరుగుతుంది. అరవింద్ ( అశోక్ సెల్వన్)న ఒక స్కూల్లో చదువుతూ ఉంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. టీనేజ్ లోకి అడుగుపెట్టిన అరవింద్ ఎప్పుడూ ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూ ఉంటాడు. చదువుపై కాకుండా 'హాకీ' గేమ్ పై మాత్రమే దృష్టి పెడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ అంతా అతనిని 'సబా' అని పిలుస్తూ ఉంటారు. స్కూల్లో అతను ఈషా (కార్తిక మురళీధరన్) ను మనసులోనే ఆరాధిస్తూ ఉంటాడు. తనని అతను లవ్ చేస్తున్న విషయం ఆమెకి తెలియదు.
ఇంజనీరింగ్ కోసం అతను కోయంబత్తూర్ వెళతాడు. అక్కడి కాలేజ్ లో అతనికి అపర్ణ .. సంగీత పరిచయమైనప్పటికీ, రియా ( చాందినీ చౌదరి) అతని మనసును కొల్లగొడుతుంది. ఆమె తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. అయినా ఆమెను లవ్ చేయడం మొదలుపెడతాడు. అయితే ఊహించని విధంగా ఆమె వేరొకరిని చేసుకుని వెళ్లిపోతుంది. ఆ బాధలో ఉన్న అతనికి తాను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు లవ్ చేసిన 'ఈషా' తారసపడుతుంది.
'ఈషా'తో అతను చనువుగా మాట్లాడటం మొదలుపెడతాడు. తాను బిజినెస్ చేస్తున్నట్టుగా ఆమెతో అబద్ధం చెప్పినప్పటికీ, ఆ తరువాత ఆలోచనలో పడతాడు. ఆమెకి నిజం చెప్పి తన జీవితంలోకి ఆహ్వానం పలకాలని అనుకుంటాడు. కానీ ఆల్రెడీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఆమె చెప్పడంతో బిత్తరపోతాడు. మనసును మళ్లించుకునే ప్రయత్నం చేస్తూనే, ఎమ్ బీ ఏలో చేరతాడు. అదే సమయంలో అతని లైఫ్ లోకి మేఘ (మేఘ ఆకాశ్) అడుగుపెడుతుంది.
మేఘను చూడగానే అతను తన గతం చేసిన గాయాల నుంచి బయటపడతాడు. అతనితో ఆమె చాలా సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెడుతుంది. ఆమెతో పరిచయం జీవితంపై అతనికి కొత్త ఆశను చిగురింపజేస్తుంది. ఆమె కూడా తనని ఆరాధిస్తున్నట్టుగా అతనికి అనిపిస్తుంది. మనసులోనే ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. వాళ్ల ప్రేమ ఫలిస్తుందా? అతని జీవితంలో చివరిగా మిలిగిలేదెవరు? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
కార్తికేయ రచయితగా .. దర్శకుడిగా వ్యవహరించిన సినిమా ఇది. స్కూల్ డేస్ నుంచి ఎంబీఏ వరకూ ప్రేమ విషయంలో ఒక యువకుడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అలాంటి పరిస్థితులలో అతను ఎలా స్పందిస్తాడు? ఆ తరువాత ఏం చేస్తాడు? అనేదే ప్రధానమైన కథాంశం. ఈ మధ్య కాలంలో జీవితంలోని వివిధ దశలలో ప్రేమలో పడటం, ఆ సందర్భాలు .. సంఘటనలు .. అనుభూతులను ప్రధానంగా చేసుకుని నడిచే కథలు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమానే ఇది.
స్కూల్ ఫైనల్ కి చేరుకునేసరికి ప్రేమభావాలు చిగురించడం సహజం. అలాగే కాలేజ్ డేస్ లో కొనసాగే ప్రేమాయణాలు .. ఆ ప్రేమకథల్లో స్నేహితుల ప్రమేయం .. ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే హీరో స్నేహితుల లవ్ స్టోరీస్ కూడా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. దర్శకుడు లవ్ ట్రాక్ లను ఎత్తుకున్న తీరు ఫరావాలేదుగానీ, ఆ ట్రాక్ లకు ఇచ్చిన ముగింపులు అంత సంతృప్తికరంగా అనిపించవు. ఫలానా ట్రాక్ ఎక్కడ ఆగిపోయిందనేది గుర్తుండనంత సింపుల్ గా తేల్చేశారు.
ఈ కథ .. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన హీరో, తనని స్టేషన్ తీసుకెళుతున్న కానిస్టేబుల్స్ కు చెప్పడం .. ఆ సంఘటనతో ముడిపడిన ట్విస్టు కొంత ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఈ కథకి మొదటి నుంచి ఇస్తూ వచ్చిన కామెడీ టచ్ కొంతవరకూ ప్లస్ అయిందనే చెప్పాలి. హీరోయిన్స్ స్థానంలో ముగ్గురు కనిపిస్తారు. అయితే ఎవరితోను రొమాన్స్ ను వర్కౌట్ చేయకపోవడం .. ఫీల్ తో కూడిన సాంగ్స్ లేకపోవడం లోపంగా అనిపిస్తుంది.
లియోన్ జేమ్స్ సంగీతం .. బాలసుబ్రహ్మణం ఫొటోగ్రఫీ ఫరవాలేదు. లవ్ ట్రాక్ ల ఎండింగ్ ... ట్విస్టులు .. ఫీల్ తో కూడిన సాంగ్స్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ యాడ్ అయితే ఈ సినిమా మరింతగా యూత్ కి కనెక్ట్ అయ్యేది. అలా కాకుండా కామెడీ టచ్ తో .. కాస్త సరదాగా నడిపిస్తూ వెళ్లారంతే.
'సబా నాయగన్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!
| Reviews
Saba Nayagan Review
- అశోక్ సెల్వన్ హీరోగా రూపొందిన సినిమా
- కథానాయికలుగా ముగ్గురు హీరోయిన్స్
- కామెడీ టచ్ తో మాత్రమే నడిచే కథ
- లోపించిన రొమాన్స్ .. ఎమోషన్స్
- సరైన ముగింపులేని లవ్ ట్రాకులు
Movie Name: Saba Nayagan
Release Date: 2024-02-14
Cast: Ashok Selvan, Megha Akash,Karthika Muralidharan, Chandini Chowdary
Director: Karthikeyan
Music: Leon James
Banner: Clear Water Films
Review By: Peddinti
Saba Nayagan Rating: 2.50 out of 5
Trailer