'ఎవ్వరికీ చెప్పొద్దు' మూవీ రివ్యూ

ప్రేమకి ఎప్పుడూ ప్రధానమైన అడ్డంకిగా మారేది కులమే. ప్రేమికులను ప్రధమంగా భయపెట్టేదీ కులమే. కులాన్ని ప్రాణంగా భావించే ఒక ఆడపిల్ల తండ్రి .. మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెప్పడానికి భయపడే కూతురు .. ఆ అమ్మాయినే భార్యగా పొందడం కోసం తెగించే ఓ ప్రేమికుడు. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రమే 'ఎవ్వరికీ చెప్పొద్దు'. కులం అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న ఈ కథ సందేశాత్మకమే అయినా, దర్శకుడు దానిని పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయాడు.
తెలుగు తెరను ఎన్నో ప్రేమకథలు పలకరించాయి. కులమే విలన్ గా మారిపోయి, వీలైనంత వరకూ ప్రేమ జంటలను విడదీయడానికి ప్రయత్నించే కథలే ఎక్కువగా వచ్చాయి. అలా కులం అనే అడ్డుగోడను కూల్చడానికి ఒక ప్రేమికుడు ఏం చేశాడనే కథతో 'ఎవ్వరికీ చెప్పొద్దు' టైటిల్ తో దర్శకుడు బసవ శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ టీనేజ్ లవ్ స్టోరీతో యువతీ యువకులను ఆకట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందో ఇప్పుడు చూద్దాం.
ఈ కథ విశాఖపట్నంలో మొదలవుతుంది. హరి(రాకేశ్) ఓ మధ్యతరగతి యువకుడు. ఓ కార్ల షో రూమ్ లో సేల్స్ మేన్ గా పనిచేస్తూ ఉంటాడు. హారతి(గార్గేయి) కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే. ఇద్దరికీ కూడా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. హారతి తండ్రి దుర్గాప్రసాద్ (వంశీ నెక్కంటి)కి మొదటి నుంచి కూడా కులపిచ్చి ఎక్కువ. తమ కులం కానివారితో తన కూతురు స్నేహం చేయడానికి కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు.
అలాంటి పరిస్థితుల్లో వివాహం విషయంలో రాహు దోషానికి పరిహారంగా పూజ చేయించుకోవడానికి హరి - హారతి శ్రీకాళహస్తికి చేరుకుంటారు. అక్కడి ఆలయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కలుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుండగా, కులానికి తన తండ్రి ఇచ్చే ప్రాధాన్యతను గురించి హరికి హారతి చెబుతుంది. కులాలు వేరు కావడం వలన, తమ పెళ్లి జరగడం అసాధ్యమంటుంది. అయితే, హారతిని తన సొంతం చేసుకోవాలనుకున్న హరి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేమిటి? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనే మార్గంలో కథ ముందుకు వెళుతుంది.
దర్శకుడు బసవ శంకర్ ఈ ప్రేమకథను ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన కొంతవరకే సక్సెస్ ను సాధించాడు. కథలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ బలమైన కథనంతో దానిని ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయాడు. ప్రేమకథకి అవసరమైన ఫీల్ గుడ్ సీన్స్ ను .. ఎమోషనల్ సీన్స్ ను మనసులను కదిలించే స్థాయిలో రాసుకోలేకపోయాడు. నాయకా నాయికల జోడీ సెట్ కాలేదనిపిస్తుంది. హీరో ముందు నాయిక చిన్నపిల్ల మాదిరిగా కనిపిస్తోంది. జోడీ కుదరకపోవడం వలన ఇది టీనేజ్ లవ్ స్టోరీ అనే ఫీల్ కలగదు. కథలోకి ప్రేక్షకులు ప్రవేశించడానికి కొత్త ఆర్టిస్టులు .. వాళ్ల అనుభవలేమి అడ్డుపడుతుంటాయి. పాయసంలో జీడిపప్పు మాదిరిగా ప్రేమకథలో పాటలు తగలాలి .. అప్పుడే ఆ కథ మనసు గోడలను మరింత గట్టిగా పట్టుకుంటుంది. అలాంటి పాటలు లేకపోవడం కూడా ఒక లోపంగానే అనిపిస్తుంది. కథా పరంగా 'ఎవ్వరికీ చెప్పొద్దు' అనే టైటిల్ ను మాత్రం దర్శకుడు బాగా సెట్ చేశాడు.
'హరి' పాత్రకి సహజత్వాన్ని తీసుకురావడానికి రాకేశ్ తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ ఈ టీనేజ్ లవ్ స్టోరీలో ఆయన ఇమడలేదనే అనిపిస్తుంది. ఇక నాయికగా గార్గేయి చాలా క్యూట్ గా కనిపిస్తుంది. అమ్మాయి కళ్లు ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. ఇటు ప్రేమికుడి కాంబినేషన్లోని ఎమోషనల్ సీన్స్ లోను .. అటు తండ్రి కాంబినేషన్ లోని ఎమోషనల్ సీన్స్ లోను చాలా చక్కని హావభావాలను ఆవిష్కరించింది. ఇక కథానాయిక తండ్రి పాత్రను చేసిన వంశీ నెక్కంటి కీలకమైన పాత్రకి న్యాయం చేశాడు. అవసరం - అవకాశం అనే అంశాలను బట్టి కులానికి ప్రాధాన్యతనిచ్చే తండ్రి పాత్రలో ఆయన ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేస్తాడు. ఇక తెరపై మరికొన్ని పాత్రలు సందడి చేసినా, అవి అంత గుర్తుంచుకోదగినవిగా అనిపించవు.
సంగీత దర్శకుడిగా శంకర్ శర్మ అందించిన బాణీల్లో 'అవునా ఇది నిజమేనా' .. 'ఇది చక్కని వేళ' .. అనే పాటలు బాగున్నాయి. హిమాలయాల్లో చిత్రీకరించిన పాట బాణీ మాత్రం కుదరలేదు. రీ రికార్డింగ్ కూడా సన్నివేశాలకి తగినట్టుగానే సాగింది. ఫొటోగ్రఫీ ఫరవాలేదు .. 'ఆపే వీలే లేని ఆనందం' అనే పాటలో హిమాలయాలను మరింత అందంగా చూపించాడు. ఇక ఎడిటింగ్ పై కూడా దర్శకుడు దృష్టిపెట్టినా, హీరోతో హీరోయిన్ బలవంతంగా అయ్యప్ప భజన చేయించడం వంటి అనవసరమైన సన్నివేశాలు ఒకటి రెండు కనిపిస్తాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి అనూహ్యమైన మలుపులు లేని ఒక సాదాసీదా ప్రేమకథ ఇది. హీరో .. హీరోయిన్ మధ్య బలమైన ప్రేమ సన్నివేశాలు లేకపోవడమే ఈ కథకి గల ప్రధానమైన బలహీనత. నాయకానాయికలు జోడీ కుదరకపోవడం .. మాటలేవీ మనసును చేరకపోవడం .. హృదయాన్ని బలంగా హత్తుకోని పాటలు .. మూడు పాత్రల మినహా మిగతా పాత్రలన్నీ తేలిపోవడం .. అవకాశం ఉన్నప్పటికీ కామెడీపై దృష్టిపెట్టకపోవడం లోపాలుగా అనిపిస్తాయి .. యూత్ ను అసంతృప్తికి గురిచేస్తాయి. ఇక తీసినంతలో ఎక్కడా హడావిడి లేకుండా .. అసభ్యతకు తావులేకుండా .. ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నందుకు మాత్రం దర్శకుడిని అభినందించవచ్చు.
























