వెంకటేశ్ కథానాయకుడిగా శైలేశ్ కొలను రూపొందించిన 'సైంధవ్' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. అందువలన సంఖ్యా పరంగా ఇది ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుంది. అభిమానులకి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. వాళ్ల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 'చంద్రప్రస్థ' అనే సముద్ర తీర ప్రాంతంలో మొదలవుతుంది. ఆ ప్రాంతానికి చెందిన మిత్ర (ముఖేష్ రుషి)కి మాఫియాతో సంబంధాలు ఉంటాయి. మైఖేల్ (జిషూ సేన్ గుప్తా) .. వికాస్ ( నవాజుద్దీన్ సిద్ధికీ) కూడా అతనితో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు. వికాస్ నమ్మిన వ్యక్తిగా జాస్మిన్ ( ఆండ్రియా) ఉంటుంది. వాళ్లంతా కలిసి డ్రగ్స్ .. అక్రమంగా ఆయుధాల రవాణా .. యువకులకు శిక్షణ ఇచ్చి .. తీవ్రవాద సంస్థలకు అమ్మేయడం చేస్తుంటారు.
ఆ ఊరుకు 'సైంధవ్' తిరిగొచ్చాడనే విషయం తెలిసి మిత్ర కంగారు పడిపోతాడు. అతని అనుచరులు .. సహచరులు అంతా భయపడిపోతారు. ఎందుకంటే ఎదురొచ్చింది ఎంతటివారైనా తప్పించడమే తప్ప, తప్పుకోవడం సైంధవ్' కి తెలియదు. శత్రువులు 'సైకో' అని పిలుచుకునే 'సైంధవ్', చాలా కాలం క్రితం అదే మాఫియా ముఠాలో పనిచేశాడు. చిన్నపిల్లలను తీవ్రవాదులుగా మార్చడమనే విషయంలో విభేదించి అతను ఆ ముఠాలో నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఆ ఊరు నుంచి కూడా వెళ్లిపోయిన అతను, మళ్లీ ఇప్పుడు తిరిగొస్తాడు.
'సైంధవ్'కి గాయత్రి (బేబి సారా పాలేకర్) అనే కూతురు ఉంటుంది. ఆ తండ్రీ కూతుళ్లకు ఆ పక్కింట్లోనే ఉండే మనోజ్ఞ ( శ్రద్దా శ్రీనాథ్)తో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. భర్త శాడిజాన్ని భరించలేక మనోజ్ఞ అతనికి దూరంగా .. ఒంటరిగా ఉంటూ ఉంటుంది. 'సైంధవ్' కూతురికి నరాలకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధి వస్తుంది. ప్రాణాంతకమైన ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే, 17 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వవలసి ఉంటుంది.
మిత్ర ముఠా .. పిల్లలను తీవ్రవాదులుగా మార్చుతూ ఉండటం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ, వాళ్లకి సంబంధించిన కంటైనర్ లను 'సైంధవ్' దాచేస్తాడు. దాంతో అతని కూతురుకి అవసరమైన ఇంజక్షన్ దొరక్కుండా వాళ్లు కట్టడి చేస్తారు. తమ కంటైనర్ లను తమకి అప్పగించి, ఆ ఇంజక్షన్ ను తీసుకెళ్లమని చెబుతారు. తన కూతురు మాదిరిగానే 300 మందికి పైగా పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న 'సైంధవ్' ఏం చేస్తాడు? మాఫియా ముఠాను ఎదిరించి తన కూతురును కాపాడుకోగలుగుతాడా? అనేది మిగతా కథ.
దర్శకుడు శైలేశ్ కొలను ఈ కథను యాక్షన్ - ఎమోషన్ కలిపి తయారు చేసుకున్నాడు. ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి కనిపిస్తాయి. ఓ కన్నతండ్రి తన బిడ్డను కాపాడుకోవాలి. అందుకు అవసరమైన డబ్బు కోసం తన శత్రువులనే ఆశ్రయించాలి. అందుకోసం సమాజానికి హాని కలిగించే మత్తుమందులను .. మందుగుండు సామగ్రిని వారికి అప్పగించాలి. అటు సమాజమా? ఇటు తన గారాల కూతురి ప్రాణమా? అనే ఒక డైలమాలో పడిపోయిన హీరో చివరికి ఏ నిర్ణయం తీసుకుంటాడు? అనేది శైలేశ్ రాసుకున్న తీరు బాగుంది.
శైలేశ్ కొలను ఈ కథలో యాక్షన్ - ఎమోషన్ ను మాత్రమే అండర్ లైన్ చేసుకున్నాడు. తండ్రీ కూతుళ్ల మధ్యనున్న బాండింగ్ ను మాత్రమే అతను హైలైట్ చేస్తూ వెళ్లాడు. అందువలన కనుచూపు మేరలో ఎక్కడా లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. డ్యూయెట్స్ కనిపించవు. ప్రధానమైన కథాంశంపైనే దర్శకుడు పూర్తిగా ఫోకస్ చేశాడు. అందువలన మిగతా అంశాలు లేవనే ఆలోచన ప్రేక్షకుడికి రాకుండా చూసుకున్నాడు.
తన కూతురును కాపాడుకోవాలనుకునే తాపత్రయం కలిగిన తండ్రి పాత్రలో వెంకటేశ్ కన్నీళ్లు పెట్టిస్తాడు. తన తండ్రి హీరో ... అతను ఉండగా తనకేమీ కాదనే నమ్మకంతో ఉన్న బిడ్డగా సారా నటన ఆకట్టుకుంటుంది. ఆ ఇద్దరికీ సహకరించే పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ మెప్పించింది. ఇక విలనిజం వైపుకు వచ్చేసరికి, ముఖేశ్ రుషి .. జిషూ సేన్ గుప్తా .. నవాజుద్దీన్ సిద్ధికీ పాత్రలను దర్శకుడు వరుసగా నిలబెట్టాడు. ఈ ముగ్గురిలో ఎవరిని మెయిన్ విలన్ గా చూపించాలనే విషయంలో తడబాటు కనిపిస్తుంది.
ఎందుకంటే ముఖేశ్ రుషి అప్పగించిన ఆపరేషన్ పూర్తి చేయడానికి నవాజుద్దీన్ సిద్ధికీ రంగంలోకి దిగుతాడు. ఈ విషయంలో అతను ముఖేశ్ రుషితో చీవాట్లు .. చెంపదెబ్బలు తింటాడు. ఆ తరువాత అతనికి కోట్ల రూపాయల ఖరీదు చేసే బిజినెస్ లు .. ఫ్లైయింగ్ క్లబ్ ఉన్నట్టుగా చూపించారు. ఇక ఆర్య - ఆండ్రియా పాత్రలకి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా ఉండదు. కాకపోతే తమ వంతుగా ఆ పాత్రలకి వాళ్లు న్యాయం చేశారు.
నిర్మాణ విలువల పరంగా వంకబెట్ట వలసిన అవసరం లేదు. లొకేషన్స్ హైలైట్ గా నిలిచాయి. సంతోష్ నారాయణ్ బాణీలు ఫరవాలేదు. 'బంగారమే ... బంగారమే' అంటూ పాపపై సాగే పాట మనసును భారం చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మణికందన్ కెమెరా పనితనం కూడా మెప్పిస్తాయి. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ కూడా ఓకే. ఈ కథలో ప్రధానమైనవిగా కనిపించే ఎమోషన్స్ ట్రాక్ కనెక్ట్ అవుతుంది. అలాగని రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ను తీసిపారేయలేం. కాకపోతే రక్తపాతం ఎక్కువగా కనిపిస్తుందంతే.
'సైంధవ్' - మూవీ రివ్యూ
| Reviews
Saindhav Review
- 'సైంధవ్'గా వచ్చిన వెంకటేశ్
- కనెక్ట్ అయిన ఎమోషన్స్
- స్థాయిని దాటేసిన యాక్షన్ సీన్స్
- లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ కి లేని చోటు
- వెంకటేశ్ నటన హైలైట్
- ప్రత్యేక ఆకర్షణగా లొకేషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ . ఫొటోగ్రఫీ
Movie Name: Saindhav
Release Date: 2024-01-13
Cast: Venkatesh Daggubati[, Shraddha Srinath, Nawazuddin Siddiqui, ,Mukesh Rishi, Arya, Ruhani Sharma. Andrea Jeremiah
Director: Sailesh Kolanu
Music: Santhosh Narayanan
Banner: Niharika Entertainment
Review By: Peddinti
Saindhav Rating: 2.75 out of 5
Trailer