'కోట బొమ్మాళి పీఎస్' (ఆహా) మూవీ రివ్యూ

Kota Bommali PS

Kota Bommali PS Review

  • నవంబర్ 24న విడుదలైన 'కోట బొమ్మాళి పీఎస్'
  • మలయాళంలో వచ్చిన 'నాయట్టు'కి ఇది రీమేక్
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • అవినీతి రాజకీయాల చుట్టూ అల్లుకున్న కథ 
  • శ్రీకాంత్ - వరలక్ష్మి శరత్ కుమార్ నటన హైలైట్

ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై మలయాళ సినిమాల రీమేకుల సందడి ఎక్కువైంది. అలా మలయాళం నుంచి వచ్చిన మరో రీమేక్ గా 'కోటబొమ్మాళి పీఎస్' కనిపిస్తుంది. 2021లో మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాయట్టు' సినిమాకి ఇది రీమేక్. నవంబర్ 24వ తేదీన తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా, ఫరవాలేదనిపించుకుంది. ఈ రోజు నుంచే ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

రామకృష్ణ (శ్రీకాంత్) 'కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్' లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే పోలీస్ స్టేషన్ లో రవి (రాహుల్ విజయ్) కుమారి (శివాని రాజశేఖర్) కానిస్టేబుల్స్ గా పనిచేస్తుంటారు. కోట బొమ్మాళిలో ఒక వర్గం వారి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. అందువలన వాళ్లు రౌడీయిజాన్ని చెలాయిస్తూ ఉంటారు. వాళ్లను టచ్ చేస్తే తమ ఓటు బ్యాంకు పోతుందని రాజకీయనాయకులు భయపడుతూ ఉంటారు. పైగా అక్కడ బై ఎలక్షన్స్ కి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి

కుమారిని లోకల్ గా ఉన్న 'మున్నా' గ్యాంగ్ తరచూ ఏడిపిస్తుండటంతో, ఆమె సీఐ దృష్టికి తీసుకుని వెళుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మున్నా, అక్కడ రామకృష్ణ - రవితో గొడవపడతాడు. ఆ తతంగాన్ని మున్నా ఫ్రెండ్ రాజారావు వీడియో తీయడంతో గొడవ మరింత పెద్దది అవుతుంది.  ఆ తరువాత రామకృష్ణ - రవి - కుమారి కలిసి ఒక ఫంక్షన్ కి వెళతారు. అక్కడి నుంచి తిరిగి బయల్దేరే సమయానికి బాగా చీకటి పడుతుంది. రామకృష్ణ తాను తాగేసి ఉండటం వలన, తన మేనల్లుడు రాహుల్ ను జీప్ డ్రైవ్ చేయమని చెబుతాడు. 

ఆ రాత్రి వాళ్లు తిరిగివస్తుండగా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. బైక్ పై ఎదురుగా వస్తున్న మున్నా ఫ్రెండ్ రాజారావు ఆ ప్రమాదంలో చనిపోతాడు. ప్రమాదం జరగ్గానే అక్కడి నుంచి రాహుల్ పారిపోతాడు. మున్నాపై కోపంతో కావాలనే రాజారావును రామకృష్ణ టీమ్ చంపిందని విలన్ గ్యాంగ్ భావిస్తుంది. పరిస్థితిని సీఐకి చెప్పడానికి రామకృష్ణ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది. తమ అరెస్టుకి సీఐ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడని గ్రహించిన రామకృష్ణ, రవి .. కుమారితో కలిసి పారిపోతాడు.

తమ వర్గానికి సంబంధించిన రాజారావు చనిపోవడంతో మున్నా ముఠా గొడవలు చేయడం మొదలుపెడుతుంది. పారిపోయిన ముగ్గురు పోలీసులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఆ వర్గం నుంచి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో, 24 గంటల్లో వాళ్లను పట్టుకుని కోర్టుముందు నిలబెడతామని హోమ్ మినిస్టర్ బరిసెల జయరాజ్ (మురళీ శర్మ) హామీ ఇస్తాడు. తన మాట నిలబెట్టుకోవడం కోసం స్పెషల్ ఆఫీసర్ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) ని రంగంలోకి దింపుతాడు. 

ఎన్నికలు పూర్తయ్యేవరకూ తాము ఎక్కడైనా తలదాచుకుంటే, ఆ తరువాత చట్టం తమని కాపాడుతుందని రామకృష్ణ భావిస్తాడు. కానీ ఓటు బ్యాంకు కోసం కొంతమంది రాజకీయ నాయకులు తమని ఈ కేసుకి బలి చేయాలనుకుంటున్నారనే విషయం అతనికి అర్థమవుతుంది. అప్పుడు రామకృష్ణ ఏం చేస్తాడు?  అతను చాలా తెలివైనవాడనీ, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కూడా పేరు ఉందని తెలుసుకున్న రజియా అలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? 24 గంటల్లోగా వాళ్లను ఆమెను పట్టుకోగలుగుతుందా?  ఇచ్చినమాటను హోమ్ మినిస్టర్ నిలబెట్టుకోగలుగుతాడా? అనేది మిగతా కథ. 

తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మలయాళ కథలో తెలుగు నేటివిటీకి తగినట్టుగా చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశారు. మిగతా సన్నివేశాలను అదే పద్ధతిలో చిత్రీకరణ చేశారు. సాధారణంగా నేరస్థులను పోలీసులు వెంటాడుతుంటారు. పోలీసులను పోలీసులే వెంటాడడమనేది ఈ కథలోని కొత్త పాయింట్. స్థానికంగా ఉండే రాజకీయాలకు .. రౌడీయిజానికి మధ్య ముగ్గురు పోలీసుల జీవితాలు ఎలా బలయ్యాయనేది ఈ కథలోని ఆసక్తికరమైన అంశం. 

కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ సహజత్వానికి చాలా దగ్గరగా నడుస్తుంది. కథలో ఎక్కడా లవ్ .. రొమాన్స్ .. కామెడీకి అవకాశం లేదు. ఒక ప్రమాదం .. మర్డర్ గా చిత్రీకరించబడటం వలన పోలీసులు పడే ఇబ్బంది చుట్టూ ఈ కథ సీరియస్ గా తిరుగుతుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇటు శ్రీకాంత్ యాక్షన్ ... అటు స్పెషల్ ఆఫీసర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. 

భారీగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేని కంటెంట్ ఇది. రంజిన్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. జగదీశ్ చీకటి ఫొటోగ్రఫీ మెప్పిస్తుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా ఓకే. సాధారణంగా మలయాళ సినిమాలు వాస్తవానికి చాలా దగ్గరగా వెళతాయి. కథకి తగిన ముగింపు ఉండాలనే వాళ్లంతా కోరుకుంటారు. ఈ కథ వరకూ ఇక్కడి ప్రేక్షకులు కూడా అలాంటి  ఆలోచనే చేస్తే, ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.

Movie Name: Kota Bommali PS

Release Date: 2024-01-11
Cast: Srikanth, Varalaxmi Sarathkumar, Rahul Vijay, Shivani Rajashekar, Murali Sharma
Director: Teja Marni
Music: Ranjin Raj
Banner: GA2 Pictures

Kota Bommali PS Rating: 2.75 out of 5

Trailer

More Reviews