ఈ మధ్య కాలంలో సస్పెన్స్ తో సాగే కథలను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి ఒక సస్పెన్స్ తో కూడిన డ్రామా నేపథ్యంతో సాగిన సినిమానే 'ది ట్రయల్'. నవంబర్ 24 తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. చిన్న సినిమాలు గుంపుగా థియేటర్స్ కి వచ్చి వెళుతుండటం వలన, అవి ప్రేక్షకులకు గుర్తుండటం లేదు. అలాంటి సినిమాలలో ఒకటి 'ది ట్రయల్' అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఈ నెల 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.
అజయ్ (యుగ్ రామ్) .. రూప (స్పందన పల్లి) భార్యాభర్తలు. రూప పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటుంది. అజయ్ కి పేరెంట్స్ ఉంటారు. రూపకి తండ్రి మాత్రమే ఉంటాడు. మొదటి పెళ్లిరోజున అజయ్ అనుమానాస్పదంగా చనిపోతాడు. అపార్టుమెంట్ పై భాగం నుంచి పడిపోయిన అతను, స్పాట్ లోనే చనిపోతాడు. ఆ సమయంలో అతని పక్కన రూప మాత్రమే ఉంటుంది. ఆ కేసుకి సంబంధించిన విచారణను రాజీవ్ (వంశీ) మొదలెడతాడు.
అజయ్ చనిపోయిన రెండు వారాలకు, అజయ్ కజిన్ వైష్ణవి, పోలీస్ ఆఫీసర్ రాజీవ్ ను కలుసుకుంటుంది. అజయ్ రాసిన డైరీ తనకి దొరికిందని చెప్పి, దానిని రాజీవ్ కి అందజేస్తుంది. రూప పెడుతున్న టార్చర్ భరించలేకపోతున్నట్టు ఆ డైరీలో అతను రాసుకున్నాడనీ, అతని చావుకు ఆమెనే కారణమని చెబుతుంది. ఆ తరువాత అజయ్ స్నేహితుడు శేఖర్ వచ్చి రాజీవ్ ను కలుస్తాడు. రూప - అజయ్ ల మధ్య అబార్షన్ విషయంలో జరిగిన గొడవ గురించి చెబుతాడు.
అజయ్ మానసిక పరమైన ఒత్తిడిని తట్టుకోవడం కోసం, తన దగ్గరికి వచ్చేవాడని మానసిక వైద్య నిపుణుడు చెబుతాడు. రూప కారణంగానే అతనలా మారిపోయాడనే విషయం అతని మాటల వలన తనకి అర్థమైందని ఆ డాక్టర్ చెబుతాడు. దాంతో రూపను స్టేషన్ కి తీసుకొచ్చిన రాజీవ్, అన్ని వైపులా నుంచి విచారణ జరుపుతాడు. డైరీలో అజయ్ రాసిన విషయాలకు పూర్తి భిన్నంగా ఆమె చెబుతుంది. తాను అజయ్ ను చంపలేదని అంటుంది.
అప్పుడు రాజీవ్ ఏం చేస్తాడు? అతను ఎలాంటి ఆధారాలను సంపాదిస్తాడు? అజయ్ కుటుంబ సభ్యులు అనుమానించినట్టుగా అతణ్ణి ఆమెనే హత్య చేసిందా? అజయ్ ఎలా చనిపోయాడు? అజయ్ తన డైరీలో రాసుకున్న విషయాల్లో నిజం ఉందా? లేదంటే రూప చెప్పిన విషయాల్లో నిజం ఉందా? అనే సందేహాలను రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.
దర్శకుడు రామ్ గన్ని తెరకెక్కించిన కథ ఇది. వివాహమై ఏడాది మాత్రమే పూర్తిచేసుకున్న ఒక జంట. హఠాత్తుగా భర్త చనిపోవడం .. భార్యను అంతా అనుమానించడం జరుగుతుంది. తాను చంపలేదని ఆమె చెబుతున్న దాంట్లో నిజం ఉందా? చనిపోవడానికి ముందు వరకూ అతను రాసుకున్న డైరీలో నిజం ఉందా? అనే అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. భార్య ... భర్త .. ఓ పోలీస్ ఆఫీసర్ .. ప్రధానమైన ఈ మూడు పాత్రలతోనే కథ కొనసాగుతుంది. మరో నాలుగు పాత్రలు గెస్టు రోల్స్ గా వచ్చి వెళతాయంతే.
పోలీస్ ఆఫీసర్ విచారణలో భాగంగా .. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ గా సన్నివేశాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి వెళుతూ ఉంటాయి. ఒకే సన్నివేశాన్ని పలు కోణాల్లో చూపిస్తూ .. ఆసక్తిని పెంచడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతను నామమాత్రపు మార్కులనే సాధించాడు. ఇల్లు - విచారణ గది - అపార్ట్ మెంట్ పై భాగం .. ఇవే ఈ కథ నడిచే ప్రదేశాలు. అంతకుమించి కథ కాలు బయటికి పెట్టదు.
ఒకే సీన్ ను వివిధ కోణాల్లో చూపిస్తూ ... అసలు సీన్ ఏమిటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ సాగిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రయత్నమే దర్శకుడు ఇక్కడ చేశాడు. అయితే ఎక్కడా ఎలాంటి హడావిడి లేకుండా ఈ కథ కూల్ గా .. తాపీగా నడుస్తుంది. ఆ తరువాత ఏం జరగనుందనే ఒక కూతూహలం ఏ సందర్భంలోను తలెత్తదు. చివర్లో ఉన్న ట్విస్ట్ కూడా ఎవరూ ఊహించనిదేమీ కాదు. ఆ ఒక్కటి పక్కన పెడితే ... ఇది సాదా సీదాగా సాగే ఒక డ్రామాగానే కనిపిస్తుంది.
స్పందన పల్లి తప్ప మిగతావాళ్లు ఎవరికీ తెలియదు. సాయికుమార్ దారా ఫొటోగ్రఫీ .. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం ... శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ ఫరవాలేదు. దర్శకుడు లవ్ .. రొమాన్స్ ... కామెడీ వైపు ఈ కథను కన్నెత్తి చూడనీయలేదు. వినోదానికి అవసరమైన అంశాలకి అవకాశం ఇవ్వకుండా, బలమైన పునాదులు లేకుండా కనిపించే ఈ కథ, కేవలం క్రైమ్ సీన్ చుట్టూనే తిరుగుతుంది ... తిప్పుతుంది అంతే.