'కాలింగ్ సహస్ర' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

Calling Sahasra

Calling Sahasra Review

  • సుధీర్ హీరోగా రూపొందిన 'కాలింగ్ సహస్ర'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో నడిచే సినిమా  
  • నిదానంగా .. తాపీగా సాగే కథనం 
  • సుధీర్ మేజిక్ కి దూరంగా కనిపించే కథ 
  • నిన్నటి నుంచే మొదలైన స్ట్రీమింగ్      

బుల్లితెరపై క్రేజ్ తో వెండితెరకి పరిచయమైన సుధీర్, హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'కాలింగ్ సహస్ర'. డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించిన ఈ సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ జరుగుతోంది. ఈ సినిమా కథాకథనాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
 
అజయ్ (సుధీర్) సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక యాప్ ను డెవలప్ చేస్తూ ఉంటాడు. అలాగే ఫీమేల్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని యాప్స్ రూపకల్పనలో అతను కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. అతని అక్కయ్య 'శైలజ' అనుమానాస్పదంగా మరణిస్తుంది. అప్పటి నుంచే అతను తన ప్రొఫెషన్ పై పూర్తి దృష్టి పెడతాడు. తన మిత్రుడు సత్య (రవితేజ నన్నిమాల) దగ్గర ఉంటూ జాబ్ చేస్తూ ఉంటాడు. జాబ్ చేయడం కోసం సిటీకి వచ్చిన స్వాతి (డాలీషా)తో అతనికి పరిచయమవుతుంది.

ఇక శివ (శివ బాలాజీ) అనాథ శరణాలయాలలో ఉంటూ చదువుకుని, జాబ్ కోసం ట్రై చేసే అమ్మాయిలకు సాయం చేస్తుంటాడు. తన పరపతిని ఉపయోగించి వారికి ఆయా సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తూ ఉంటాడు. గతంలో అతను 'రెడ్ రూమ్'కి వెళ్లి వచ్చాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లినవారిలో నుంచి చావు తప్పించుకుని బయటపడింది తాను మాత్రమేనని అతను కూడా చెప్పుకొంటూ ఉంటాడు. నేరస్థులను శిక్షించమని స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

నగరానికి దూరంగా .. ఓ నిర్జన ప్రదేశంలో 'రెడ్ రూమ్'ను ఒకరు అజ్ఞాతంగా నిర్వహిస్తూ ఉంటారు. భార్య దగ్గర నుంచి బాస్ వరకూ ఎవరిపై కోపం ఉన్నా, ఇక్కడికి వచ్చి ఆ కోపాన్ని అమ్మాయిలపై తీర్చుకోవచ్చు. అందుకు అవసరమైన అమ్మాయిలను కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకుని వస్తుంటారు. 'లూసిఫర్' యాప్ ద్వారా అక్కడికి చేరుకునే కస్టమర్స్, అమ్మాయిలను అత్యంత దారుణంగా హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. 

ఈ నేపథ్యంలోనే 'సారా' అనే ఒక యువతి నుంచి అజయ్ కి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో ఎంతో ఫీల్ ఉండటంతో ఆమె అడ్రెస్ ను వెతికి పట్టుకునే ప్రయత్నంలో అతను ఉంటాడు. అదే సమయంలో  ఆఫీసు వర్క్ నిమిత్తం అజయ్ కొత్తగా ఒక 'సిమ్' తీసుకుంటాడు. అప్పటి నుంచి 'సహస్ర' కావాలంటూ ఆమె కోసం అనేక కాల్స్ వస్తూ ఉంటాయి. సహస్ర ఎవరు? ఆమె కోసం తన నెంబర్ కి ఎందుకు కాల్ చేస్తున్నారు? అనే సందేహం అజయ్ కి కలుగుతుంది.

అజయ్ ను స్వాతి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటుంది. పరోక్షంగా అతనికి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కానీ అజయ్ దృష్టి అంతా కూడా 'సారా' అడ్రెస్ పట్టుకోవడం .. సహస్ర ఎవరనేది తెలుసుకోవడంపైనే ఉంటుంది. తనని అజయ్ ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో స్వాతి అలుగుతుంది. ఆ కోపంతోనే అతనికి దూరంగా వెళ్లాలని అనుకుంటుంది. ఆ సమయంలోనే రెడ్ రూమ్' గ్యాంగ్ వాళ్ల చేతిలో కిడ్నాప్ కి గురవుతుంది. 

అప్పుడు అజయ్ ఏం చేస్తాడు? 'సారా' ఎవరు? అతనిని కలుసుకోవడానికి ఆమె ఎందుకు తాపత్రయ పడుతోంది? సహస్ర ఎవరు? ఆమె ఏమైపోతుంది? స్వాతిని 'రెడ్ రూమ్' గ్యాంగ్ నుంచి కాపాడటానికి అజయ్ ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? రెడ్ రూమ్  గ్యాంగ్ వెనుక ఉన్న నాయకుడు ఎవరు? అనేవి ఈ కథలోని ముఖ్యమైన అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి.

ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు, కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను అరుణ్ విక్కిరాల అందించాడు. ఒక వైపున లవ్ .. మరో వైపున సస్పెన్స్ .. ఇంకో వైపున క్రైమ్ అనే అంశాలను కలుపుకుంటూ, వాటికి హారర్ టచ్ ఇస్తూ ఆయన ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. అలాగే సిస్టర్ సెంటిమెంట్ వైపు నుంచి కూడా ఎమోషన్ ను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ, సత్య పాత్ర ద్వారా కామెడీ కూడా కాసింత ఉందనిపించాడు. 

హీరో ట్రాక్ వైపు నుంచి సస్పెన్స్ .. హీరోయిన్ ట్రాక్ వైపు నుంచి హారర్ ను ఆవిష్కరించిన దర్శకుడు, విలన్ వైపు నుంచి క్రైమ్ ను చూపించాడు. సాధారణంగా ఒకరిపై విపరీతమైన కోపం ఉన్నప్పుడు .. వాళ్లపై ఆ కోపాన్ని తీర్చుకోలేకపోయినప్పుడు .. మరొకరిపై ఆ కోపాన్ని .. కసిని చూపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటివారిని ఒక యాప్ ద్వారా రప్పించి .. అమాయకులైన అమ్మాయిలను వాళ్ల శాడిజానికి బలిచేయడమనే కాన్సెప్ట్ తో ఈ కథ నడుస్తుంది. 

ఈ కథ మొదలైన దగ్గర నుంచి కథనంలో వేగం కనిపించదు. అలా నిదానంగా .. తాపీగా నడుస్తూ ఉంటుంది. అలాగే సస్పెన్స్  .. హారర్ అనే అంశాలను కూడా ఉత్కంఠభరితంగా చెప్పలేకపోయారు. యాక్షన్ సీన్స్ ఉన్నాయిగానీ .. అవి ఒక ప్రత్యేకమైన మార్క్ లో కనిపించవు. క్రైమ్ ట్రాక్ కి సంబంధించిన ఎపిసోడ్ లో హింస ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది. రంపం పెట్టి కోయడం .. కుర్చీలో కూర్చోబెట్టి మేకులు కొట్టడం వంటివి ఇబ్బంది పెడతాయి. 

నిజానికి సుధీర్ మంచి డాన్సర్ .. కామెడీ కూడా తను బాగా చేయగలడనే విషయం చాలామందికి తెలుసు. ఇక లవ్ .. రొమాన్స్ కి సంబంధించిన సీన్స్ ను కూడా తను చాలా ఈజ్ తో చేయగలడు. కానీ ఈ కథలో ఆయనను ఆ వైపు వెళ్లనీయక పోవడం ఆడియన్స్ కి కాస్త అసంతృప్తిని కలిగించే విషయమే. హీరోయిన్స్ పెద్దగా ఎవరికి తెలియకపోవడం ఒక మైనస్ గా మారిందనే చెప్పాలి. అలాగే సాఫ్ట్ రోల్స్ కి మాత్రమే సెట్టయ్యే శివబాలాజీని నెగెటివ్ షేడ్స్ లో చూపించడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. 

మోహిత్ రహ్మానిక్ అందించిన బాణీలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. శశి కిరణ్ ఫొటోగ్రఫీ బాగుంది. గ్యారీ బీ హెచ్ ఎడిటింగ్ ఓకే. ఒక నటుడిగా సుధీర్ బలాబలాలు ఏమిటో వాటిని ఉపయోగించుకుంటూ, ఈ కథను ఆవిష్కరించడానికి ట్రై చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. 

Movie Name: Calling Sahasra

Release Date: 2024-01-01
Cast: Sudheer, Dolly Sha, Spandana Palli, Shiva Balaji, Raviteja Nannimala
Director: Arun Vikkirala
Music: Mark. K. Robin
Banner: Radha Arts

Calling Sahasra Rating: 2.25 out of 5

Trailer

More Reviews