సాధారణంగా సంపూర్ణేశ్ బాబు సినిమాలు హాస్య ప్రధానమైనవిగా కనిపిస్తాయి. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆయన 'మార్టిన్ లూథర్ కింగ్' అనే సినిమాను చేశాడు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన, థియేటర్స్ కి ఈ సినిమా వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే 'సోనీ లీవ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
'పడమరపాడు' అనే గ్రామానికి కాశీ విశ్వనాథ్ (రాఘవన్) ప్రెసిడెంటుగా ఉంటాడు. ఆయనకి ధనమ్మ - భాగ్యం అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ధనమ్మ తనయుడే జగన్ (నరేశ్) భాగ్యం తనయుడు 'లోకి' ( వెంకటేశ్ మహా). జగన్ కీ .. లోకి కి మొదటి నుంచి కూడా సఖ్యత ఉండదు. ఒకరిని చూసి ఒకరు చిటపటలాడుతుంటారు. జగన్ మిల్లు .. వాటర్ సప్లై వంటి బిజినెస్ లు చేస్తుంటాడు. 'లోకి' ఒక బార్ ను రన్ చేస్తూ ఉంటాడు. ఆ ఇద్దరి పట్ల కూడా తండ్రికి సరైన అభిప్రాయం ఉండదు.
ఊరు బాగుండాలి .. కుల మతాలకు దూరంగా అందరూ సఖ్యతగా ఉండాలనేది కాశీ విశ్వనాథ్ ఉద్దేశం. అందరూ ఆయనను 'పెద్దయ్య' అంటూ పిలుస్తుంటారు .. ఆయన మాటకు మర్యాద ఇస్తుంటారు. ఆ ఊళ్లో మార్బుల్స్ కి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టాలని ఎమ్మెల్యే నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో అతనిని సపోర్టు చేయడానికి పెద్దయ్య నిరాకరిస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే పెద్దయ్యకి పక్షవాతం రావడంతో, ప్రెసిడెంట్ పదవి కోసం ఇద్దరు కొడుకులు పోటీ పడతారు.
ఆ ఇద్దరిలో ప్రెసిడెంట్ గా ఎవరు గెలిచినా, ఆ ఊళ్లో ఫ్యాక్టరీ పెట్టే విషయంలో తనకి సపోర్టు చేస్తే 30 కోట్లు ఇస్తానని జగన్ - 'లోకి'తో ఎమ్మెల్యే చెబుతాడు. ఊళ్లో జనాలు రెండుగా చీలిపోతారు. ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తాయని తేలుతుంది. దాంతో మరొక్క ఓటు ఎవరు వైపు వస్తే వాళ్లు గెలిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలోనే 'మార్టిన్ లూథర్ కింగ్'కి ఓటర్ కార్డు వస్తుంది. దాంతో అతనిని తమ వైపుకు తిప్పుకోవడానికి అన్నదమ్ములు రంగంలోకి దిగుతారు.
'మార్టిన్ లూథర్ కింగ్' ( సంపూర్ణేష్ బాబు) విషయానికి వస్తే, అతను 'పడమరపాడు' గ్రామం మధ్యలో .. ఓ చెట్టుక్రింద చెప్పులు కుడుతూ జీవిస్తుంటాడు. అతను ఒక అనాథ .. అతనికంటూ ఒక పేరు లేదు. అతను కష్టపడి చెట్టు తొర్రలో దాచుకున్న డబ్బులను ఎవరో కాజేస్తారు. అలాంటి సమయంలోనే ఆ గ్రామానికి పోస్ట్ మెన్ గా వసంత (శరణ్య ప్రదీప్) వస్తుంది. ఆమెనే అతనికి 'మార్టిన్ లూథర్ కింగ్' అనే పేరు పెడుతుంది. అతనికి ఓటర్ కార్డు వచ్చేలా చేసింది కూడా ఆమెనే.
అమాయకుడు ... మంచివాడు అయిన మార్టిన్ లూథర్ కింగ్ ను అప్పటివరకూ పట్టించుకోని జగన్ - లోకి ఇద్దరూ కూడా 'ఓటు' కోసం కాకా పట్టడం మొదలుపెడతారు. వాళ్లని నమ్మొద్దని వసంత అతనిని హెచ్చరిస్తుంది. తన ఓటు కోసం .. ప్రెసిండెంటుగా గెలవడం కోసం ఎందుకు వాళ్లు అంతగా ఆరాట పడుతున్నారనే విషయం అతనికి తెలుస్తోంది. ఎమ్మెల్యే ఇస్తానని చెప్పిన 30 కోట్ల కోసమే వాళ్లు అలా చేస్తున్నారని భావించిన 'మార్టిన్ లూథర్ కింగ్' ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేదే కథ.
ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ .. అక్కడి రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ. అమాయకుడి చేతిలోని ఓటు కూడా ఆయుధం లాంటిదే అని నిరూపించే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇంతవరకూ సంపూర్ణేష్ బాబు తాను హీరోగా చేసిన సినిమాల్లో, తానే ప్రధానంగా కనిపిస్తూ వచ్చాడు. అయితే ఈ కంటెంట్ లో అతనికి హీరో స్థానం ఇచ్చినప్పటికీ, నరేశ్ - వెంకటేశ్ మహా పాత్రలతో సమానంగా మాత్రమే కనిపిస్తాడు.
ఇక సంపూర్ణేశ్ బలం .. బలగం అతని మేనరిజమ్స్. అతను నాన్ స్టాప్ గా చెప్పే డైలాగ్స్ .. అతని కామెడీ టైమింగ్. కానీ వీటన్నిటి నుంచి అతని పాత్రను దూరంగా తీసుకుని వెళ్లారు. అతని పాత్రను అమాయకంగా .. అనాథగా డిజైన్ చేయడం వలన, అతను యాక్టివ్ గా ఏమీ చేయలేకపోయాడు. దాంతో ఆడియన్స్ డీలాపడిపోయారు. ఇక ఈ సినిమాలో ఆయనకి హీరోయిన్ లేదు .. డాన్సులు లేవు. ఆడియన్స్ నిరాశ చెందడానికి ఇది మరొక కారణంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో నరేశ్ .. సంపూ .. శరణ్య ప్రదీప్ మినహా, మిగతా వారి ముఖాలు పరిచయం లేనివే. ఎవరి పాత్రకి వారు న్యాయం చేశారు. ఏ మాత్రం కామెడీ టచ్ లేని తన పాత్రను సంపూ సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లాడు. కథా పరంగా .. పాత్ర పరంగా సంపూను చూపించిన విధానం కరెక్టే. కానీ అందువలన ఆయన నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలు మిస్సయ్యాయి.
ఈ కథలో మంచి పాయింట్ ఉంది. కానీ దానిని బలమైన సన్నివేశాలతో .. బలమైన పాత్రలతో చెప్పించలేకపోయారు. వెంకటేశ్ మహా అందించిన స్క్రీన్ ప్లే తేలిపోయింది. డైలాగ్స్ పరంగా కూడా విషయం కనిపించలేదు. స్మరణ్ సాయి సంగీతం .. దీపక్ ఫొటో గ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, 'టాయిలెట్' ఓపెనింగ్ సీన్ .. వేలం పాట సీన్ .. హీరోను ఓటు కోసం కాకాపట్టే సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ట్రిమ్ చేస్తే బాగుండేది. ఓటు ఎంత విలువైనదనే విషయంలో మంచి మెసేజ్ ఉన్నప్పటికీ, సంపూ మార్క్ కి దూరంగా వెళ్లడం వలన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
'మార్టిన్ లూథర్ కింగ్' (సోనీ లివ్) మూవీ రివ్యూ
| Reviews
Martin Luther King Review
- 'మార్టిన్ లూథర్ కింగ్' గా సంపూ
- గ్రామీణ రాజకీయాల చుట్టూ తిరిగే కథ
- అమాయకుడిగా సంపూ యాక్టింగ్ హైలైట్
- ఆయన మార్క్ కామెడీ కనిపించని సినిమా
- ఆ విషయంలోనే ఆడియన్స్ అసంతృప్తి
Movie Name: Martin Luther King
Release Date: 2023-11-29
Cast: Sampoornesh Babu, Naresh, Venkatesh Maha, Raghavan, Sharanya Pradeep
Director: Puja Kolluru
Music: Smaran Sai
Banner: YNOT Studios
Review By: Peddinti
Martin Luther King Rating: 2.50 out of 5
Trailer