అమెజాన్ ప్రైమ్ ద్వారా మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా నడిచే డిటెక్టివ్ డ్రామా ఇది. తాన్య మానిక్తలా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 3వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ట్రైలర్ తోనే ఉత్కంఠను పెంచుతూ వెళ్లిన ఈ సిరీస్, ఏ స్థాయిలో మెప్పించిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ కోల్ కతాకీ .. తూర్పు హిమాలయాలకు మధ్య జరుగుతుంది. కోల్ కతాలో మీనాక్షి అయ్యర్ (తాన్యా) అనే ఓ పాతికేళ్ల యువతి ప్రైవేట్ డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఒక కేసు తీసుకుందంటే, బాస్ చెప్పినా ఇక దాని నుంచి వెనక్కి తగ్గదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెకి 'జోయ్' అనే తమ్ముడు మాత్రమే ఉంటాడు. మీనాక్షి చేసిన కారు ప్రమాదం వలన, అతను కూడా 'కోమా'లో ఉంటాడు. అతన్ని బ్రతికించుకోవడానికి ఆమె నా తంటాలు పడుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఒక రోజున ఆమె ముందు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ట్రక్ ఢీ కొట్టడంతో 'పార్ధు' అనే యువకుడు స్పాట్ లో చనిపోతాడు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదనీ. తన కొడుకును కావాలనే చంపేశారని మీనాక్షికి పార్ధు తల్లి చందన్ డే ( జరీనా వాహెబ్) చెబుతుంది. ప్రమాదం జరగడానికి ముందురోజు రాత్రి, తన కొడుకును ఇద్దరు వ్యక్తులు రహస్యంగా కలిశారని అంటుంది. దాంతో మీనాక్షి ఆ దిశగా తన పరిశోధన మొదలుపెడుతుంది.
ఇది ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే అనుకుని మీనాక్షి రంగంలోకి దిగుతుంది. కానీ ఇది తాను అనుకున్నంత తేలికైన కేసు కాదనే విషయం పోను పోను ఆమెకి అర్థమవుతుంది. పార్ధు చాలా తెలివైనవాడనీ, అతను కొంతకాలం పాటు వైరస్ ల పై తన పరిశోధనను కొనసాగిస్తూ, ఒక కొత్తరకం వైరస్ ను కనుక్కున్నాడనే విషయాన్ని తెలుసుకుంటుంది. ఆ వైరస్ ను అతని నుంచి చేజిక్కుంచుకోవడం కోసం ఒక ముఠా అతణ్ణి అంతం చేసిందని గ్రహిస్తుంది.
పార్థు పరిశోధన ... ఆయన పరిశోధనతో సంబంధాలున్న వ్యక్తులను కలుసుకోవడం కోసం ఆమె తూర్పు హిమాలయాలకు వెళుతుంది. అక్కడ డాక్టర్ రాఖావ్ (జిషు సేన్ గుప్తా)ను కలుసుకుంటుంది. అతని ద్వారా ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? కొత్త వైరస్ వ్యాప్తి ఆల్రెడీ మొదలైపోయిందని తెలుసుకున్న ఆమె ఏం చేస్తుంది? పార్ధు హత్య కేసు వెనక ఎవరెవరున్నారు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ ముందుకు వెళుతుంది.
ఈ సిరీస్ కి అరిందం మిత్ర - రోనాక్ కామత్ కథను అందించారు. దేబాలోయ్ భట్టాచార్య ఈ కథకి దృశ్య రూపాన్ని ఇచ్చాడు. 8 ఎపిసోడ్స్ కలిగిన ఈ కథలో చాలానే పాత్రలు కనిపిస్తాయి. ఒక సాధారణ ప్రైవేట్ డిటెక్టివ్, తనముందున్న పెను సవాళ్లను ఎలా ఎదుర్కొందనేదే కథ. దర్శకుడు మీనాక్షి పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. అయితే ఆమె చుట్టూ ఉన్న పాత్రలను డమ్మీలుగా చేయడం వలన, పూర్తి ఫోకస్ ఆమె పాత్ర మీదకే వెళుతుంది. ప్రమాదకరమైన పనులను ఆమె చాలా తాపీగా చేస్తూ వెళుతూ ఉండటం అసంతృప్తిని కలిగిస్తుంది.
ఇది కేవలం ఒక హత్యకి సంబంధించిన కేసు మాత్రమే అయితే, తాపీగా నడిపించినా ఫరవాలేదు. కానీ ఆ హత్యతో ముడిపడిన ఒక ప్రమాదకర వైరస్ కి సంబంధించిన అంశం ఇది. ఒక వైపున దేశాన్ని కబళించడానికి రెడీ అవుతున్న వైరస్ .. మరో వైపున దానిని తమ బిజినెస్ కి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే స్వార్థపరులు .. వాళ్ల బండారాన్ని బయటపెట్టడానికి ట్రై చేసే మీనాక్షి. ఈ వ్యవహారం చాలా ఫాస్టుగా .. ప్రతి నిమిషం విలువైనదే అన్నట్టుగా నడవాలి.
ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఒక కుతూహలం ఆడియన్స్ లో తలెత్తుతూ ఉండాలి. కానీ అలాంటి హడావిడి ఏదీ కూడా ఏ 8 ఎపిసోడ్స్ లో కనిపించదు. దర్శకుడు ఈ కథను మొదటి నుంచి చివరి వరకూ కూడా చాలా కూల్ గా నడిపించాడు. ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మీనాక్షి మళ్లీ వెనక్కి వెళ్లడం కూడా ఆడియన్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది. ఈ సీజన్ కి సంబంధించిన క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాదు. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సెకండ్ సీజన్ కోసం మిగిలే ఉన్నాయి.
కథ ... కథనాలు ఓకే. కానీ వాటిలో అవసరమైనంత స్పీడ్ కనిపించదు. అమిత్ ఛటర్జీ - రోహిత్ కులకర్ణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ కథకి లొకేషన్స్ హైలైట్ గా చెప్పుకోవాలి. తూర్పు హిమాలయ ప్రాంతాలను కవర్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంద్ర మారిక్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. సౌరభ్ ప్రభుదేశాయ్ ఎడిటింగ్ వర్క్ కూడా ఓకే. స్క్రీన్ ప్లేలో స్పీడ్ చూపించినట్టయితే, తప్పకుండా ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేది.
'పి.ఐ.మీనా' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ
| Reviews
P.I.Meena Review
- మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన 'పి.ఐ.మీనా'
- నిదానంగా సాగే కథాకథనాలు
- హైలైట్ గా నిలిచే లొకేషన్స్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కెమెరా వర్క్ ఓకే
Movie Name: P.I.Meena
Release Date: 2023-11-03
Cast: Tanya Maniktala,Harsh Chhaya, Parambrata Chattopadhyay, Jisshu Sengupta ,Chandrayee Ghosh, Denzil Smith
Director: Debaloy Bhattacharya
Music: Amit Chatterjee
Banner: QED Films
Review By: Peddinti
P.I.Meena Rating: 2.75 out of 5
Trailer