'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లను అందిస్తున్నారు. దసరా నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని, 'సర్వం శక్తిమయం' అనే వెబ్ సిరీస్ నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అష్టాదశ శక్తి పీఠాలతో ముడిపడిన కథ ఇది. సనాతన ధర్మానికి సంబంధించిన అనేక సందేహాలకు సమాధానాలను, శక్తి పీఠాలకు సంబంధించిన విశేషాలను ఆవిష్కరిస్తూ సాగే ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది చూద్దాం.
మాధవ్ (సంజయ్ సూరి) ఓ బిజినెస్ మేన్. భార్య ప్రియ (ప్రియమణి) టీనేజ్ లో ఉన్న కొడుకు ప్రణవ్ (అభయ్ సింహా) కూతురు రేవతి (ఆశ్లేష ఠాకూర్) .. ఇది అతని ఫ్యామిలీ. మాధవ్ ఏ బిజినెస్ ను మొదలుపెట్టినా కలిసిరాకపోవడంతో ఆర్ధికంగా దెబ్బతింటాడు. సక్సెస్ చూడకపోవడం వలన సహజంగానే భార్యాబిడ్డలకు లోకువైపోతాడు. మామగారిని డబ్బు అడిగి అత్తగారింటివారికి కూడా చులకనైపోతాడు. ఇంట్లో అతనికి ఎలాంటి విలువ లేకుండా పోతుంది.
తన తండ్రి శ్రీమంతుడు కావడంతో, భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయే ఆలోచనలో ప్రియ ఉంటుంది. కూతురు రేవతి కూడా తల్లికే సపోర్టుగా ఉంటుంది. ఇక కొడుకు ప్రణవ్ .. అంజలిని ప్రేమిస్తూ . ఆమెను గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఏం జరుగుతుందనేది పట్టించుకోడు. ఈ నేపథ్యంలోనే కొత్తగా చేయబోయే బిజినెస్ కి సంబంధించి మాధవ్ కి డబ్బు అవసరమవుతుంది. దీపక్ (సుబ్బరాజు) అనే స్నేహితుడిని డబ్బు సర్దుబాటు చేయమని అడుగుతాడు.
అయితే అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకోవడం వలన, పరిస్థితులు మెరుగుపడతాయని దీపక్ చెబుతాడు. ఫ్యామిలీని తీసుకుని వెళితే ఆ వైపు నుంచి కూడా పరిస్థితులు చక్కబడతాయని అంటాడు. దాంతో ఫ్యామిలీని ఒప్పించి, వాళ్లను తీసుకుని మాధవ్ బయల్దేరతాడు. ఇక రంజిత్ సోని ( సమీర్ సోని) అనే రైటర్ నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయన రాసిన పుస్తకాల్లో ... ఇచ్చే ప్రసంగాల్లో కూడా భగవంతుడు లేడనే చెబుతూ వస్తుంటాడు.
అలాంటి రంజిత్ సోని దేవుడు లేడు అనే విషయాన్ని నిరూపించడంలో భాగంగా అష్టాదశ శక్తిపీఠాలపై ఒక పుస్తకం రాయడానికిగాను అమెరికా నుంచి బయల్దేరతాడు. జోగులాంబ శక్తిపీఠాన్ని మాధవ్ ఫ్యామిలీ దర్శించుకుంటూ ఉండగా, రంజిత్ సోని అక్కడ తారసపడతాడు. అక్కడే వాళ్ల మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇక అక్కడి నుంచి అంతా కలిసే ప్రయాణం మొదలెడతారు. ఈ ప్రయాణంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయనేది కథ.
బీవీఎస్ రవి అందించిన ఈ కథకు దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి దృశ్యరూపాన్ని ఇచ్చాడు. వ్యాపారంలో నష్టాలు .. అయినవాళ్లలో అవమానాలు .. కుటుంబంలో కలతలు .. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే దిక్కని చెప్పి అష్టాదశ శక్తిపీఠాల దర్శనం కోసం బయల్దేరిన మాధవ్, ఎవరి శక్తి వాళ్లను కాపాడుతుంది .. దేవుడనేవాడే లేడు అని నిరూపించడం కోసం శక్తి పీఠాలకు బయల్దేరిన నాస్తికుడు రంజిత్ సోని పాత్రలు కలిసి ప్రయాణం చేసేలా కథను రాసుకున్న తీరు బాగుంది.
ఎలాంటి పరిస్థితుల్లోను ఈ ప్రయాణాన్ని మధ్యలో ఆపకూడదని మాధవ్ నిర్ణయించుకుంటాడు. కానీ ఆయన తీరు ఎంతమాత్రం నచ్చని ప్రియ, ఎక్కడ వీలైతే అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉంటుంది. దాంతో ఈ ఫ్యామిలీ ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందా అనే టెన్షన్ ఆడియన్స్ లో ఉంటుంది. ఈ ప్రయాణం ముగిసేలోగా ఆస్తికుడైన మాధవ్ నాస్తికుడిగా మారతాడా? లేదంటే నాస్తికుడైన రంజిత్ సోని ఆస్తికుడిగా మారతాడా? అనే ఒక ఆసక్తి ప్రేక్షకులలో కొనసాగుతూ ఉంటుంది.
ఇలా ఈ రెండు ట్రాకులను నడిపిస్తూనే దర్శకుడు 'అష్టాదశ శక్తిపీఠాలు' చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. 10 ఎపిసోడ్స్ లో 18 శక్తి పీఠాలను కవర్ చేశారు. శ్రీలంకలోని శక్తి పీఠాన్ని కూడా చూపించారు. శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? ఏ శక్తిపీఠం ప్రాముఖ్యత ఏమిటి? సనాతన ధర్మంలో శక్తిపీఠాలు పాత్ర ఎలాంటిది? అనే విషయాలను ఆవిష్కరిస్తూ ఈ సిరీస్ ముందుకు వెళుతుంది. ఎక్కడా ఎవరూ నటిస్తున్నట్టుగా కాకుండా, ఒక ఫ్యామిలీ ట్రిప్ మాదిరిగానే అనిపించేలా సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఆయా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒక్కో శక్తి పీఠం గురించి చూపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఒక డ్రామాను శక్తిపీఠాలతో ముడిపెడుతూ ఆవిష్కరించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కీ .. భక్తి సంబంధమైన కార్యక్రమాలను ఎక్కువగా చూసేవారికి మాత్రమే ఈ సిరీస్ కి కనెక్ట్ అవుతుంది. ఈ తరహా కంటెంట్ పట్ల యూత్ అంతగా ఆసక్తిని చూపించదని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.
ఆర్టిస్టులంతా కూడా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. సజీశ్ రాజేంద్రన్ ఫొటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ ను చాలా అందంగా ... గొప్పగా కవర్ చేశాడు. ప్రదీప్ మద్దాలి చిత్రీకరించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఎక్కడా హడావిడి చేయకుండా సున్నితమైన భావోద్వేగాలకు ప్రాధాన్యతను ఇచ్చాడు. ఇక క్లైమాక్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి సంతృప్తికరంగానే అనిపిస్తుంది. దసరా నవరాత్రులలో అష్టాదశ శక్తిపీఠాలను ఒకేసారి చూపించడమే కాకుండా, మంచి సందేశం కూడా ఇచ్చిన సిరీస్ ఇది.
'సర్వం శక్తిమయం' (ఆహా) వెబ్ సిరీస్ రివ్యూ
Sarvam Shakthimayam Review
- దసరా స్పెషల్ గా వచ్చిన 'సర్వం శక్తిమయం'
- 10 ఎపిసోడ్స్ తో పలకరించిన వెబ్ సిరీస్
- శక్తిపీఠాలను టచ్ చేస్తూ సాగే ఫ్యామిలీ ఎమోషన్స్
- సహజత్వానికి దగ్గరగా నిదానంగా సాగే కథాకథనాలు
- ఆలోచింపజేసే సందేశం
Movie Name: Sarvam Shakthimayam
Release Date: 2023-10-20
Cast: Sanjay Suri, Priyamani, Samir Soni, Subbaraju, Abhay Simha, Ashkesha Thakur,
Director:Pradeep Maddali
Producer: Ankith - Vijay- Kaumudi
Music: -
Banner: Anvik Entertainments
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer