బాలకృష్ణ ఈ మధ్య కాలంలో భారీ విజయాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. 'అఖండ' .. 'వీరసింహా రెడ్డి' సినిమాలు, బాలకృష్ణ ఛరిష్మా ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించాయి. ఇక తాజాగా ఆయన నుంచి 'భగవంత్ కేసరి' సినిమా వచ్చింది. వరుస హిట్లతో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, బాలకృష్ణకి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. బాలయ్యకి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడిందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
నేలకొండ భగవంత్ కేసరి .. (బాలకృష్ణ) అడవి బిడ్డ. జైల్లో ఆయన శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. ఆయన తల్లి (జయచిత్ర) చావుబతుకుల్లో ఉంటుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న జైలర్ (శరత్ కుమార్) భగవంత్ కేసరిని ఆ ఊరు తీసుకుని వెళతాడు. కొడుకు చేతిలో ప్రాణాలు వదలాలనే ఆ తల్లి చివరి కోరిక నెరవేరుతుంది. తన తల్లి చివరికోరికను, తనకి చివరి చూపును దక్కేలా చేసిన ఆ జైలర్ పట్ల భగవంత్ కేసరి ఎంతో అభిమానంతో ఉంటాడు. తాను విడుదలైన తరువాత ఆ కుటుంబానికి దగ్గరవుతాడు.
జైలర్ భార్య కొంతకాలం క్రితం చనిపోతుంది. అప్పటి నుంచి కూతురు విజ్జి ఆలనా పాలన ఆయనే చూసుకుంటూ ఉంటాడు. పదేళ్ల వయసున్న విజ్జి, భగవంత్ కేసరికి బాగా చేరువ అవుతుంది. ఆ పాపను ఆర్మీ ఆఫీసర్ గా చూడాలనేది జైలర్ కోరిక. అయితే ఆ కోరిక నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోతాడు. అప్పటి నుంచి విజ్జి బాధ్యతను భగవంత్ కేసరి తీసుకుంటాడు. ఆయన దగ్గర పెరుగుతూ, యవ్వనంలోకి విజ్జి (శ్రీలీల) అడుగుపెడుతుంది.
విజ్జిని ఎలా చూడాలని తండ్రి అనుకున్నాడో, ఆ దిశగా ఆమెను నడిపించడానికి భగవంత్ కేసరి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో కార్తీక్ అనే యువకుడి ప్రేమలో విజ్జి పడుతుంది. దాంతో ఆమె చేస్తున్న పనిపట్ల దృష్టి పెట్టలేకపోతుంటుంది. ఇక చిన్నప్పటి నుంచి ఆమెకి ఉన్న మానసిక పరమైన సమస్య అందుకు కారణమని భావించిన భగవంత్ కేసరి, ఆమెను కాత్యాయని దగ్గరికి తీసుకుని వెళతాడు. వయసు కాస్త పై బడినా పెళ్లి చేసుకోని కాత్యాయని పాత్రలో కాజల్ కనిపిస్తుంది. మానసికంగా బలహీనంగా ఉన్నవారికి ఆమె కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది విజ్జి విషయంలో తన దగ్గరికి వచ్చిన భగవంత్ కేసరిపై ఆమె మనసు పడుతుంది.
ఇదిలా ఉండగా .. రాహుల్ సాంగ్వి (అర్జున్ రాంపాల్) నేర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. రాజకీయనాయకులతో తనకి గల పరిచయాలను ఉపయోగించుకుని, అక్రమంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులను తన సొంతం చేసుకుంటూ ఉంటాడు.తనకి ఎదురుతిరిగినవారి ప్రాణాలను తీయడానికి రాహుల్ ఎంతమాత్రం ఆలోచన చేయడు. ఆయనకి సంబంధించిన ఒక ఫైల్ డిప్యూటీ సీఎమ్ పీఏ దగ్గర ఉంటుంది. డిప్యూటీ సీఎమ్ ను రాహుల్ చంపగానే, ఆ పీఏ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ ఫైల్ కోసం రాహుల్ మనుషులు గాలిస్తూ ఉండగా, ఒక హోటల్లో విజ్జికి ఆ పీఏ తారసపడతాడు. ఆయన ఆమెకు ఏదో సీక్రెట్ చెప్పాడని రాహుల్ మనుషులు భావిస్తారు. అప్పటి నుంచి ఆమెను లేపేయడమే టార్గెట్ గా పెట్టుకుంటారు.
రాహుల్ సాంగ్వి మనుషుల బారి నుంచి విజ్జిని భగవంత్ కేసరి ఎలా కాపాడుకుంటాడు? అడవితల్లి బిడ్డ అనిపించుకోవడానికి ఆయనకి ఉన్న నేపథ్యం ఏమిటి? ఆయనను జైలుపాలు చేసిన సంఘటన ఏమిటి? అందుకు కారకులు ఎవరు? విజ్జి విషయంలో ఆమె తండ్రి కన్న కలలను భగవంత్ కేసరి నిజం చేశాడా? ఆయన జీవితంలోకి అడుగుపెట్టాలనే కాత్యాయని కోరిక నెరవేరుతుందా? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కథ అనేక మలుపులు తీసుకుంటుంది.
ఈ సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చుకున్నది కూడా ఆయనే. ఆయనకి కామెడీపై మంచి పట్టుఉంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన కథలను చేసే బాలయ్యతో కామెడీ కంటెంట్ వర్కౌట్ అవుతుందా? అనే చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా బాలకృష్ణ మార్కులోనే నడుస్తుంది. కాకపోతే అనిల్ రావిపూడి అక్కడక్కడా పాయసంలో జీడిపప్పులా తనదైన కామెడీ టచ్ ఇచ్చాడు. అది ఆడియన్స్ కి కాస్త కొత్తగా అనిపిస్తుంది.
'భగవంత్ కేసరి' అనేది ఒక పవర్ఫుల్ టైటిల్. టైటిల్ కి తగినట్టుగా బాలయ్య లుక్ ఉండాలి .. అందుకు తగిన కథ .. ఆ కథకి తగిన పవర్ఫుల్ పాత్ర .. ఆ పాత్రలో ఆవేశంతో పాటు ఆదర్శం ఉండాలి. వీటన్నిటికీ వీలైనంత వినోదాన్ని కలుపుతూ, తాను అనుకున్న సందేశాన్ని బాలయ్య ద్వారా వినిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడా? అంటే అయ్యాడనే చెప్పాలి. బాలయ్య అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులను మెప్పించాడా? అంటే మెప్పించాడనే అనాలి.
ఈ కథ ముంబైలో మొదలై .. వరంగల్ - ఆదిలాబాద్ లలో కొంతవరకూ జరిగి, ఆ తరువాత హైదరాబాద్ చేరుకుంటుంది. బాలకృష్ణ - శ్రీలీల - అర్జున్ రాంపాల్ ఈ మూడు పాత్రలనే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. హీరో - విలన్ లైన్ పైకి రావడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన దర్శకుడు, సెకండాఫ్ పై ఆడియన్స్ కి మరింత కుతూహలాన్ని పెంచాడు. ఫస్టాఫ్ కి తగ్గకుండా సెకండాఫ్ ను నడిపించాడు.
బాలయ్య ఇంట్రడక్షన్ .. రవిశంకర్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ .. ఫారెస్టులో ఫైట్ సీన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్టాఫ్ కి హైలైట్ గా నిలుస్తాయి. సెకండాఫ్ లో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ .. బస్సులో ఫైట్ .. 'ఆడుకాలం' నరేన్ ను అరెస్టు చేసే సీన్ .. క్లైమాక్స్ సీన్ హైలైట్ గా అనిపిస్తాయి. అయితే ప్రధానమైన కథను మొదలుపెట్టడానికి లీడ్ ఇచ్చిన తీరు బలహీనంగా అనిపిస్తుంది. ఇక ఒకటి రెండు పాత్రలకి గాను నటుల ఎంపిక కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
ఈ తరహా కథల్లో బాలకృష్ణ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. శ్రీలీల చాలా యాక్టివ్ గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లోనే కాదు, యాక్షన్ సీన్స్ లోను మెప్పించింది. ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ ఓకే. 'ఆడుకాలం' నరేన్ తన మార్క్ చూపించాడు. కథ .. కథనం తరువాత ఈ సినిమాకి మరో పిల్లర్ గా నిలిచింది తమన్ సంగీతం అనే చెప్పాలి. 'గణేశ్ ఉత్సవానికి సంబంధించిన పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఒప్పుకోవాలి. చిత్రీకరణపరంగా .. కొరియోగ్రఫీ పరంగా కూడా మంచి మార్కులు దక్కించుకుంది. వెంకట్ ఫైట్స్ కూడా ఆకట్టుకుంటాయి.
'సప్పుడు జెయ్యక్ ' .. 'బ్రో ఐ డోంట్ కేర్' అనే బాలయ్య ఊతపదాలు బాగా పేలాయి. 'ఆకలని వచ్చినవాడికి అన్నం పెట్టాలి .. ఆపదలో వచ్చినవాడికి ప్రాణం పెట్టాలి' .. 'నాకు అడ్డొస్తే అడివికి అగ్గిపెట్టినట్టే' .. 'ఆడపిల్లను లేడిపిల్లలా కాదు .. పులి పిల్లలా పెంచాలి' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అక్కడక్కడా కాస్త గ్రాఫ్ తగ్గినట్టుగా అనిపించినా, మొత్తంగా చూసుకుంటే బాలకృష్ణకి హ్యాట్రిక్ హిట్ పడినట్టేనని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్: యాక్షన్ ... ఎమోషన్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. బాలకృష్ణ - శ్రీలీల యాక్టింగ్.
మైనస్ పాయింట్స్: అక్కడక్కడా తగ్గిన గ్రాఫ్ .. ఒకటి రెండు పాత్రలకిగాను సెట్ కాని ఆర్టిస్టుల ఎంపిక.