సమాజంలో రాజకీయాలు ఎప్పుడూ చురుకైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. రాజకీయాల ముసుగులో అవినీతి .. అక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. తమ అవినీతి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరగడం కోసం చాలా మంది అధికారాన్ని ఆశిస్తారు. అందుకోసం రాజకీయాలలోకి దిగుతుంటారు. రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ, ఆర్ధికంగా మరింత బలపడటం కోసం సామాన్య ప్రజల జీవితాలను బలిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఒక వ్యక్తి కథనే 'చూనా'.'నెట్ ఫ్లిక్స్' లో క్రితం నెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
అవినాశ్ శుక్లా ( జిమ్మీ షేర్ గిల్) చాలా చిన్న స్థాయి నుంచి, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయికి ఎదుగుతూ వెళతాడు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం అవినీతి .. అక్రమం .. మోసం. జాతకాలను .. గ్రహదోషాలను .. వ్రేళ్లకి ధరించే రంగురాళ్లను .. వాస్తును ఆయన ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. తాను చేసేది మంచి పనులు కాకపోయినా, ముహూర్తం చూసుకోకుండా మాత్రం మొదలుపెట్టడు. అతని వ్యక్తిగత విషయాలను బావమరిది బిష్ణు ( చందన్ రాయ్) అస్థానా చూసుకుంటూ ఉంటారు. ఇక ప్రధానమైన అనుచరుడు మదన్ సింగ్ ను దాటి ఎవరూ ఆయన ముందుకు వెళ్లలేరు.
శుక్లా తాను ఎదగడం కోసం ఎన్నో నేరాలను చేస్తూ వెళతాడు. వస్తాదుగా మంచి పేరున్న ఫౌలాద్ సింగ్ ను చంపించడం వాటిలో ఒకటి. దాంతో అతని మేనల్లుడైన యాకూబ్ అన్సారీ (ఆషిమ్ గులాటి) శుక్లాపై పగబడతాడు. ప్రతీకారాన్ని తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బాంకేలాల్ (త్రిపాఠి) కూడా ఒకానొక సందర్భంలో శుక్లా చేత ఘోరంగా అవమానించబడతాడు. అప్పటి నుంచి అతను పగతో రగిలిపోతుంటాడు.
అలాగే శుక్లా కారణంగా ఉపాధిని కోల్పోయిన జేపీ (విక్రమ్) .. శుక్లా కారణంగా అన్యాయానికి గురైన త్రిలోకి (నమిత్ దాస్) .. శుక్లా చంపించడానికి ప్రయత్నించగా తప్పించుకుని బయటపడిన పండిట్ జీ .. తన అక్క మరణానికి కారకుడయ్యాడనే పగతో శుక్లా బావమరిది బిష్ణు పగ తీర్చుకునే సమయం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓ స్థలంపై శుక్లా కన్ను పడుతుంది. అక్కడి జనాలను ఖాళీ చేయించి. షాపింగ్ మాల్ కట్టాలని భావిస్తాడు. అందుకు సంబంధించిన పనులను మొదలుపెడతాడు.
ఈ విషయంలో తనకి అనుకూలంగా లేని ముఖ్యమంత్రిని గద్దె దించడానికి శుక్లా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యేలను కొనడానికిగాను 800 కోట్లను పోగు చేయడం మొదలుపెడతాడు. దాంతో శుక్లా పై పగ తీర్చుకోవాలనుకున్న వాళ్లంతా ఒక్కటవుతారు. ఎమ్మెల్యేలను కొనడానికి ఆయన పోగు చేసిన 800 కోట్లను కాజేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఎలాంటి ప్లాన్ చేస్తారు? ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది మిగతా కథ.
దర్శకుడు పుష్పేంద్రనాథ్ మిశ్రా విస్తృతమైన స్థాయిలో ఈ కథను చేసుకున్నాడు. అందువలన పాత్రల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కథ ముందుకు వెళుతున్నా కొద్దీ కొత్త పాత్రలు వచ్చి చేరుతూనే ఉంటాయి. అందువలన ఆ పాత్రలను పరిచయం చేస్తూ మొదటి నుంచి చివరి వరకూ అక్కడక్కడా వాయిస్ ఓవర్ పై ఆధారపడక తప్పలేదు. నిజానికి అన్ని పాత్రల మధ్యలో .. కథ విషయంలో కన్ ఫ్యూజన్ లేకుండా వాయిస్ ఓవర్ కాపాడిందనే చెప్పాలి. లేదంటే గందరగోళం తప్పేది కాదేమో.
నిజానికి ఇది కొత్త కథేం కాదు .. రాజకీయాలలో పైకి రావడం కోసం .. తన ఆస్తులను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించేవారి కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. మురికివాడల ప్రజలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించడం .. వాళ్ల నుంచి వ్యతిరేకత రావడం .. పార్టీ అధిష్ఠానం హెచ్చరిస్తే, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ట్రై చేయడం ఇంతకుముందు చూస్తూ వచ్చినవే. మధ్యలో వేరే ట్రాకులు చొరబడినా, ఇది కూడా ఆ తరహా కథనే. కాకపోతే ఇది వెబ్ సిరీస్ అయినా సినిమాకి ఎంతమాత్రం తగ్గని భారీ తనం దీని సొంతం.
శుక్లా ఎలాంటి పరిస్థితుల్లోను ఎవరినీ నమ్మడు. తాను నమ్మిన బావమరిదినే చివరికి అతణ్ణి మోసం చేసే ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే ఐదు వ్రేళ్లు కలిస్తే బలమైన పిడికిలి ఏర్పడుతుందని అన్నట్టుగా, శుక్లా చేతిలో మోసపోయిన వాళ్లంతా కలిసి ఆయనను దెబ్బకొట్టాలనుకోవడం ఆకట్టుకుంటుంది. అయితే అందరూ కలిసి అందుకోసం వేసిన ప్లాన్ ఆడియన్స్ లో ఉత్కంఠను రేపలేకపోయింది. కొన్ని లాజిక్ లను పట్టించుకోకపోవడమే అందుకు కారణం.
ఈ కథలో అన్సారీ మేనమామ ట్రాక్ .. మింటో గ్రానైడ్ ట్రాక్ .. షబ్బీర్ ట్రాక్ .. జుంపా ట్రాక్ లేకపోయినా కథకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ పాత్రల వలన కథని మరింత సాగదీసినట్టుగా అనిపిస్తుంది. పాత్రల సంఖ్య పెరగడానికి కూడా కారణమైంది. 8 ఎపిసోడ్స్ లో నుంచి ఈ ట్రాకులు లేకుండా 6 ఎపిసోడ్స్ లో .. టైట్ కంటెంట్ తో సెట్ చేసినట్టయితే ఈ సిరీస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ప్రధాన పాత్రధారులంతా కూడా బాగా చేశారు.
నిర్మాణ విలువ పరంగా ఈ సిరీస్ కి వంక బెట్టవలసిన అవసరం లేదు. ధృవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా. కాకపోతే కొన్ని సీన్స్ ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయలేదు. కామెడీ టచ్ ఇచ్చిన సీన్స్ కూడా అంతగా పేలలేదు. ఏం జరుగుతుందా అనే ఉత్కంఠను రేకెత్తించలేకపోవడం .. క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఒక వెలితిగా అనిపిస్తుంది.
'చూనా' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews
Choona Review
- భారీ సిరీస్ గా వచ్చిన 'చూనా'
- రాజకీయాల నేపథ్యంలో నడిచే డ్రామా
- లెక్కకి మించిన పాత్రలు .. ట్రాకులు
- ట్విస్టులు తక్కువ .. అనవసరమైన సీన్స్ ఎక్కువ
- ఆశించిన స్థాయిలో లేని క్లైమాక్స్
Movie Name: Choona
Release Date: 2023-09-29
Cast: Jimmy Shergill, Aashim Gulati, Vikram Kochhar, Namit Das, Chandan Roy, Gyanendra Tripathi, Monika Panwar, Niharika Lyra Dutt
Director: Pushpendra Nath Misra
Music: Dhruv Ghanekar
Banner: Flying Saucer
Review By: Peddinti
Choona Rating: 2.75 out of 5
Trailer