'కుమారి శ్రీమతి' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ

Kumari Srimathi

Kumari Srimathi Review

  • నిత్యామీనన్ ప్రధానమైన పాత్రగా 'కుమారి శ్రీమతి'
  • ఆ పాత్రకి జీవం పోసిన నిత్యామీనన్ 
  • సహజంగా అనిపించే ఫ్యామిలీ ఎమోషన్స్
  • లొకేషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ హైలైట్
  • ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వెబ్ సిరీస్

నిత్యామీనన్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్, ఈ నెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ కి, గొంటేశ్ ఉపధ్యే దర్శకత్వం వహించాడు. సీజన్ 1లో భాగంగా 7 ఎపిసోడ్స్ ను వదిలారు. టైటిల్ ను బట్టే ఇది నిత్యామీనన్ ప్రధాన పాత్రధారిగా నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ గోదావరి ఒడ్డున ఉన్న 'రామరాజులంక' గ్రామంలో నడుస్తుంది. ఆ గ్రామంలో ప్రభాకరరావు (మురళీమోహన్) ఆయన భార్య శేషమ్మ (తాళ్లూరి రామేశ్వరి) కూడా నివసిస్తూ ఉంటారు. వాళ్లకి ఇద్దరు కొడుకులు ఉంటారు.పెద్ద కొడుకు విశ్వేశ్వరరావు (నరేశ్) పెద్ద కోడలు దేవిక (గౌతమి). ఆ దంపతులకు ఇద్దరూ ఆడపిల్లలే .. ఒకరు శ్రీమతి ( నిత్యా మీనన్)  .. మరొకరు కల్యాణి. ఇక ప్రభాకరరావు చిన్నకొడుకు కేశవరావు .. ఆయన భార్య లక్ష్మి. వాళ్లకి ఫణి - మణి అనే ఇద్దరు మగపిల్లలు ఉంటారు. 

ప్రభాకరరావు తన తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తాడు. ఇక తన తండ్రి కట్టించిన ఇల్లు అంటే ఆయన ఎంతో ఇష్టం. మాటల సందర్భంలో తనకి ఆ ఇంటిపై ఉన్న ప్రేమను గురించి మనవరాలైన శ్రీమతికి ప్రభాకరరావు చెబుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ ఇల్లు అమ్మమని తన చిన్న తనంలోనే తాతతో శ్రీమతి అంటుంది. అయితే ఆ తరువాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. 

ప్రభాకరరావు హఠాత్తుగా చనిపోతాడు .. ఆయన పెద్ద కొడుకు విశ్వేశ్వరరావు అప్పుల వాళ్ల బాధలను తట్టుకోలేక ఆ ఊరు నుంచి పారిపోతాడు. అతను చేసిన అప్పులు కొన్ని తీర్చేసి, తన భార్య బిడ్డలను తీసుకుని ఆ ఊరు నుంచి కేశవరావు వెళ్లిపోతాడు. దాంతో విశ్వేశ్వరరావు భార్య .. పిల్లలు అద్దె ఇంటికి మారవలసి వస్తుంది. ప్రభాకరరావు భార్య శేషమ్మ మాత్రం పెద్ద కోడలుతోనే ఉంటుంది. ఫంక్షన్స్ కి పిండివంటలు సప్లై చేస్తూ వాళ్లు పిల్లలను పెద్ద చేస్తారు.

శ్రీమతి బాబాయ్ నకిలీ వీలునామా చూపించి, తన తండ్రి ఇల్లు తన ఒక్కడికి మాత్రమే సొంతమని కోర్టుకు వెళతాడు. ఆ ఇంటికి పడగొట్టి అపార్టుమెంటు కట్టాలని ప్లాన్ చేస్తాడు. తాతయ్య ఆత్మ క్షోభిస్తుందని భావించిన శ్రీమతి అందుకు అడ్డుపడుతుంది. తన పెళ్లి విషయాన్ని కూడా పక్కన పెట్టేసి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఇంటిపై ప్రేమ ఉంటే 6 నెలలలోగా 38 లక్షలు చెల్లించి కేశవరావు నుంచి కొనుగోలు చేయవచ్చనీ, ఆ గడువు దాటితే ఆ ఇంటిని ఆయన ఏమైనా చేసుకోవచ్చని కోర్టు చెబుతుంది. 

చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న శ్రీమతి, ఆ ఇంటిని కాపాడుకోవడం కోసం ఏం చేస్తుంది?  ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఇక శ్రీమతివాళ్లకు ఇల్లు అద్దెకి ఇచ్చిన శ్రీరామ్ (నిరుపమ్) ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. బార్ షాపులు నడుపుతూ బాగా సంపాదించిన దొరబాబు కూడా శ్రీమతిని ఇష్టపడుతూ ఉంటాడు. ఇక విదేశాల నుంచి తిరిగొచ్చిన శ్రీమతి చిన్ననాటి స్నేహితుడు 'అభి' (తిరువీర్) కూడా ఆమెను ఆరాధిస్తూ ఉంటాడు. ఈ ముగ్గురిలో శ్రీమతికి చేరువయ్యేది ఎవరు? అనేది మరో ఆసక్తికరమైన అంశం. 

ఇది బలభద్రపాత్రుని రమణి అందించిన కథ. అందువల్లనే ఒక పుస్తకం చదువుతూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. పాత్రలు సహజంగా కళ్లముందు కదలాడుతూ ఉంటాయి. కథకి తగినట్టుగా పాత్రలను డిజైన్ చేయడం వలన, ఆ సహజత్వం కనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యంలోని ఈ కథను దర్శకుడు గొంటేశ్ ఉపధ్యే ఆవిష్కరించిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. కథ మరీ అంత కొత్తది కాకపోయినా, ట్రీట్మెంట్ ఆ ఫీల్ ను తీసుకొస్తుంది. 

నెగెటివ్ షేడ్స్ ఉన్న కేశవరావు పాత్ర ..  ఆయనకి ఇద్దరు కొడుకులు .. వాళ్లు ట్విన్స్. వాళ్లిద్దరూ ఒకే రకమైన డ్రెస్ లు వేసుకోవడం, రావు గోపాలరావు టైమ్ లోని సినిమాలను గుర్తుచేస్తుంది. తిరువీర్ - నిరుపమ్ స్క్రీన్ పై ఎంతసేపు కనిపించారనేది పక్కన పెడితే, ఇద్దరి పాత్రలు కూడా అంత ఎఫెక్టివ్ గా మాత్రం అనిపించవు. ఆ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం అందుకు కారణంగా చెప్పాలి. శ్రీమతి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, తిరువీర్ పాత్ర జాడ లేకపోవడం అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. 

నిత్యామీనన్ పాత్ర .. ఆ పాత్రను ఆమె ఓన్ చేసుకున్న తీరు ఈ సిరీస్ ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి .. ఒప్పుకోవాలి. ఆమె ఎక్స్ ప్రెషన్స్ .. ఈజ్ తో చెప్పే డైలాగ్స్ కోసం ఈ సిరీస్ చూడొచ్చు. ఆ తరువాత మార్కులు తాళ్లూరి రామేశ్వరికి దక్కుతాయి. ఫొటోగ్రఫీ ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. విలేజ్ నేపథ్యం ... గోదావరిలో లాంచ్ లో ప్రయాణం తాలూకు సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించాడు. 

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా ఓకే .. ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు. అవసరాల అందించిన స్క్రీన్ ప్లే ఈ కథకి మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఆయన అందించిన సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి. విశేషమేమిటంటే ఈ సిరీస్ లో ఆయనతో పాటు నాని కూడా అతిథి పాత్రలలో మెరవడం.సెకండ్ సీజన్ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుచేస్తూ, కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఆడియన్స్ ఊహకి వదిలేయడం కూడా బాగుంది. 


ప్లస్ పాయింట్స్: ఆసక్తికరమైన కథాకథనాలు .. అందమైన లొకేషన్స్ .. నిత్యామీనన్ నటన .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: తిరువీర్ .. నిరుపమ్ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం. 

Movie Name: Kumari Srimathi

Release Date: 2023-09-28
Cast: Nithya Menen, Naresh, Gauthami, Thalluri Rameshwari, Nirupam, Thiruveer
Director:Gomtesh Upadhye
Producer: Priyanka Dutt - Swapna Dutt
Music: Kamran - Staccato
Banner: Swapna Cinema

Rating: 3.25 out of 5

Trailer

More Reviews