'పెదకాపు 1' - మూవీ రివ్యూ

Pedakapu

Pedakapu Review

  • గ్రామీణ నేపథ్యంలో సాగే 'పెదకాపు 1'
  • ఫస్టు మూవీతో మెప్పించిన హీరో - హీరోయిన్
  • ఆకట్టుకునే పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా వర్క్
  • రావు రమేశ్ .. ఆడుకాలం నరేన్ నటన హైలైట్ 
  • మోతాదు మించిన హింస ..  రక్తపాతం

ఈ మధ్య కాలంలో టైటిల్ తోనే ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచిన సినిమాగా 'పెదకాపు 1' కనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి వదులుతూ వస్తున్న పోస్టర్స్ తో మరింతగా అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. 'అఖండ' సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత కావడం కూడా అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విరాట్ కర్ణ - ప్రగతి హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఈ రోజున థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.


ఈ కథ 1962లో గోదావరి జిల్లాల్లోని లంకల గ్రామంలో మొదలవుతుంది .. ఆ తరువాత 1982లో నడుస్తుంది. అవి ఎన్టీఆర్ కొత్తగా 'తెలుగుదేశం' పార్టీని స్థాపించిన రోజులు. అప్పటికే గోదావరి జిల్లాల్లోని ఆ గ్రామంలో సత్యరంగయ్య (రావు రమేశ్) బయ్యన్న (ఆడుకాలం నరేన్) రాజకీయపరమైన అధికారం కోసం .. ఆ గ్రామంపై పెత్తనం కోసం ఒకరిని ఒకరు దెబ్బతీసుకుంటూ ఉంటారు. ఎవరికి వారు తమ అనుచర వర్గాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు. 


సత్యరంగయ్యకి సంబంధించిన పార్టీ జెండాను గ్రామం నడిబొడ్డున చాలా ఎత్తులో ఎగరేయాలని ఆ ఊరు యువకులు భావిస్తారు. అందుకు అవసరమైన పొడవైన దుంగను అతి కష్టం మీద తీసుకొస్తారు. దానిని అడ్డుకోవడానికి బయ్యన్న అనుచరులు ప్రయత్నించడంతో అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో 'పెదకాపు' ప్రధానమైన పాత్రను పోషిస్తాడు. అప్పటి నుంచి బయ్యన్నకి 'పెదకాపు' టార్గెట్ అవుతాడు. కాకపోతే ఆవేశం .. ధైర్యం రెండూ ఉన్న పెదకాపును అడ్డు తప్పించడం అంత తేలిక కాదని బయ్యన్నకి తెలుసు.

తల్లి (ఈశ్వరీరావు), తండ్రి ( రాజీవ్ కనకాల), ఓ అన్నయ్య .. ఇదీ పెదకాపు కుటుంబం. ఇక అదే గ్రామానికి చెందిన తాయారు (ప్రగతి శ్రీవాత్సవ) అతనిని ప్రేమిస్తూ ఉంటుంది. తన తల్లిదండ్రులు ఎవరనేది తాయారుకి తెలియదు. ఆ గ్రామంలో టీచర్ గా పనిచేసే 'సారా సారు' (తనికెళ్ల భరణి) దగ్గర ఆమె పెరుగుతుంది. తన కష్టనష్టాలను గౌరీకి చెప్పుకుంటూ ఉంటుంది. పెదకాపుకి గౌరీ వదిన అవుతుంది. వాళ్లంతా కూడా ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు. 


సత్యరంగయ్యకి స్త్రీ వ్యామోహం ఎక్కువ. ఆయన ఒక్కగానొక్క కొడుకు (శ్రీకాంత్ అడ్డాల)కి కాళ్లు పనిచేయవు. అందువలన సత్యరంగయ్య ముఖ్య అనుచరులలో ఒకడైన కన్నబాబు అధికారంపై ఆశలు పెట్టుకుంటాడు. ఇక బయ్యన్న వైపు నుంచి ఆయన కొడుకు వారసుడిగా బరిలోకి దిగుతాడు. తండ్రిని సపోర్టు చేస్తూ సత్య రంగయ్యని అవమానించిన అతను, ఆ మరోసటి రోజునే శవంగా మారతాడు. సత్య రంగయ్య కోసమే ఆ పని చేశానని చెప్పి, పెదకాపు అన్నయ్య పోలీసులకు లొంగిపోతాడు. 


తన కొడుకులేని జీవితం తనకి అవసరం లేదని భావించిన బయ్యన్న, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అయితే గతంలో సత్యరంగయ్య చేసిన ఒక తప్పు అతనికి గుర్తొస్తుంది. ఆ తప్పును బయటపెడితే, సత్యరంగయ్య ఇక ఎప్పటికీ రాజకీయాలలోకి రాలేడని భావిస్తాడు. గ్రామస్తులంతా సమావేశమై ఉన్న సమయంలో ఆ చేదు నిజాన్ని బయటపెడతాడు. అదేమిటి? దాని వలన ఎవరి జీవితాలు ప్రభావితమవుతాయి? అప్పుడు సత్యరంగయ్య ఏం చేస్తాడు? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ విలేజ్ నేపథ్యంలోనే నడుస్తుంది. అధికారం కోసం కొట్టుకునే ఇద్దరు నాయకులు .. వాళ్ల మధ్య నలిగిపోయే సామాన్య వర్గం .. అందులో నుంచి పుట్టిన ఒక యువకుడు ఆ ఇద్దరు బలవంతులకు ఎలా ఎదురెళ్లాడు? తానే నాయకుడిగా మారడానికి ఏం చేస్తాడు? అనేదే ఈ కథలోని సారాంశం. శ్రీకాంత్ అడ్డాల ఈ కథను .. ఇందులోని ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది.

ఒక వైపున హీరో .. అతని ఫ్యామిలీ, మరో వైపున సత్య రంగయ్య ఫ్యామిలీ .. ఇంకో వైపున బయ్యన్న ఫ్యామిలీ. విలన్స్ వైపున వాళ్ల అనుచరులు నిలబడితే, హీరో వైపు మంచి మార్పును కోరే జనం ఎలా నిలబడతారు? .. ఎలా కలబడతారు? అనేది శ్రీకాంత్ అడ్డాల ఆవిష్కరించిన విధానం బాగుంది. ఫస్టాఫ్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ .. సత్యరంగయ్య - బయ్యన్న కాంబినేషన్లోని వర్షం సీన్ .. సత్య రంగయ్య ఇంటిపై బయ్యన్న మనుషులు దాడిచేసే సీన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా నిలుస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఎవరూ ఊహించరు. 


ఇక సెకండ్ పార్టులో అనసూయ ఫ్లాష్ బ్యాక్ .. బయ్యన్నపై సత్యరంగయ్య కొడుకు దాడి చేసే సీన్ .. హీరో తన అన్నయ్యను కాపాడుకునే సీన్ హైలైట్ గా నిలుస్తాయి. ఫస్టాఫ్ లో హీరో - హీరోయిన్ పై చిత్రీకరించిన 'చనువుగా చూసిన' పాట .. సెకండాఫ్ లో వచ్చే 'బుజ్జిమేక' అనే పాట యూత్ కి బాగా  కనెక్ట్ అవుతాయి. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ నే క్లైమాక్స్ రేంజ్ లో సెట్ చేయడం వలన, సెకండాఫ్ లో కాస్త పవర్ తగ్గిందేమో అనిపిస్తుంది. అలాగే పార్టీల నేపథ్యంలో కథ గనుక కొట్లాటలు మామూలేగానీ, రక్తపాతం ఎక్కువైపోయిందేమో అని కూడా అనిపిస్తుంది. 

విరాట్ కర్ణకి ఇది మొదటి సినిమా .. అయినా ఎక్కడా తడబడకుండా చేశాడు. అతని కళ్లు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. టాలీవుడ్ కి మరో మాస్ హీరో దొరికాడనే అనుకోవాలి. ఇక ప్రగతికి కూడా హీరోయిన్ గా ఫస్టుమూవీనే అయినా చాలా ఈజ్ తో చేసింది. రావు రమేశ్ బాడీ లాంగ్వేజ్ ను డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఒక చేయి పోగొట్టుకుని 'ఆడుకాలం' నరేన్ చూపించిన విలనిజం ఆకట్టుకుంటుంది. 


ఇక అనసూయ .. ఈశ్వరీరావు పాత్రలు కూడా కాస్త బలంగానే కనిపిస్తాయి. అందుకు తగిన నటనతోనే వాళ్లు ఆకట్టుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల పోషించిన పాత్రలోనే క్లారిటీ మిస్సయిందేమో అనిపిస్తుంది. ఒక్కోసారి కేవలం అంగవైకల్యం ఉన్నవాడిగా కనిపించాడు. మరికొన్ని సార్లు మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్టుగా నటించాడు. కథనాన్ని ఇంకాస్త స్పీడ్ గా ఆయన నడిపించి ఉంటే, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో అనిపిస్తుంది.

కథాకథనాల తరువాత ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలంగా నిలిచాయి. రెండు డ్యూయెట్లు హిట్ అనే చెప్పాలి. 'బుజ్జిమేక' పాటను చూస్తుంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి పాటల్లో ఇది ఒకటి అనిపిస్తుంది. చిత్రీకరణ పరంగా కూడా ఈ పాటకి మంచి మార్కులు దక్కుతాయి. కొన్ని షాట్స్ విషయంలో చోటా కె నాయుడు కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగానే ఉంది. ఎటొచ్చి హింస .. రక్తపాతం .. రాజకీయాల నేపథ్యం వలన ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేదే చూడాలి.

ప్లస్ పాయింట్స్
: కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను మలచిన విధానం .. సంగీతం .. ఫొటోగ్రఫీ .. లొకేషన్స్. 

మైనస్ పాయింట్స్ : హింస .. రక్తపాతం ..

Movie Name: Pedakapu

Release Date: 2023-09-29
Cast: Virat Karna, Pragathi, Rao Ramesh, Adukalam Naren, Thanukella Bharani, Anasuya,
Director: Srikanth Addala
Music: Mickey J. Meyer
Banner: Dwaraka Creations

Pedakapu Rating: 2.75 out of 5

Trailer

More Reviews