'హార్ట్ ఆఫ్ స్టోన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

Heart of Stone

Heart of Stone Review

  • హాలీవుడ్ మూవీగా 'హార్ట్ ఆఫ్ స్టోన్'
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • ప్రధానమైన పాత్రల్లో గాల్ గాడట్ - అలియా భట్
  • ఆశించిన స్థాయిలో లేని అలియా పాత్ర  
  • యాక్షన్ సీన్స్ ... లొకేషన్స్ హైలైట్

హాలీవుడ్ అనగానే భారీ స్థాయిలో స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు కళ్లముందు కదలాడతాయి. అలా రూపొందిన మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ 'హార్ట్ ఆఫ్ స్టోన్'. యాక్షన్ దృశ్యాలతో ట్రైలర్ తోనే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాతో అలియా భట్ హాలీవుడ్ కి పరిచయం కావడం విశేషం. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. టామ్ హార్పర్ దర్శకత్వంలో గాల్ గాడట్ .. అలియా భట్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథలోకి వెళితే .. రేచల్ స్టోన్ ( గాల్ గాడట్) ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజన్సీ అయిన 'ది చార్టర్' లో ఏజెంటుగా పనిచేస్తూ ఉంటుంది. స్టోన్ ఏ ఆపరేషన్ లో పాల్గొన్నా అందులో అపజయమనేది ఆమెకి తెలియదు. అలాంటి ఆమె ఇటలీ వేదికగా జరిగిన ఒక ఆపరేషన్ లో భంగపడుతుంది. చివరి నిమిషంలో ఆమె ప్రయత్నం విఫలమవుతుంది. చేతికి చిక్కిన శత్రువు .. అతనికి మాత్రమే తెలిసిన రహస్యాలు చేజారిపోతాయి. అందుకు కారణం 'కేయా ధావన్' (అలియా భట్) అనే విషయం ఆమెకి తెలుస్తుంది. 

దాంతో కేయా ఎవరు? ఆమె ఏ సంస్థ కోసం పనిచేస్తోంది? ఆమె లక్ష్యం ఏమిటి? అనే దిశగా స్టోన్ తన పరిశోధన మొదలుపెడుతుంది. చార్టర్ ఏజన్సీ వారు ఉపయోగించే 'హార్ట్' అనే డివైస్ ను చేజిక్కించు కోవడమే కేయా లక్ష్యమని తెలుసుకుని, స్టోన్ ఆశ్చర్యపోతుంది. చార్టర్ ఏజెన్సీ పట్ల కేయా ప్రతీకారంతో రగిలిపోవడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఆమె ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకోసమే ఆమె చార్టర్ ఏజెన్సీకి శత్రువులైనవారితో చేతులు కలుపుతుంది. 

ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానం కనుసన్నలలో నడుస్తోంది. అలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థలను ఎక్కడి నుంచైనా హ్యాక్ చేయగల సామర్థ్యం 'హార్ట్' సొంతం. అలాంటి హార్టును దక్కించుకుని, ప్రపంచాన్ని అదుపు చేయడానికి కేయా థావన్ వెనుక ఒక ముఠా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ప్రతీకారాన్ని అడ్డుపెట్టుకుని, ఆమె ద్వారా తమ పనులను పూర్తి చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. 

 అనేక అవాంతరాలను ఎదుర్కొంటూనే, కేయా గురించిన ఈ విషయాలన్నీ స్టోన్ తెలుసుకుంటుంది. ఆ తరువాత ఆమె ఏం చేస్తుంది? చార్టర్ ఏజెన్సీ వలన కేయాకి జరిగిన అన్యాయం ఏమిటి? ఆమె అంతగా పగబట్టడానికి కారణం ఎవరు? స్టోన్ కీ .. కేయాకి మధ్య జరిగే పోరాటం ఎలాంటిది? ఈ యుద్ధంలో విజేతలుగా నిలిచేదెవరు? అనే ఆసక్తికరమైన సందేహాలను రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. 

హాలీవుడ్ సినిమా .. అందునా స్పై యాక్షన్ సినిమా అంటే ఏ రేంజ్ లో విజువల్ ట్రీట్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అందుకు ఏ మాత్రం తగ్గని సినిమా ఇది. భారీ యాక్షన్ దృశ్యాలు .. ఛేజింగులు .. ఊహించని పోరాట విన్యాసాలు మామూలే. అయితే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి, ఆశ్చర్యపోయేంత గొప్పదేమీ కాదు. ఇంతకుముందు వచ్చిన ఈ తరహా సినిమాలకి పూర్తి భిన్నమైనది కూడా కాదు. అలాగే స్క్రీన్ ప్లే పరమైన అద్భుతాలు కూడా స్క్రీన్ పై ఏమీ జరగవు. 

ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర స్టోన్ ఒక అనాథ. అయినా తనని చేరదీసిన వారి దగ్గర నుంచి మంచి నేర్చుకుని దేశం కోసం తన సేవలను అందిస్తూ ఉంటుంది. మరో ప్రధానమైన పాత్ర అయిన కేయా, పరిస్థితుల కారణంగా అనాథగా మారి, ప్రతీకారం దిశగా ముందుకు వెళుతుంది. ఈ కోపంలో ఆమె దేశభక్తిని కూడా మరిచిపోయి ప్రవర్తిస్తుంది. ఆ తరువాత మంచి దిశగా అడుగులు వేస్తుంది. ఈ రెండు పాత్రల చుట్టూనే అసలు కథ తిరుగుతూ ఉంటుంది. 

అయితే అలియా భట్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన విధానం వలన, ఆ పాత్ర నుంచి ఆడియన్స్ చాలా ఆశిస్తారు. గాల్ .. అలియా మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం అనిపిస్తుంది. కానీ అలాంటి సీన్స్ ఏమీ లేకపోవడం నిరాశ పరుస్తుంది. ఆడియన్స్ ఆశించిన ఆ స్థాయిలో అలియా పాత్రను ఆవిష్కరించలేదు. మొదటి నుంచి కూడా గాల్ పాత్రనే అంతా తానై నడిపిస్తూ వెళుతుంది. యాక్షన్ దృశ్యాలలో గాల్ గాడట్ మాత్రమే కనిపిస్తుంది. అలియా వైపు నుంచి డ్రామా నడుస్తూ ఉంటుందంతే.

 యాక్షన్ సీన్స్ లో బైక్ మొదలు ఫైటర్ విమానాల వరకూ వాడారు.  మంచు కొండల్లో ఛేజింగ్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అద్భుతమైన విజువల్స్ కట్టిపడేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకి తగినట్టుగా వినిపిస్తుంది. ఫొటోగ్రఫీ గొప్పగా అనిపిస్తుంది. లొకేషన్స్ ను కవర్ చేసిన తీరు .. గగన మార్గాన చేసే విన్యాసాలను ఒడిసిపట్టుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లొకేషన్స్ పరంగా .. వాటిని పూర్తి స్థాయిలో తెరపై ఆవిష్కరించిఉన్న ఫొటోగ్రఫీ పరంగా మంచి మార్కులు పడతాయి. ఇక ఎడిటింగ్ కూడా ఓకే. కథ పరంగా కొత్తదనం లేకపోయినా, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. 

Movie Name: Heart of Stone

Release Date: 2023-08-11
Cast: Gal Gadot, Jamie Dornan, Alia Bhatt, Sophie Okonedo, Matthias Schweighöfe
Director: Tom Harper
Music: Steven Price
Banner: Skydance

Heart of Stone Rating: 2.75 out of 5

Trailer

More Reviews