ఆసక్తికరమైన కోర్టు రూమ్ డ్రామాతో మరో వెబ్ సిరీస్ 'జియో సినిమా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఆ వెబ్ సిరీస్ పేరే 'లఖన్ లీలా భార్గవ'. రవి దూబే ప్రధానమైన పాత్రగా రూపొందిన సిరీస్ ఇది. ఇందులో ఆయన లాయర్ గా కనిపించనున్నాడు. అందువల్లనే షార్టు కట్ లో 'LLB' అనే అర్థం వచ్చే లా ఆయన పేరును సెట్ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 13 ఎపిసోడ్స్ ను వదలనున్నారు. ఈ రోజుతో మూడు ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. మిగతా ఎపిసోడ్స్ ఆగస్టు 28 .. 29.. 30 .., సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకూ స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ మూడు ఎపిసోడ్స్ కి సంబంధించిన కథ విషయానికి వస్తే, ఈ కథ 'లక్నో'లో మొదలవుతుంది. లఖన్ లీలా భార్గవ (రవిదూబే) క్రిమినల్ లాయర్ గా మొదటి కేసును వాదించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. తల్లి లీలా భార్గవ (సోనాలి సచ్ దేవ్) .. తమ్ముడు టిప్పు (సాద్ బిల్ గ్రామి) అతని కుటుంబం. లఖన్ దేశంలోనే పెద్ద లాయర్ గా ఎదగాలనీ, అతని గురించి అంతా గొప్పగా మాట్లాడుకునే రోజు ఒకటి రావాలని తల్లి ఆశపడుతూ ఉంటుంది. అలాంటి రోజు తప్పకుండా వస్తుందని తల్లికి మరింత భరోసా ఇస్తూ ఉంటాడు లఖన్.
30 ఏళ్ల క్రితం 'లక్నో'లో డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన లీలా భార్గవను మోహన్ శాండిల్య (మోహిత్ చౌహాన్) నమ్మించి మోసం చేస్తాడు. ఆమె అతని పేరును ప్రస్తావించడం కూడా లఖన్ కి నచ్చదు. అయితే న్యాయమూర్తి స్థానంలో ఉన్న ఆయన, తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాప పడుతూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే లఖన్ కి ఒక క్రిమినల్ కేసు తగులుతుంది. లక్నోలో ముఖేశ్ అనే శ్రీమంతుడైన నగల వ్యాపారి హత్య జరుగుతుంది. ఆ హత్య కేసులో ప్రీతి (రష్మీ దేశాయ్) ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు.
ప్రీతి తరఫున ఆ కేసును వాదించడానికి లఖన్ రంగంలోకి దిగుతాడు. అయితే ఆ హత్యను ప్రీతినే చేయించిందనడానికి ఆధారాలు బలంగా ఉంటాయి. ఆమె ఆ షాపులో ఎకౌంటెంట్ గా పనిచేస్తూ ఉండటం .. ముఖేశ్ హత్య జరగడానికి ముందు ఆమెనే సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయడం వలన అందరూ ఆమెనే అనుమానిస్తూ ఉంటారు. ఇక ప్రీతినే ఈ హత్య చేసిందని నిరూపించడానికి ఢిల్లీ నుంచి నీరజ్ (భువనేశ్) అనే లాయర్ రంగంలోకి దిగుతాడు. అతని ధాటిని లఖన్ తట్టుకుని నిలబడటం కష్టమేనని అంతా చెప్పుకుంటూ ఉంటారు.
ముఖేశ్ కీ .. అతని తమ్ముడు విశాల్ కి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే విషయం బయటికి వస్తుంది. విశాల్ తో ప్రీతికి అక్రమ సంబంధం ఉందనే ప్రచారం మొదలవుతుంది. డబ్బు కోసమే ఆమె .. విశాల్ కలిసి ముఖేశ్ ను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతాయి. అందులో ఎంతమాత్రం నిజం లేదని ప్రీతి ఎంతగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోరు. అప్పుడు లఖన్ ఏం చేస్తాడు? ప్రీతి నిర్దోషి అని నిరూపించడానికి అవసరమైన ఆధారాలను అతను ఎలా సంపాదిస్తాడు? అసలు హంతకులు ఎవరు? అనేది మిగతా కథ.
అభిజిత్ దాస్ - అభయ్ చబ్రా ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. టైటిల్ తోనే ఇది కామెడీ టచ్ తో సాగే కథ అనే విషయాన్ని దర్శకులు స్పష్టం చేశారు. హీరో ఎంట్రీ కూడా కామెడీ టచ్ తోనే ప్లాన్ చేశారు. కథను ఎత్తుకున్న తీరు .. ఫ్లాష్ బ్యాక్ ను టచ్ చేసిన విధానం చూస్తే, విస్తృతమైన పరిధిలోనే ఈ సిరీస్ నడుస్తుందనే విషయం అర్థమైపోతోంది. ఒక్కో క్రిమినల్ కేసును హీరో ఎలా డీల్ చేశాడు? తండ్రితో ముడిపడిన ఆయన గతం ఎలాంటిది? అనేది ప్రధానమైన అంశాలుగా మారనున్నాయని తెలుస్తోంది.
కేవలం మూడు ఎపిసోడ్స్ లోనే దర్శకులు చాలా పాత్రలను పరిచయం చేశారు. ఆ తరువాత ఏ పాత్రలు ప్రధానమైన పాత్రలతో కలిసి ట్రావెల్ చేస్తాయనేది చూడాలి. కామెడీ కోసం దర్శకులు పడిన కష్టానికి ఇంతవరకూ ఫలితం దక్కలేదనే చెప్పాలి. అదే పనిగా పాత్రలతో మాట్లాడిస్తూ ,.. హడావిడి చేయడమే కామెడీగా భావించి ఉంటారనే విషయం అర్థమవుతోంది. కామెడీనే ప్రధానంగా గా చేసుకుని నడిపించాలనుకున్నప్పుడు మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది.
ఇక డబ్బింగ్ విషయంలో కూడా సరైన శ్రద్ధ పెట్టలేదని అర్థమవుతోంది. ఏ పాత్ర స్వభావం ఏమిటి? ఆ పాత్ర ఏజ్ గ్రూప్ ఎంత? ఆ పాత్రకి ఏ వాయిస్ సెట్ అవుతుంది? అనేది తప్పకుండా చూసుకోవాలి. ఈ విషయంపై పెద్దగా కసరత్తు జరగలేదని తెలుస్తోంది. పాత్రలకి సెట్ కానీ వాయిస్ లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా స్ట్రీమింగ్ కావలసిన ఎపిసోడ్స్ 10 ఉన్నాయి. అందువలన పూర్తి కథాకథనాలపై ఒక క్లారిటీ రావాలంటే అవి అందుబాటులోకి రావాలి.
మిగతా ఎపిసోడ్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ .. ట్విస్టులు .. తాను అనుకున్నది సాధించడం కోసం హీరో ఎలాంటి అవరోధాలను ఎలా దాటుకుంటూ వెళ్లాడనే విషయంపైనే ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం జరుగుతుంది. ఇంతవరకూ అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఫరవాలేదు. నటీనటులు నటన కూడా ఓకే. సాక్షి అనే పాత్ర ద్వారా హీరోను లవ్ లోకి దింపే ప్రయత్నం కూడా జరిగిపోయింది గనుక, ఆ వైపు నుంచి కథ ఎలా ఉంటుందనేది కూడా చూడాలి.