'గన్స్ అండ్ గులాబ్స్' - (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ

Guns & Gulaabs

Guns & Gulaabs Review

  • గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగే 'గన్స్ అండ్ గులాబ్స్'
  • ప్రధాన పాత్రల్లో దుల్కర్ - రాజ్ కుమార్ రావ్ - గుల్షన్ దేవయ్య 
  • బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం
  • ప్రతి ట్రాక్ పట్ల .. ప్రతి పాత్ర పట్ల కనిపించే క్లారిటీ  
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. లొకేషన్స్ హైలైట్
  • భారీగా ఆవిష్కరించిన మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇది

పోలీసులకు .. గ్యాంగ్ స్టర్స్ కీ మధ్య, గ్యాంగ్ స్టర్స్ కి సంబంధించిన వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం నేపథ్యంలో సాగే కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక క్రైమ్ నేపథ్యంలో సాగే కథకి కాస్త కామెడీని కలిపి అందించిన వెబ్ సిరీస్ గా 'గన్స్ అండ్ గులాబ్' కనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ .. రాజ్ కుమార్ రావు .. గుల్షన్ దేవయ్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. దుల్కర్ చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇది. ఇంతకుముందు 'ఫ్యామిలీ మేన్' .. 'ఫర్జీ' వంటి హిట్ వెబ్ సిరీస్ లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. 

ఈ కథ 1990ల కాలంలో .. 'గులాబ్ గంజ్' అనే ప్రాంతంలో నడుస్తుంది. 'గులాబ్ గంజ్' లో 'నల్లమందు'కు సంబంధించిన పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఆ రైతుల నుంచి 'నల్లమందు'ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంటుంది. అయితే చాలామంది రైతులు 30 ఎకరాలలో మాత్రమే 'నల్లమందు'ను పండించడానికి ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకుని, వందలాది ఎకరాల్లో అదే పంటను పండిస్తూ ఉంటారు. కొంత భాగం మాత్రమే ప్రభుత్వానికి అమ్మేసి, మిగతా పంటను లోకల్ గ్యాంగ్ లీడర్ అయిన 'గాంచి దొర'కు అమ్మేస్తుంటారు. 

గతంలో 'గాంచి దొర' దగ్గర పనిచేసిన 'నబీద్' ఆయనకి వ్యతిరేకంగా మారిపోయి ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేస్తాడు.  'గులాబ్ గంజ్' సమీపంలోని 'షేర్ పూర్' ప్రాంతాన్ని అతను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. నల్లమందును కొనుగోలు చేసే విషయంలో ఈ రెండు ముఠాల మధ్య పోరాటం నడుస్తూ ఉంటుంది. ఈ గొడవల కారణంగానే 'నార్కోటిక్ ఆఫీసర్' గా 'గులాబ్ గంజ్'కి అర్జున్ వర్మ ( దుల్కర్ సల్మాన్) వస్తాడు. అతని భార్య మధు (పూజ గోర్) కూతురు జ్యోత్స్న. కూతురు ఒక స్కూల్లో చదువుతూ ఉంటుంది. 

ఇక అదే గ్రామంలో టిప్పు (రాజ్ కుమార్ రావు) ఒక మెకానిక్ షెడ్ నడుపుకుంటూ ఉంటాడు. అతని తండ్రి బాబు టైగర్, గాంచి దొర కోసం నదీబ్ మనుషుల చేతిలో చనిపోతాడు. తన తండ్రి చావుకు కారణమైన ఇద్దరు వ్యక్తులను టిప్పు చంపేస్తాడు. దాంతో బాబు టైగర్ హత్య చేసిన 'ఆత్మారామ్ ', నదీబ్ ఆదేశంతో మళ్లీ రంగంలోకి దిగుతాడు. టిప్పును చంపడం కోసం వెతకడం మొదలుపెడతాడు. ఆ ప్రయత్నంలో టిప్పు స్నేహితుడు సునీల్ ను ఆత్మారామ్ హత్య చేస్తాడు.

తన తండ్రిని .. తన స్నేహితుడిని చంపినవాడిని అంతం చేయడానికి తనకి 'గాంచి గ్యాంగ్' అండ అవసరసమని భావించిన టిప్పు, ఆ గ్యాంగ్ లో చేరిపోతాడు. అదే సమయంలో అతను చంద్రలేఖ (భాను) అనే టీచర్ ను ప్రేమిస్తూ ఉంటాడు. 'గాంచి దొర' ఒక్కగానొక్క కొడుకైన 'జుగ్ను' .. తానేమిటనేది తండ్రి దగ్గర నిరూపించుకోవాలనే తపనతో ఉంటాడు. సిన్సియర్ ఆఫీసర్ అయిన అర్జున్ ను ఆ ఊరి నుంచి పంపించడానికి ఎస్పీ మిశ్రా ప్రయత్నిస్తుంటాడు. గతంలో అర్జున్ కి 'యామిని' అనే యువతితో గల పరిచయాన్ని క్యాష్ చేసుకోవడానికి అతణ్ణి ప్రతాప్ - ధీరజ్ బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. 

నల్లమందు విషయంలో ఏ గ్యాంగ్ పైచేయిని సాధిస్తుంది? ఆ రెండు గ్యాంగ్ లకు ఎదురు వెళ్లిన అర్జున్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? టిప్పును చంపాలనే ఆత్మారామ్  ప్రయత్నం ఫలిస్తుందా? లేదంటే అతనిపై టిప్పు పెంచుకున్న ప్రతీకారం నెరవేరుతుందా?  తండ్రికి తగిన వారసుడు అనిపించుకోవాలనే 'జుగ్ను' కోరిక నెరవేరుతుందా? అర్జున్ జీవితం .. అతని కెరియర్ పై దెబ్బకొట్టడానికి ప్రయత్నించిన ప్రతాప్ .. ధీరజ్ .. మిశ్రా చివరికి ఏమౌతారు? అనేది మిగతా కథ. 

ఇది 1990లలో జరిగే కథ. అందువలన ప్రతి విషయంలోను .. ప్రతి అంశంలోను ఆ కాలం నాటి వాతావరణమే కనిపించాలి. ఈ విషయంలో దర్శకులు రాజ్ అండ్ డీకే ఇద్దరూ కూడా టైటిల్ దగ్గర నుంచి తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. కథ ప్రకారం చూసుకుంటే దీని పరిధి పెద్దది .. నాలుగు వైపుల నుంచి కథ నడుస్తూ ఉంటుంది. పాత్రల సంఖ్య కూడా ఎక్కువే. అయినా ఆడియన్స్ కి ఎలాంటి కన్ ఫ్యూజన్ ఉండదు. ప్రతి పాత్రకు ఒక పేరు ఉంటుంది .. ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అందువలన పాత్రలు త్వరగా రిజిస్టర్ అవుతాయి. 

కథకు .. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ను ఎంచుకున్న తీరుకే సగం మార్కులు పడిపోతాయి. ఏ పాత్రకి సంబంధించి ఎక్కడా గ్యాప్ రాకుండా వేసుకున్న స్క్రీన్ ప్లే గొప్పగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర ఎక్కడ ఎంటర్ కావాలో అక్కడే అవుతుంది .. అలాగే ఆ పాత్రల ముగింపు ఉంటుంది. ఏ పాత్రను ఎక్కడా వదిలేయడం కనిపించదు. అర్జున్ కూతురు జ్యోత్స్న చదువుకునే స్కూల్ .. ఆమె ముగ్గురు ఫ్రెండ్స్ .. టీచర్ చంద్రలేఖకి సంబంధించిన ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.

ఫస్టు ఎపిసోడ్ బ్యాంగ్ గా వచ్చే ..  టిప్పు రెండు మర్డర్లు చేసే సీన్, సెకండ్ ఎపిసోడ్ బ్యాంగ్ గా వచ్చే టిప్పు ఫ్రెండ్ సునీల్ ను ఆత్మారామ్ గ్యాంగ్ వెంటాడి చంపడం .. 3వ ఎపిసోడ్ లో టిప్పు - బంటిలను ఘాట్ రోడ్ లో శత్రువులు ఛేజ్ చేసే సీన్ .. 'గాంచి దొర'ను లేపేయడానికి హాస్పిటల్ పై ఆత్మారామ్ దాడి చేసే సీన్ .. క్లైమాక్స్ సీన్ .. ఈ సిరీస్ లో హైలైట్స్ గా అనిపిస్తాయి.   

అన్ని ట్రాకులను .. ముఖ్యమైన పాత్రలను ప్రీ క్లైమాక్స్ కి చేర్చి, అక్కడి నుంచి అనేక రకాల ట్విస్టులతో ఆ పాత్రలను క్లైమాక్స్ దిశగా పరుగులు తీయించిన తీరు ఆకట్టుకుంటుంది. ఏ మాత్రం ఆసక్తి తగ్గకుండా చూసుకుంటూనే, కామెడీని వర్కౌట్ చేసిన తీరు కూడా నచ్చుతుంది. ప్రధానమైన పాత్రధారులంతా చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా గుల్షన్ దేవయ్య పాత్రను డిజైన్ చేసిన తీరు ఎక్కువమందికి నచ్చుతుంది.

దర్శకులు కథను పట్టుగా తయారు చేసుకున్న తీరు .. కునాల్ మెహతా పకడ్బందీగా వేసిన స్క్రీన్ ప్లే .. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పంకజ్ కుమార్ ఫొటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. అద్భుతమైన లొకేషన్స్ ను .. అక్కడ జరిగే ఛేజింగ్స్ ను పంకజ్ కుమార్ గొప్పగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. కథ ఎన్ని మలుపులు తిరుగుతున్నా, మన చేయిని మాత్రం వదిలేయదు. ఈ మధ్య కాలంలో వచ్చిన మరో భారీ సిరీస్ గా .. ఇంట్రెస్టింగ్ సిరీస్ గా దీనిని గురించి చెప్పుకోవచ్చు. 

Movie Name: Guns & Gulaabs

Release Date: 2023-08-18
Cast: Dulquer Salmaan, Rajkummar Rao, Gulshan Devaiah, Adarsh Gourav, Satish Kaushik,Vipin Sharma,TJ Bhanu
Director: Raj & DK
Music: Aman Pant
Banner: D2R Films

Guns & Gulaabs Rating: 3.50 out of 5

Trailer

More Reviews