దేశభక్తికి సంబంధించిన సినిమాలు .. 'RAW' నేపథ్యంలో సాగే కథలు గతంలో చాలానే వచ్చాయి. యాక్షన్ ప్రధానంగా నడిచే ఈ సినిమాలకు అందరూ కనెక్ట్ అవుతుంటారు. దేశభక్తిని పెంచడం .. స్ఫూర్తిని కలిగించడం .. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని పోరాటపటిమకి అవసరమైన ప్రేరణను ఈ తరహా కథలు అందించడం కారణం కావొచ్చు. అలాంటి ఒక నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ గా 'కమెండో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీజన్ 1 నిన్నటి నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ పాకిస్థాన్ లో మొదలవుతుంది. పాకిస్థాన్ లోని ఓ శివారు ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేయబడిన ఒక ల్యాబ్ లో అత్యంత ప్రమాదకరమైన ఒక వైరస్ ను తయారు చేస్తుంటారు. తాము అనుకున్నట్టుగా వైరస్ ను రూపొందించడంలో వాళ్లు సక్సెస్ అవుతారు. దానిని ఓ ఇండియన్ సోల్జర్ పైనే పరీక్షించి చూస్తారు. ఇక ఆ వైరస్ ను హిందుస్థాన్ పై ప్రయోగించాలనే నిర్ణయానికి వస్తారు. ఆ వైరస్ ను వదిలిన 24 గంటల్లో హిందుస్థాన్ శ్మశానంగా మారుతుందనే నిర్ధారణకు వస్తారు. ఇదంతా వారి నాయకుడు జాఫర్( అమిత్) అధ్వర్యంలో జరుగుతుంది.
ఇండియాకి చెందిన 'రా' ఏజెంట్ క్షితేజ్ ( వైభవ్) పాకిస్థానీగా పేరు మార్చుకుని అదే ల్యాబ్ లో పనిచేస్తూ ఉంటాడు. పాకిస్థాన్ ల్యాబ్ నుంచి వైరస్ కిట్స్ హిందుస్థాన్ కి బయలుదేరగానే అతను, ఆ విషయాన్ని తన స్నేహితుడైన విరాట్ ( ప్రేమ్)కి సమాచారాన్ని అందిస్తాడు. ఆ కిట్స్ తో వస్తున్న కంటెయినర్ ను అడ్డగించి, వాళ్ల ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా చేస్తాడతను. ఈ లోగా వైరస్ యాక్సెస్ కి సంబంధించిన కంటెంట్ ను పెన్ డ్రైవ్ లోకి తీసుకున్న క్షితేజ్, దానిని ల్యాబ్ దాటిస్తాడు. క్షితేజ్ పై అనుమానం కలగడంతో, అతనిని అరెస్టు చేసి, పాకిస్థాన్ లోని ఒక జైల్లో బంధిస్తారు.
విరాట్ - క్షితేజ్ ఇద్దరూ కూడా ఒకే సమయంలో కమెండోలుగా శిక్షణ పొందుతారు. అప్పుడే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. 'రా'లోనే పనిచేస్తున్న స్మిత ( శ్రేయ చౌదరి)తో విరాట్ కి ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. ఇక తన ట్రైనింగ్ సమయంలో పరిచయమైన టీనా (మానిని చద్దా)తో క్షితేజ్ కి పెళ్లి అవుతుంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉంటుంది. కాకపోతే ఒక ఆపరేషన్ నిమిత్తం క్షితేజ్ పాకిస్థాన్ వెళ్లిన విషయం మాత్రం ఆమెకి తెలియదు. 'రా' కదలికలకు సంబంధించిన విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు జాఫర్ కి తెలిసిపోతూ ఉంటాయి.
అలాగే అక్కడి విషయాలు అబ్బాస్ ( ముఖేశ్) ద్వారా 'రా'కి తెలిసిపోతూ ఉంటాయి. తన స్నేహితుడి కోసం .. తన దేశం కోసం విరాట్ పాకిస్థాన్ బయల్దేరతాడు. గతంలో అతనితో కలిసి పనిచేసిన భావన ( ఆదా శర్మ) మార్గ మధ్యంలో అతనితో జాయిన్ అవుతుంది. ఇద్దరూ కలిసి పాకిస్థాన్ లోని తమ ఇన్ ఫార్మర్ అబ్బాస్ ను కలుస్తారు. పాకిస్థాన్ జైలు నుంచి క్షితేజ్ ను తప్పించడం అసాధ్యమని అబ్బాస్ చెబుతాడు. అతని మాటలు వినిపించుకోకుండా విరాజ్ - భావన కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏమిటి? ప్రమాదకరమైన ఆ జైల్లోకి వారు అడుగుపెట్టగలుగుతారా? క్షితేజ్ ను బయటికి తీసుకుని రాగలుగుతారా? అనేది మిగతా కథ.
ఈ వెబ్ సిరీస్ కి దర్శక నిర్మాత విపుల్ అమృత్ లాల్. తాను అనుకున్న కథను ఆయన 4 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుంచాడు. మొత్తంగా చూసుకుంటే ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివిని కలిగి ఉంది. హిందుస్థాన్ పై వైరస్ ను ప్రయోగించడానికి పాకిస్థాన్ ప్రయత్నించడం .. ఆ ప్రయత్నాన్ని హీరో విఫలం చేయడం ఫస్టు ఎపిసోడ్ లో, తన స్నేహితుడిని .. తన దేశాన్ని కాపాడటానికి హీరో పాకిస్థాన్ లోకి ప్రవేశించడం రెండో ఎపిసోడ్ లో, క్షితేజ్ ను జైల్లో నుంచి విడిపించడానికి ప్లాన్ చేయడం మూడో ఎపిసోడ్ లో .. జైల్లోకి ఎంటరైపోవడం నాలుగో ఎపిసోడ్ లో కనిపిస్తుంది.
మొదటి ఎపిసోడ్ నుంచి నాలుగో ఎపిసోడ్ వరకూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. కథ ఎక్కడా పట్టు సడలకుండా .. పకడ్బందీగా నడుస్తుంది. పాత్రలను మలిచిన విధానం .. సన్నివేశాలను డిజైన్ చేసుకున్న పద్ధతి పెర్ఫెక్ట్ గా అనిపిస్తాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ కథ పరుగులు తీస్తుంది. 4వ ఎపిసోడ్ లో పాకిస్థాన్ జైలులోకి హీరో బృందం ఎంటరయ్యే 20 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలు ప్రేక్షకులను టెన్షన్ పెట్టేస్తాయి.
సెట్స్ పరంగా .. లొకేషన్స్ పరంగా .. యాక్షన్ .. ఛేజింగ్ దృశ్యాల పరంగా ఎక్కడా భారీతనం తగ్గలేదు. ఒక బాలీవుడ్ సినిమాను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. 'రా' ఆఫీస్ .. ఐఎస్ఐ హెడ్ క్వార్ట ర్స్ .. టెక్నీకల్ రూమ్ .. హాస్పిటల్ కి సంబంధించిన వాతావరణాన్ని చాలా నేచురల్ గా చూపించారు. పాకిస్థాన్ జైలు సెట్ మాత్రం సహజత్వానికి కొంచెం దూరంగా కనిపిస్తుంది. కొత్తగా వేసిన సెట్ అనే విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఇక భావన వేసిన ట్రాప్ లో ఆ జైలు సెక్యూరిటీ ఆఫీసర్ పడిపోవడం చాలా సిల్లీగా అనిపిస్తుంది.
ఒక వైపున బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మరో వైపున ఫొటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచాయి. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ఫస్టు సీజన్ కి సంబంధించిన కీలకమైన విషయం 'పెన్ డ్రైవ్'. ఆ పెన్ డ్రైవ్ కోసమే పాక్ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ పాయింట్ నుంచి సెకండ్ సీజన్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక హిందుస్థాన్ నుంచి 'రా' సీక్రెట్స్ ను చేరవేస్తుందెవరనేది చివర్లో రివీల్ చేసి షాక్ ఇచ్చారు .. సెకండ్ సీజన్ పై ఆసక్తిని పెంచారు. యాక్షన్ సిరీస్ లను ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుందనడంలో సందేహం లేదు.
కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను మలిచిన తీరు .. సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం .. భారీ యాక్షన్ సీన్స్ .. లొకేషన్స్ .. సెట్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. అనవసరమైన సీన్స్ లేకపోవడం .. చాలా తక్కువ నిడివిలోనే విస్తారమైన కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పడం .. ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.
'కమెండో' - (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ
| Reviews
Commando Review
- భారీ యాక్షన్ వెబ్ సిరీస్ గా 'కమెండో'
- బయో వార్ నేపథ్యంలో సాగే కథ
- ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలు
- లొకేషన్స్ .. యాక్షన్ దృశ్యాలు హైలైట్
- అదనపు బలంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఫొటోగ్రఫీ
Movie Name: Commando
Release Date: 2023-08-11
Cast: Prem, Adah Sharma, Shreya Chaudary, Vaibhav, Amith Saim, Mukhesh Chhabra, Manini Chedda Tigmanshu
Director: Vipul Amruthlal
Music: -
Banner: Sun Shine Pictures
Review By: Peddinti