'ది జెంగబూరు కర్స్' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ

The Jengaburu Curse

The Jengaburu Curse Review

  • ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రధారిగా 'ది జెంగబూరు కర్స్'
  • మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ 
  • బలమైన కథ .. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే 
  • ఆకట్టుకునే లొకేషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ 
  • ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటి

మైనింగ్ మాఫియా నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక నేపథ్యంతో రూపొందిన వెబ్ సిరీస్ 'ది జెంగబూరు కర్స్'. 'జెంగబూర్' అంటే 'రెడ్ మౌంటెన్' అని అర్థం. ఫరియా అబ్దుల్లా .. నాజర్ .. మకరంద్ దేశ్ పాండే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, ఈ రోజు నుంచే 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 7  ఎపిసోడ్స్ ను వదిలారు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగా నిడివిని కలిగి ఉంది. ఈ వెబ్ సిరీస్ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.

ప్రియంవద (ఫరియా అబ్దుల్లా) లండన్ లో చదువుకుని .. అక్కడే జాబ్ చేస్తూ ఉంటుంది. ఒక రోజున ఇండియా నుంచి ఆమెకి రవిచందన్ రావు (నాజర్) కాల్ చేస్తాడు. ఆమె తండ్రి స్వతంత్ర దాస్ కి తాను స్నేహితుడిననీ, అతను కొన్ని రోజులుగా కనిపించడం లేదని చెబుతాడు. పోలీసులకు ఒక డెడ్ బాడీ దొరికిందనీ, అది దాస్ డెడ్ బాడీగా వాళ్లు భావిస్తున్నారని అంటాడు. బాడీని గుర్తించడానికి 'భువనేశ్వర్'కి రమ్మంటూ తొందరచేస్తాడు. దాంతో ఆమె ఉన్నపళంగా ఇండియాకి బయల్దేరుతుంది. 

స్వతంత్ర దాస్ ఒక ప్రొఫెసర్ .. భువనేశ్వర్ ప్రాంతంలోని అడవిని రక్షించడం కోసం .. దానిని నమ్ముకున్న గిరిజనులను కాపాడటం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి. అక్కడ మైనింగును  వ్యతిరేకిస్తూ జైలుకి వెళ్లిన ఆయన మూడేళ్ల శిక్ష తరువాత తిరిగి విడుదలవుతాడు. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని తెలిసి ప్రియ ఆందోళన చెందుతుంది. రావుతో పాటు వెళ్లి డెడ్ బాడీని చూసిన ఆమె, చనిపోయింది తన తండ్రి కాదని తెలుసుకుని తేలికగా ఊపిరి పీల్చుకుంటుంది.

ప్రియ పుట్టింది 'జెంగబూరు' సమీపంలోని 'బోన్డ్రియా' గిరిజన ప్రాంతంలోనే. అందువలన తన  తండ్రి అక్కడికి వెళ్లి ఉండొచ్చునని భావిస్తుంది. ఆయనను కలుసుకోవడానికి అడవిలోకి వెళుతుంది .. రహస్యంగా ఆమెను పోలీసులు అనుసరిస్తారు. అక్కడ పోలీసులకు .. గిరిజనులకు మధ్య జరిగిన పోరాటంలో దాస్ చనిపోతాడు. తమ ప్రాంతాన్ని కాపాడమని ప్రియను కోరుతూ కన్నుమూస్తాడు. తన ద్వారా తన తండ్రి ఆచూకీ తెలుసుకుని ఆతనిని అంతం చేశారనే విషయం అప్పుడు ప్రియకి అర్థమవుతుంది. 

తనని ఫారిన్ నుంచి రప్పించింది రవిచందన్ రావు .. కానీ ఆ పేరుతో తన తండ్రికి స్నేహితులే లేరని తెలుసుకుని ప్రియ షాక్ అవుతుంది. తన తండ్రికి సహకరించిన డాక్టర్ పాణిగ్రాహి ( మకరంద్ దేశ్ పాండే) కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుంటుంది. అలాగే లండన్ కి చెందిన 'బీట్రెస్' అనే యువతి తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహిస్తుంది. తన తండ్రికి శిష్యుడిగా ఉండే ఐఏఎస్ కేడర్ అధికారి ధృవ్ కన్నన్, ఆయనకి ఎందుకు దూరమయ్యాడనేది ఆమెను ఆలోచనలో పడేస్తుంది.  

గతంలో ఉన్న ప్రదేశం నుంచి గిరిజనులను తరిమేయడం .. వాళ్లను నక్సలైట్స్ గా చిత్రీకరించడం .. వాళ్లకి నాయకుడు దాస్ అంటూ తప్పుడు ప్రచారం చేయడం .. అక్కడి గిరిజనులు అంతుబట్టని వ్యాధి బారిన పడటం ..  వంటి విషయాలతో, ఏదో జరుగుతోందనేది ఆమెకి అర్థమవుతుంది. స్వార్థశక్తుల పన్నాగాలు వెనుక కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, మరేదో జరుగుతోందనే అనుమానం వస్తుంది. దాంతో తండ్రి కోరిన విధంగానే ఆమె గిరిజనుల తరఫున పోరాడటానికి సిద్ధమవుతుంది. ఫలితంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేదే మిగతా కథ.

నిఖిల్ రవి - మయాంక్ తివారి రాసిన ఈ కథ విసృతమైన పరిధిలో కనిపిస్తుంది. పాత్రల పరిధి ఎక్కువ .. అలాగే ప్రతి పాత్ర ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే నడుస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది. కథ ఒక చోటు నుంచి మరో చోటుకు పరుగులు తీస్తూ ఉంటుంది. ఒక వైపున గిరిజనులు .. మరో వైపున వారికి అండగా నిలిచే నిజాయితీ పరులు .. స్వార్థపరులైన రాజకీయనాయకులు .. ఇంకో వైపున అవినీతి పోలీస్ అధికారులు .. ఈ ట్రాకులన్నిటినీ టచ్ చేస్తూ స్క్రీన్ ప్లే వేసుకుంటూ వెళ్లిన తీరు ఆసక్తిని రేపుతుంది. 

ఒక మారుమూల గిరిజన ప్రాంతం నుంచి విదేశాల వరకూ దర్శకుడు ఈ కథను విస్తరిస్తూ వెళ్లిన విధానం .. అందుకు తగిన ఆర్టిస్టులను ఎంచుకున్న తీరు .. మూడు ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంది ..  ఆ పాత్రల వెనుక ప్రేక్షకుడు పరుగులు పెడుతూనే ఉంటాడు. కథ ఎప్పటికప్పుడు మలుపులు తీసుకుంటూ ఉండటం వలన .. అనవసరమైన సీన్స్ లేకపోవడం వలన ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి ఎపిసోడ్ .. తరువాత ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతూనే కథ ముందుకు వెళుతుంది. 

ఒక వైపున మైనింగ్ మాఫియాను .. మరో వైపున గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్నీ .. ఈ మధ్యలో నలిగిపోయిన తండ్రీ కూతుళ్ల జీవితాలను ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథతో పాటు ట్రావెల్ చేయిస్తుంది. మైనింగ్ నేపథ్యంలో సన్నివేశాలను .. ఛేజింగ్ దృశ్యాలను .. ఫారెస్టు నేపథ్యంలోని సీన్స్ ను చిత్రీకరించడంలో కెమెరా పనితనం కనిపిస్తుంది. ఎడిటర్ కి కాస్త ఎక్కువ పనిపెట్టే కథనే ఇది. అయినా పూర్తి క్లారిటీతో అందించిన తీరుకి మంచి మార్కులు ఇవ్వొచ్చు.

 నిర్మాణ విలువల పరంగా వంకబెట్టలేని వెబ్ సిరీస్ ఇది. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ కట్టిపడేస్తాయి. అసభ్యత ... అశ్లీలత అనేవి మచ్చుకి కూడా కనిపించవు. దురాశతో స్వార్థపరులు చేసే ఆగడాలకు, ఆశ్రయం కోసం .. ఆకలిని జయించడం కోసం గిరిజనులు చేసే పోరాటంగా ఈ వెబ్ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు. అలాగే తాను పుట్టిన ప్రాంతాన్ని .. తన తండ్రి కోరికను నెరవేర్చడం కోసం ఒక యువతి కొనసాగించిన పోరాటంగా కూడా భావించవచ్చు. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. అడ్వెంచర్ పరంగా చూసుకుంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ గా చెప్పుకోవచ్చు. 

Movie Name: The Jengaburu Curse

Release Date: 2023-08-09
Cast: Faria Abdullah, Nassar, Makarand Deshpande, Sudev Nair, Melanie Gray, Deipak Sampath,
Director: Nila Madhab Panda
Music: Aloknanda Dasgupta
Banner: Srudio Next Production

The Jengaburu Curse Rating: 3.50 out of 5

Trailer

More Reviews