సోనీ లివ్ లో ఈ శుక్రవారం రోజున ఒక ఫ్యామిలీ డ్రామా స్ట్రీమింగ్ అయింది .. ఆ సినిమా పేరే 'ఫటా ఫటి'. ఇది ఒక బెంగాలీ సినిమా. మే 12వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్స్ కి వచ్చింది. సింపుల్ లైన్ తో అక్కడి ప్రేక్షకుల ముందుకు వెళ్లిన ఈ సినిమా, నిన్నటి నుంచి బెంగాలితో పాటు, తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కోల్ కతా సమీపంలోని ఒక చిన్న టౌన్ లో బాచస్పతి (అభీర్ ఛటర్జీ) మధ్యతరగతి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. వయసు పై బడిన తల్లి .. భార్య .. తమ్ముడు .. ఇదీ అతని కుటుంబం. అతను ఒక బట్టల దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు. అతని జీతంపైనే ఆ కుటుంబం ఆధారపడి నడుస్తూ ఉంటుంది. భార్య ఫుల్లోరా (రిటాభరీ చక్రవర్తి) కూడా ఆ కాలనీలో లేడీస్ టైలర్ గా కష్టపడుతూ ఆర్ధికంగా కుటుంబానికి ఆసరాగా నిలబడుతుంది.
ఫుల్లోరా మంచి అందగత్తెనే .. అయితే ఆమె చాలా లావుగా తయారవుతుంది. దాంతో ఆమెను అంతా అదోరకంగా చూస్తూ ఉంటారు. ఐదేళ్లయినా ఆమెకి పిల్లలు కలగక పోవడం గురించి .. ఆమె బరువు పెరుగుతూ ఉండటం గురించి సమయం దొరికినప్పుడల్లా అత్తగారు సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది. అయితే తనని తన భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండటం వలన, అత్తగారి మాటలను ఆమె పెద్దగా పట్టించుకోదు. ఎప్పటికప్పుడు సర్దుకుపోతూనే ఉంటుంది.
అయితే అదే కాలనీకి చెందిన బిక్కీ సేన్ (స్వస్తిక దత్త) మాత్రం తాను చాలా స్లిమ్ గా ఉంటాననే అహంభావంతో ఉంటుంది. ఆ చుట్టుపక్కల జరిగే ఫ్యాషన్ షోస్ లో పాల్గొంటూ ఉంటుంది. వీలైనప్పుడల్లా ఫుల్లోరాను అవమానపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమెకి సరైన సమాధానం చెప్పే సమయం కోసం ఎదురుచూస్తూనే, లావుగా ఉన్నవారిలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను పోగొట్టడానికి ఫుల్లోరా ట్రై చేస్తూ ఉంటుంది. అందువలన కాస్త లావుగా ఉండే లేడీస్ అంతా ఆమె ఫ్రెండ్స్ గా మారిపోతారు.
అలాంటి పరిస్థితుల్లో బాచస్పతి ఉద్యోగం పోతుంది .. కుటుంబం గడవడం కష్టమవుతుంది. దాంతో అతను కలకత్తాలోని ఒక బట్టల దుకాణంలో చేరతాడు. ఆ కుటుంబం పట్ల ఫుల్లోరా బాధ్యత మరింత పెరుగుతుంది. ఆర్ధిక పరంగా భర్తకు అండగా నిలబడాలి .. అదే సమయంలో తనని చూసి తన భర్త గర్వపడేలా చేయాలి అని ఆమె నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? ఫలితంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
అరిత్రా ముఖర్జీ బెంగాలికి చెందిన రచయిత .. దర్శకుడు .. నటుడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇది. స్త్రీలు లావుగా ఉండటం వలన ఎన్ని రకాల ఇబ్బందులను పడతారు .. ఎలాంటి అవమానాలను ఫేస్ చేస్తారు? వాటి బారి నుంచి బయటపడటం కోసం వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? మానసికంగా ఎంత సంఘర్షణను అనుభవిస్తారు? అనేది చాలామందికి తెలుసు. ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యను ఎలా ఎదుర్కోవచ్చు .. అనుకున్నది ఎలా సాధించవచ్చు? అనేది నిరూపించే ఒక నాయిక కథనే ఈ సినిమా.
అందమనేది రూపంలో కాదు మంచి మనసులో ఉంటుంది .. అంకితభావంతో కూడిన ఆత్మవిశ్వాసంలో ఉంటుంది .. కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటూనే పేరు .. డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో దర్శకుడు అనుకున్న మెసేజ్ ను ఇవ్వగలిగాడు.
కథలో ఎక్కడా సినిమాటిక్ మేజిక్ లు .. ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లే ఉండదు. సాదాగా .. సహజంగా .. ఈ కథ నడుస్తూ ఉంటుంది. ప్రధానమైన పాత్రధారులంతా కూడా చాలా సహజంగా చేశారు. కాకపోతే అక్కడక్కడా కొంతమందికి డబ్బింగ్ వాయిస్ సెట్ కాకపోవడం .. సరైన పదాలు పడకపోవడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఆలోక్ ఫొటోగ్రఫీ .. అనింద్య ఛటర్జీ సంగీతం .. శుభజిత్ సింఘా ఎడిటింగ్ ఫరవాలేదు.
బెంగాలి కథల్లో సహజత్వానికి పెద్ద పీట వేస్తారు. పుస్తకంలో ఉన్నా .. తెరపై ఉన్నా కథల్లో వాళ్లు సహజత్వాన్ని ఎక్కువగా ఆశిస్తారు. అనవసరమైన ఆర్భాటాలు పెద్దగా కనిపించవు. అలాంటి అభిరుచికి తగిన విధంగానే ఈ సినిమాను ఆవిష్కరించారు. ఈ సినిమాలోని పాయింట్ అందరికీ వర్తించేదే అయినా, ఇక్కడి ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా స్లోగా అనిపించే అవకాశాలు ఎక్కువ.
'ఫటా ఫటి' - (సోనీలివ్) మూవీ రివ్యూ
| Reviews
Fatafati Review
- బెంగాలీ భాషలో రూపొందిన 'ఫటా ఫటి'
- మే నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఫ్యామిలీ ఆడియన్స్ చూసే కంటెంట్
- నిన్నటి నుంచే 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్
- ఇక్కడివారికి చాలా స్లోగా అనిపించే ట్రీట్మెంట్
Movie Name: Fatafati
Release Date: 2023-08-04
Cast: Ritabhari Chakraborty, Abir Chatterjee, Swastika Dutta, Soma Chakraborty, Raktim Samanta
Director: Aritra Mukherjee
Music: Anindya Chatterjee
Banner: Windows Production
Review By: Peddinti
Fatafati Rating: 2.50 out of 5
Trailer