'LGM' - మూవీ రివ్యూ

LGM

LGM Review

  • ధోని సొంత బ్యానర్లో నిర్మితమైన 'LGM'
  • ఆసక్తిని రేకెత్తించిన స్టోరీ లైన్
  • వినోదభరితంగా ఆవిష్కరించలేకపోయిన డైరెక్టర్
  • బలహీనమైన పాత్రలు .. పేలవమైన సన్నివేశాలు
  • గ్లామర్ పరంగాను ఆకట్టుకోలేకపోయిన ఇవాన 

క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న ఆయన ఈ బ్యానర్ నుంచి మొదటి సినిమాగా తమిళంలో 'LGM' సినిమాను నిర్మించాడు. ఆయన భార్య సాక్షి సింగ్ ధోని నిర్మాణ వ్యవహారాలను చూస్తూ వచ్చింది. తమిళంలో క్రితం నెల 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగులో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీశ్ కల్యాణ్ - ఇవాన జంటగా నటించిన ఈ సినిమాకి రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

గౌతమ్ (హరీశ్ కల్యాణ్) బాల్యంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి (నదియా) అతనికి ఏ లోటు తెలియకుండా పెంచుతుంది. అతను బాగా చదువుకుని ఓ పెద్ద సంస్థలో జాబ్ చేస్తూ ఉంటాడు. అదే సంస్థలో పనిచేస్తున్న మీరా (ఇవాన)తో ప్రేమలో పడతాడు. రెండేళ్లపాటు డేటింగ్ చేసిన తరువాత పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వద్దామని మీరా అంటుంది. అందుకు అతను అంగీకరిస్తాడు. అలా రెండేళ్లు గడిచిపోతాయి. ఆ తరువాత అతనితో పెళ్లికి మీరా తన అంగీకారాన్ని తెలియజేస్తుంది. 

ఈ రెండేళ్లుగా తల్లి ఎన్నిసార్లు పెళ్లి మాట ఎత్తినా ఆ మాటను దాటవేస్తూ వచ్చిన గౌతమ్, ఆ తరువాత అసలు విషయం తల్లితో చెబుతాడు. మీరా ఇంట్లో పెళ్లి మాటలకు ఏర్పాట్లు జరుగుతాయి. గౌతమ్ తల్లి మాటలను బట్టి, అతనితో తన పెళ్లి తరువాత ఆమె తమ దగ్గరే ఉంటుందనే విషయం మీరాకి అర్థమవుతుంది. దాంతో ఆమె గౌతమ్ ను పక్కకి తీసుకుని వెళ్లి మాట్లాడుతుంది. తమ పెళ్లి తరువాత అతని తల్లి తమతోనే ఉండే విషయాన్ని గురించి తాను ఆలోచన చేయలేదనీ, తనకి కొంత సమయం కావాలని అడుగుతుంది. 

దాంతో తన తల్లిని తీసుకుని గౌతమ్ సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి మీరా  కుటుంబ సభ్యుల పట్ల గౌతమ్ తల్లి కోపంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో గౌతమ్ బాగా హర్ట్ అయ్యాడని తెలిసిన మీరా, అతణ్ణి  కాస్త కూల్ చేస్తుంది. తమ పెళ్లికి ముందే అతని తల్లి .. తాను ఒకరినొకరం అర్థం చేసుకోవాలనీ, లేదంటే భవిష్యత్తులో గొడవలు అవుతాయని అంటుంది. తన ఫ్యామిలీ .. అతని ఫ్యామిలీ కలిసి ఒక టూర్ ప్లాన్ చేద్దామనీ, అలా చేయడం వలన రెండు కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. 

ముఖ్యంగా కాబోయే అత్తగారికి తన గురించీ, ఆమె గురించి తనకి తెలుసుకునే అవకాశం  ఏర్పడుతుందని చెబుతుంది. ఇలాంటి ఒక ఒప్పందానికి తన తల్లి ఒప్పుకోదనే విషయం గౌతమ్ కి తెలుసు. అందువలన అతను అసలు సంగతి దాచేసి, ఆఫీస్ వారు ఏర్పాటు చేసిన ట్రిప్ అంటూ,   మీరా ఫ్యామిలీ ట్రిప్ లో తన తల్లి జాయిన్ అయ్యేలా చేస్తాడు. ఆ జర్నీలో కాబోయే అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది మిగతా కథ. 

ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ ద్వారానే స్టోరీ లైన్ ఏమిటనేది చెప్పేశారు.  సాధారణంగా పెళ్లికి ముందు ఒకరిని గురించి ఒకరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో డేటింగ్ చేయడం సహజమైపోయింది. అలాగే కాబోయే అత్తాకోడళ్లకి కూడా ఒకరిని గురించి ఒకరికి ముందుగానే తెలియాలనే ఈ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది .. ఆసక్తిని రేకెత్తించింది. దాంతో ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ కావడం ఖాయమని అనుకున్నారు. కానీ అలాంటి అంచనాలకు .. ఆలోచనలకు ఈ సినిమా చాలా దూరంగానే ఉండిపోయింది. 

దర్శకుడు రమేశ్ తమిళ్ మణి అల్లిన ఈ కథ, హీరో .. అతని తల్లి .. ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా కథ మొదలైన తరువాత హీరో .. హీరోయిన్ మధ్య లవ్ .. రొమాన్స్ నడుస్తూ ఉంటే, ఆడియన్స్ ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కథ మొదలు కాగానే తమ మధ్య రెండేళ్లుగా లవ్ నడిచిందని హీరో నోటి మాటగా చెబుతాడు .. అప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన టెన్షన్ మొదలవుతుంది. ఇక్కడే యూత్ సగం నీరు కారిపోతుంది.

ఇక ఫస్టాఫ్ అంతా కూడా హీరో ఇల్లు .. ఆఫీస్ .. క్యాంటీన్ .. పెళ్లి గురించిన మాటలు తప్ప, ఏమీ జరగదు. సంభాషణలతోనే సాగదీస్తూ టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగును కలిగించారు. తల్లి అసహనం .. ప్రియురాలి చిటపటలు .. మధ్యలో హీరోగారు తలపట్టుకోవడం మధ్య ప్రేక్షకుడు నలిగిపోతాడు. ఆ సమయంలో పడిన ఇంటర్వెల్ బ్యాంగ్ తో, సెకండాఫ్ పై కొన్ని ఆశలు పెట్టుకుంటాడు. యోగిబాబు ఎంట్రీ ఇవ్వడంతో ఇక ఇక్కడి నుంచి అన్నీ నవ్వులే అనుకుంటాడు. 

సెకాండాఫ్ మొదలైన కాసేపటికే .. ఫస్టాఫ్ నే చాలా బాగుంది అనిపిస్తుంది. కథ తన ఇష్టం వచ్చినట్టుగా తెరపై తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకుడు దానిని కంట్రోల్ చేయలేడు గనుక, అలా చూస్తూ కూర్చుంటాడు అంతే. కాస్త హడావిడిని .. మరికాస్త గందరగోళాన్ని సృష్టించి అందులో నుంచి కామెడీని పిండాలని దర్శకుడు భావించాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో హడావిడి .. గందరగోళం మాత్రం మిగిలిపోయాయి. కథ ఎక్కడెక్కడో తిరుగుతూ చివరికి ముగింపు కార్డుకు లొంగిపోతుంది. 

హీరో హరీశ్ కల్యాణ్ .. హీరోయిన్ ఇవానా .. నదియా .. యోగిబాబు . ఎవరి పాత్ర పరిధిలో వారు నటించారు. 'లవ్ టుడే'లో తన లుక్ తో కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసిన ఇవాన, ఈ సినిమాలో అంతగా గ్లామరస్ గా కనిపించలేదు. ఇక మిగతా పాత్రలలో కొన్ని మనకి అనవసరమని అనిపిస్తాయి. దర్శకుడికి కూడా అలాగే అనిపించిందేమో, కొన్ని పాత్రలను మధ్యలోనే బస్సులో నుంచి దింపేశాడు. కథాకథనాలు .. పాత్రలు మాత్రమే కాదు, పాటలు కూడా బలహీనంగానే ఉన్నాయి.  బాణీలను సమకూర్చింది కూడా దర్శకుడే కావడం విశేషం. 

విశ్వజిత్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ప్రదీప్ ఎడిటింగ్ విషయానికొస్తే, స్వామిజీ భజన బృందం .. క్లబ్ సీన్స్ .. హీరో ఫ్రెండ్స్ సీన్స్ ట్రిమ్ చేయడమో .. లేపేయడమో చేయవలసింది. దర్శకుడు అనుకున్న లైన్ మంచిదే. కానీ దానికి పూర్తి కథా రూపాన్ని ఇచ్చి, ఆడియన్స్ ను అలరించేలా ఆవిష్కరించడంలో ఆయన విఫలమయ్యాడనే చెప్పాలి. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. కామెడీ ఎక్కడా కనెక్ట్ కాని ఈ కథ, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి పంపిస్తుంది.

Movie Name: LGM

Release Date: 2023-08-04
Cast: Harish Kalyan, Ivana, Nadhiya, Yogibabu, Deepa Shankar, Venkat Prabhu, Vinodini
Director: Ramesh Thamilmani
Music: Ramesh Thamilmani
Banner: Dhoni Entertainment

LGM Rating: 2.50 out of 5

Trailer

More Reviews