'జియో సినిమా'లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో వెబ్ సిరీస్ 'కాల్ కూట్'. ఇది పోలీస్ డ్రామా .. ఒక యాసిడ్ దాడి కేసును ఆధారంగా చేసుకుని ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ గా ఇది స్ట్రీమింగ్ కానుంది. వాటిలో 4 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. మరో నాలుగు ఎపిసోడ్స్ ఆగస్టు 2వ తేదీ నాటికి రోజుకి ఒక ఎపిసోడ్ చొప్పున స్ట్రీమింగ్ కానున్నాయి. విజయ్ వర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళితే .. రవిశంకర్ త్రిపాఠి (విజయ్ వర్మ) సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. తండ్రి మరణించడంతో, కుటుంబ బాధ్యత అతనిపైనే పడుతుంది. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ తన డ్యూటీకి వెళ్లివస్తూ ఉంటాడు. మొదటి నుంచి కూడా అతనికి పోలీస్ జాబ్ ఇష్టం ఉండదు. తన స్వభావానికీ .. పోలీస్ పనికి పొంతన లేని కారణంగా అయిష్టంగానే అందులో కొనసాగుతూ ఉంటాడు. అయితే పై అధికారిగా ఉన్న జగదీశ్ అతణ్ణి టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో అతను ఆ జాబ్ కి రిజైన్ చేసి .. ఆ లెటర్ ను జగదీశ్ ముందుంచుతాడు.
ఈ నేపథ్యంలోనే రవిశంకర్ కి అతని తల్లి సంబంధాలు చూస్తుంటుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా 'పారుల్' (శ్వేత) అనే యువతి ఫొటో అతని దగ్గరికి వస్తుంది. ఆ తరువాత ఆ అమ్మాయిపై యాసిడ్ దాడి జరుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. ఆమె ముఖం సగానికి పైగా కాలిపోతుంది. ఆ కేసు రవిశంకర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ కేసుకి FIR రాస్తేనే అతని రాజీనామాపై సంతకం చేస్తానని జగదీశ్ పట్టుపడతాడు. దాంతో రవిశంకర్ ఆలోచనలో పడతాడు.
పారిపోవడం చాలామంది చేసేదే .. పోరాడటం మాత్రం కొందరికే చేతనవుతుంది. నలుగురికి ఉపయోగపడటం కోసం కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవాలి. ఎవరినైనా భయపెట్టే ఆయుధం నిజాయితీ మాత్రమే. అది ఉన్నవారిని విజయం వెతుక్కుంటూ వస్తుంది అంటూ గతంలో తండ్రి చెప్పిన మాటలు రవిశంకర్ కి గుర్తుకు వస్తాయి. దాంతో అతను 'పారుల్' కేసును సీరియస్ గా తీసుకుంటాడు. పారుల్ కి గల పరిచయాలు .. స్నేహాలు ... శత్రువులను గురించి ఆరా తీయడం మొదలుపెడతాడు. ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడం .. ఆమె ఫోన్ పాస్ వర్డ్ తెలియక పోవడం రవిశంకర్ ను ఇబ్బంది పెడుతుంది.
పారుల్ తల్లిదండ్రులు కూడా ఈ కేసు విచారణలో రవిశంకర్ కి సహకరించరు. అయినా రవిశంకర్ కొన్ని క్లూస్ ఆధారంగా ఈ కేసులో ముందుకు వెళతాడు. అప్పుడు మృదుల్ .. మనవ్ .. ఆసిఫ్ పేర్లు తెరపైకి వస్తాయి. ఈ ముగ్గురూ ఎవరూ? పారుల్ తో వీరికి ఉన్న సంబంధం ఏమిటి? వాళ్ల ద్వారా రవిశంకర్ కి తెలిసే నిజాలేమిటి? అసలు ఆమెపై యాసిడ్ దాడి చేసినదెవరు? వంటి ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.
సాధారణంగా పోలీస్ డ్రామాలో హీరోను చాలా పవర్ఫుల్ గా చూపిస్తూ ఉంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ను ఒక రేంజ్ లో చాలా యాక్టివ్ గా నడుస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. చాలా అరుదుగా .. పోలీస్ పాత్రను కాస్త అమాయకత్వంతో డిజైన్ చేసిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. అలా కాకుండా పోలీస్ జాబ్ చేయడం ఇష్టం లేని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా వ్యవహరిస్తాడు? మొదట్లో కాస్త బెరుకుగా వెనకడుగు వేసిన అతను, తన తండ్రి మాటలు గుర్తొచ్చి ఎలా ముందుకు వెళ్లాడనేది డైరెక్టర్ చూపించిన విధానం బాగుంది.
ఇందులో కథానాయకుడు తండ్రిని కోల్పోతాడు. పెళ్లి చేసుకోమని తల్లి ఒత్తిడి చేస్తూ ఉంటుంది. తన అక్కయ్య తన ఇష్టంతో పనిలేకుండా పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం అతణ్ణి బాధిస్తుంది. పెళ్లి చూపుల నిమిత్తం తనకి ఫోటో పంపించిన అమ్మాయి యాసిడ్ దాడికి గురవుతుంది. ఇక అనుక్షణం తనని ఎద్దేవా చేస్తూ మాట్లాడే పై అధికారి ఒక వైపు. ఇలా హీరో పాత్ర అన్ని వైపులా నుంచి అల్లుకుపోయిన అసహనంతో కనిపిస్తున్నట్టుగా ఆ పాత్రను చూపించారు.
ఒక సాధారణమైన పోలీస్ ఆఫీసర్ గా రవిశంకర్ ను చూపిస్తూ, ఆ తరువాత అతని పాత్ర వైపు నుంచి హీరోయిజాన్ని పెంచుతూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. రవిశంకర్ ను ఇబ్బందిపెట్టే ఆఫీసర్ జగదీశ్ పాత్ర .. రవిశంకర్ కి సాయపడే ఆఫీసర్ యాదవ్ పాత్ర కూడా కనెక్ట్ అవుతాయి. అలాగే యాసిడ్ దాడి కేసు విషయంలో నేరస్థులు ఎవరనేది తేల్చే విచారణ, సినిమా ఫక్కీలో హడావిడిగా కాకుండా, చాలా నేచురల్ గా జరుగుతూ వెళుతుంది.
ఈ కథ అంతా కూడా విజయ్ వర్మ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఒక కొడుకుగా .. అన్నగా .. ప్రేమికుడిగా .. స్నేహితుడిగా .. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా .. ముఖ్యంగా మానవత్వం కలిగిన అధికారిగా ఆయన తన పాత్రకి జీవం పోశాడు. మిగతా పాత్రధారులంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కథకి .. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ఈ వెబ్ సిరీస్ ను మరింత కనెక్ట్ చేస్తాయి. సుమిత్ సక్సేనా కథ .. చిత్రీకరణ, అరుణాభ్ కుమార్ - కరణ్ సింగ్ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉన్నాయి. రాఘవ్ అరుణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. కోణార్క్ సక్సేనా ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది.
వేశ్యల జీవితాలను దగ్గరగా చూసి బాధపడిన ఒక పోలీస్ ఆఫీసర్ .. కూతురు గురించి ఓ తండ్రి నొచ్చుకునేలా మాట్లాడలేకపోయిన పోలీస్ ఆఫీసర్ .. తనలోని మంచితనాన్ని అసమర్థతగా భావించి పై అధికారులు ఎద్దేవా చేస్తుంటే భరించిన పోలీస్ ఆఫీసర్ .. అవతలివారి దారిలోకి వెళ్లకుండానే .. తనదైన నిజాయితీని వదులుకోకుండానే ఎలా ముందుకు వెళ్లాడనేది ఈ వెబ్ సిరీస్ కథ. సహజత్వానికి పెద్దపీట వేసిన ఈ వెబ్ సిరీస్ మొదటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తూ వెళుతుంది.
'కాల్ కూట్' - (జియో) వెబ్ సిరీస్ రివ్యూ
| Reviews
KaalKoot Review
- విజయ్ వర్మ ప్రధానమైన పాత్రగా 'కాల్ కూట్'
- యాసిడ్ దాడి నేపథ్యంలో సాగే కథ
- సహజత్వంతో నడిచే పోలీస్ డ్రామా
- హీరో కేరక్టర్ ను డిజైన్ చేసిన తీరు హైలైట్
Movie Name: KaalKoot
Release Date: 2023-07-27
Cast: Vijay Varma, Swetha, Yashpal Sharma, Suzanna Mukharjee, Seema Biswas, Gopal Dutt, Enab Khizra
Director: Sunith Saxena
Music: Raghav Arun
Banner: A Leo Media Collective Production
Review By: Peddinti
KaalKoot Rating: 3.00 out of 5
Trailer