'హాస్టల్ డేస్' - (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Hostel Days

Hostel Days Review

  • తెలుగు వెబ్ సిరీస్ గా 'హాస్టల్ డేస్'
  • సీజన్ 1లో భాగంగా వదిలిన 5 ఎపిసోడ్స్
  • లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవం
  • ఏ అంశం కూడా పట్టుగా సాగకపోవడం 
  • ఎంటర్టయిన్ మెంట్ లోపించడం  

కాలేజ్ నేపథ్యంలో చాలా సినిమాలు .. వెబ్ సిరీస్ లు వచ్చాయి. కాలేజ్ క్యాంపస్ .. హాస్టల్ లైఫ్ కి సంబంధించిన కంటెంట్ అనగానే, ఈ జనరేషన్ కుర్రాళ్లు వెంటనే కనెక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లిన తరువాత అక్కడి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతూ ఉంటుంది. రకరకాల ఫ్యామిలీ వాతావరణాలలో పెరిగినవాళ్లు ఒక్కసారిగా అక్కడ ఇమడటం కష్టం. ఒకరి ధోరణి ఒకరికి వింతగా .. విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక కంటెంట్ తో రూపొందిన 'హాస్టల్ డేస్' ఈ రోజునే 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అయింది. 

కథలోకి వెళితే .. కావ్య .. రితిక .. మోనిక .. సాయిరామ్ .. చిత్తరంజన్ .. నవీన్ యాదవ్ .. వీళ్లంతా కూడా కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరతారు. తమకి కేటాయించిన హాస్టల్ రూమ్స్ లోకి అడుగుపెడతారు. ఆ హాస్టల్ లో అందరికంటే సీనియర్ జయపాల్ .. అందువలన అందరినీ భయపెడుతూ బ్రతికేస్తూ ఉంటాడు. తాగడం .. ఫోర్ను వీడియోలు చూడటం తప్ప అతనికి మరొక పనుండదు. చిత్తరంజన్ కి చదువుపై తప్ప, మరి దేనిపైనా ధ్యాస ఉండదు. ఎప్పుడు చూసినా పుస్తకం ముందేసుకుని కూర్చుంటాడు. 

ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే, అతనికి ఆటలపై ఉన్న శ్రద్ధ చదువుపై ఉండదు. సాధ్యమైనంతవరకూ అమ్మాయిలకు దూరంగా ఉండాలనేది అతని కాన్సెప్టు. సాయిరామ్ కి మాత్రం హాస్టల్ వాతావరణం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఇక 'కావ్య' విషయానికి వస్తే, అప్పటివరకూ ఇంట్లో కండిషన్స్ మధ్య పెరిగిన తనకి, ఇక స్వేఛ్ఛ అవసరమని భావిస్తూ ఉంటుంది. 'రితిక' మాత్రం తన తండ్రితో చెప్పకుండా ఏ పని చేయని ఫ్యామిలీ నుంచి వస్తుంది. 

ఇలా ఎవరి స్వభావం వారిది .. ఎవరి గోల వాళ్లది అన్నట్టుగానే రోజులు గడిచిపోతుంటాయి. అయితే అదుపు ఆజ్ఞలలో పెరిగిన కావ్య .. అమాయకంగా కనిపించే సాయిరామ్ అందరికంటే ముందుగా లవ్ లో పడతారు. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ..  ఏకాంతంగా కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో సాయిరామ్ ఫ్రెండ్స్ అంతా కూడా అతనిని ఆటపట్టిస్తూ ఉంటారు. ఇక మొదట్లో కావ్య ప్రవర్తనని తప్పుగా భావించిన రితిక, నిదానంగా ఆమె దార్లోకి వచ్చేస్తుంది.

ఒకసారి సాయిరామ్ బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్ అంతా కలిసి అతనితో 'కేక్' కట్ చేయించడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. కావ్యను కలుసుకోవడానికి వెళ్లిన సాయిరామ్ కోసం వాళ్లంతా వెయిట్ చేస్తుంటారు. అంతలో రితిక - సాయిరామ్ సెల్ఫీ ఒకటి వాళ్లందరికీ షేర్ అవుతుంది. ఆ సెల్ఫీ చూసి వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తరువాత వాళ్లు ఏం చేస్తారు? కావ్య - సాయిరామ్ ప్రేమ ఫలిస్తుందా? బాగా చదువుకునే చిత్తరంజన్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? నవీన్ యాదవ్ లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? అందరినీ బెదిరించే జైపాల్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ. 

దర్శకుడు ఆదిత్య మండల ఎక్కువగా కొత్త ఫేస్ లతో ఈ కథను నడిపించాడు. టైటిల్ కి తగినట్టుగా కథ అంతా కూడా హాస్టల్ చుట్టూనే నడుస్తుంది. కాలేజ్ ను పెద్దగా టచ్ చేయకుండా ఆడిటోరియం .. క్యాంటీన్ .. స్టేషనరీ షాప్ ను కవర్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ లో మంచి స్పీడ్ ఉంటుంది. స్టూడెంట్స్ పాత్రల మధ్య అల్లర్లు .. అలకలు మాత్రమే కాదు, లవ్ - ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, ఫ్యామిలీ నేపథ్యంతో ముడిపడిన ఎమోషన్స్ కూడా ఉంటాయి.

ఈ టైటిల్ ను బట్టి ఈ కథ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని అంతా అనుకుంటారు. అలా అనుకున్నవారికి దగ్గరగా దర్శకుడు ఈ కంటెంట్ ను తీసుకుని వెళ్లలేకపోయాడు. అటు అబ్బాయిల వైపు నుంచి .. ఇటు అమ్మాయిల వైపు నుంచి ఈ కథను నడిపించాడుగానీ, ఆయన టచ్ చేసిన పాత్రల పరిధి చాలా తక్కువ. ఇటు ఫ్రెండ్షిప్ వైపు నుంచి గానీ .. అటు లవ్ వైపు నుంచి గానీ మనసును టచ్ చేసే సీన్స్ ను రాసుకోలేకపోయాడు. 

అంత పెద్ద హాస్టల్ లో కేవలం కావ్య - సాయిరామ్ పాత్రల మధ్యనే లవ్ సీన్స్ రాసుకున్నారు. అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 5 ఎపిసోడ్స్ లో పోను పోను వీరి ప్రేమ ముదిరి పాకాన పడుతుందని అనుకుంటే, మధ్యలోనే వాళ్లని వదిలేసి, ఎగ్జామ్స్ సమయంలో స్టూడెంట్స్ పడే టెన్షన్ కి సంబంధించిన కామెడీని వర్కౌట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సీన్స్ పండకపోగా, ఉన్న సమయమంతా ఆ తతంగానికే సరిపోయింది. 

ఆర్టిస్టులు చాలామంది కొత్తవారే అయినా బాగానే చేశారు. ఇక ప్యూన్ గా రఘు కారుమంచి .. వాచ్ మెన్ గా తాగుబోతు రమేశ్ .. స్టేషనరీ నడుపుకునే ఝాన్సీ .. రాజీవ్ కనకాల అతిథి పాత్రలలో మెరుస్తారు. 'ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఇంతే .. వాళ్ల తీరు మారదు' అంటూనే సపోర్టు చేస్తుంటారు. అనుభవంతో వాళ్లు చెప్పిన మాటలు అటు కామెడీగా చూసుకున్నా .. ఇటు సీరియస్ గా పట్టించుకున్నా అంతగా ఆకట్టుకోవు. కాస్త సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారనుకోవడానికి తప్ప, వాళ్ల పాత్రల వలన ఎలాంటి ప్రయోజనం కనిపించదు.

'పేరెంట్స్ పై ఆధారపడుతూ వాళ్లు మాటలు వినడమూ కరెక్టుకాదు .. అలాగని పేరెంట్స్ మాటలను పక్కన పెట్టేయడమూ కరెక్టు కాదు .. ఇంజనీరింగ్ కి వచ్చాము గనుక, ఏది కరెక్టు అనేది మనమే ఆలోచన చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి' అనే ఒక అభిప్రాయాన్ని కొంతమంది  స్టూడెంట్స్ వ్యక్తం చేయడమనేది ఒక చిన్నపాటి సందేశంగానే తీసుకోవచ్చు. 5 ఎపిసోడ్స్ మొత్తంగా తీసుకుంటే, ఏ విషయాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురాకుండా మధ్యలో వదిలేసినట్టుగా అనిపించి అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ జనరేషన్ కుర్రాళ్లకి కొన్ని సీన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 

ప్లస్ పాయింట్స్:  ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
మైనస్ పాయింట్స్: ఏ అంశాన్ని కూడా పూర్తిస్థాయిలో ఆవిష్కరించకపోవడం 

Movie Name: Hostel Days

Release Date: 2023-07-13
Cast: Darahas, Aishwarya, Akshay, Jayetri, Ananya, Mouli Tanuj, Jhansi, Harsha, Rajeev Kanakala
Director: Adithya Mandala
Music: Sidhartha Sadasivuni
Banner: TVF Creation

Hostel Days Rating: 2.50 out of 5

Trailer

More Reviews