రాజమౌళి ఫ్యామిలీ నుంచి సింహ కోడూరి హీరోగా వచ్చాడు. తన రేంజ్ కి తగిన బడ్జెట్ లోనే యూత్ ను మెప్పించడమే ప్రధానంగా పెట్టుకుని ముందుకెళుతున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన 'మత్తువదలరా' .. 'తెల్లవారితే గురువారం' .. 'దొంగలున్నారు జాగ్రత్త' ఓ మాదిరిగా ఆడాయంతే. నటన పరంగా కూడా ఆయనకి ప్రత్యేమైన మార్కులేమీ పడలేదు. ఆయన తాజా చిత్రంగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు 'భాగ్ సాలే' వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
అర్జున్ (సింహా) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఓ హోటల్లో చెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఏడాదిలోగా సొంతంగా ఒక రెస్టారెంట్ ను పెట్టుకోవాలనేది ఆయన డ్రీమ్. ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుని, ఆ డబ్బుతో తన డ్రీమ్ నెరవేర్చుకుంటానని పేరెంట్స్ తో చెబుతాడు. అందుకు 'రాయల్' మూర్తి (రాజీవ్ కనకాల) దంపతులు ఎంతమాత్రం ఒప్పుకోరు. దాంతో అర్జున్ ఏం చేయాలా అనే ఆలోచనలో పడతాడు.
మరో వైపున 'మాయా' (నేహా సోలంకి) అర్జున్ ను లవ్ చేస్తూ ఉంటుంది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తండ్రి శ్రీమంతుడు కావడంతో, తాను కూడా బాగా డబ్బున్నవాడిగా అర్జున్ ఆమెను నమ్మిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు కార్లు .. ఖరీదైన సూట్లతో మేనేజ్ చేస్తుంటాడు. అర్జున్ ను తన తండ్రికి పరిచయం చేసిన మాయా, ఇక తన పెళ్లి అతనితోనే ఫిక్స్ అనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి మధ్యలోకి శామ్యూల్ (జాన్ విజయ్) అనే విలన్ ఎంటరవుతాడు.
చాలా కాలం క్రితం ఒక రైతుకు వజ్రం దొరుకుతుంది .. అతను దానిని ఒక సేఠ్ కి అమ్ముతాడు. కోహినూర్ తో పాటు అత్యంత విలువైన ఐదు వజ్రాలలో అది ఒకటి, బ్రిటీష్ వారి కాలంలో అది వారి చేతుల్లోకి వెళుతుంది. అక్కడి నుంచి ఫ్రెంచ్ అధికారులు .. ఆ తరువాత నిజాం నవాబుల చేతికి మారుతుంది. ఆ వజ్రంలో ఒక భాగాన్ని ఉంగరంగా చేయించుకుని నవాబులు వాడటం జరిగింది. ఇప్పుడు ఆ ఉంగరం ఖరీదు 25 కోట్లు.
ఆ ఉంగరం మాయా తండ్రి దగ్గర ఉందని తెలిసిన శామ్యూల్, అతణ్ణి తన బంగ్లాలో బంధిస్తాడు. ఆ ఉంగరాన్ని శామ్యూల్ కు ఇచ్చేసి, తన తండ్రిని క్షేమంగా తీసుకురమ్మని అర్జున్ ను మాయా కోరుతుంది. ఆ డైమండ్ రింగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అది తీసుకురావడానికి అర్జున్ ఏం చేస్తాడు? విలన్ గ్యాంగ్ ద్వారా ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? తాను శ్రీమంతుడిని కాననే నిజాన్ని మాయాకి అర్జున్ చెబుతాడా? అనేవి ఆసక్తికరమైన అంశాలు.
ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తక్కువ బడ్జెట్ లోనే ఆయన ఈ కంటెంట్ ను సెట్ చేసుకున్నాడు. పాటల పరంగా .. యాక్షన్ పరంగా కూడా పెద్దగా ఖర్చు జోలికి వెళ్లలేదు. ఉన్న వనరులతోనే సర్దుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాగని చెప్పి క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు కూడా. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకుండా, ఖర్చును కాకుండా కథను .. పాత్రలను పరుగులు పెట్టించడానికి ప్రయత్నించాడు.
నిజామ్ నుంచి చేతులు మారిన ఒక డైమండ్ రింగ్ ను దక్కించుకోవడం కోసం ఇటు హీరో .. హీరోయిన్, అటు విలన్ గ్యాంగ్ చేసే పోరాటమే ఈ కథ. అయితే బ్రిటీష్ .. ఫ్రెంచ్ అంటూ వాయిస్ ఓవర్లో ఉంగరం గురించి ఇచ్చిన ఉపోద్ఘాతమే ప్రేక్షకులను కొంత అయోమయానికి గురిచేస్తుంది. ఇక ఇక్కడ ఆ ఉంగరాన్ని దక్కించుకోవడానికి ఇటు హీరో .. అటు విలన్ చేసే ప్రయత్నాలే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాలి. వాళ్లను నాన్ స్టాప్ గా నవ్వించాలి. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు.
ఉంగరాన్ని దక్కించుకోవడమే ప్రధానమైన సమస్యగా పరిగెత్తిస్తే కథపై కాస్త పట్టు దొరికేది. అలా కాకుండా తాను బాగా డబ్బున్నవాడినంటూ హీరోయిన్ దగ్గర హీరో ఆడిన అబద్ధం .. ఆమె కోసం తన ఇంటి కాగితాలను సేఠ్ దగ్గర తాకట్టు పెట్టడం వంటి సమస్యలను కూడా కలిపి నడిపించారు. అయితే ఏ ట్రాక్ లోను పస లేకపోవడమే ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. అనవసరమైన పాత్రలతో సిల్లీ కామెడీ చేయిస్తూ నీరుగారుస్తుంది.
దర్శకుడు అవసరమైన దానికంటే ఎక్కువ లీడ్ తీసుకోవడం .. ప్రతి డైలాగ్ పేలాలనే ఉద్దేశంతో రాసుకున్న డైలాగులు .. ఆయా ట్రాకులకు ఫినిషింగ్ టచ్ ఇవ్వవలసిన చోటును దాటేసి ముందుకు వెళ్లడం కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. ఇక నళిని అనే పాత్ర కిడ్నాప్ సీన్ ఒక పెద్ద తతంగం. అదంతా నాటకీయంగా .. అనుభవం లేని తననానికి నిదర్శనంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరి పాత్రకి ఎలాంటి ప్రత్యేకత .. ప్రాధాన్యత లేకుండా ముగుస్తుంది.
కామెడీ చేయడం అంత ఈజీ కాదు. అలాగే కామెడీ టచ్ తో కూడిన సినిమాలను తెరకెక్కించడం కూడా ఈజీ కాదు. అందుకు అనుభవం ఉండాలి .. లేదంటే ఒక రేంజ్ లో కసరత్తు జరగాలి. అలాంటి ఒక కసరత్తు జరగలేదనేది సినిమా చూస్తుంటేనే అర్థమైపోతుంది. సింహా హీరో కటౌట్ ఉన్నవాడే .. కాకపోతే నటన పరంగా ఆయన ఇంకా సాధన చేయవలసి ఉంది. నేహా సోలంకి చేయడానికేమీ లేదు .. ఉంటే ఎలా చేసేదోమరి. జాన్ విజయ్ కామెడీ టచ్ తో కూడిన విలనిజం .. వైవా హర్ష కామెడీ కాస్త అతిగా అనిపిస్తాయి. కాలభైరవ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి తనవంతు కష్టపడ్డాడు. రమేశ్ రెడ్డి ఫొటోగ్రఫీ .. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే.
బంగారమో .. వజ్రమో .. ఇంతకుముందు ఇలాంటి వాటిని దక్కించుకోవడానికి టీమ్స్ వారీగా పోటీపడే సినిమాలు చాలానే వచ్చాయి. ఒకరి నుంచి ఒకరికి ఆ వస్తువు చేతులు మారడమనే విషయం ఆసక్తిని రేకెత్తించేది. హాయిగా నవ్వించేది. అలాంటిదేమీ లేకుండా తెరపై సిల్లీ కామెడీతో హడావిడి చేసిన సినిమాగా 'భాగ్ సాలే' కనిపిస్తుంది.
'భాగ్ సాలే' - మూవీ రివ్యూ
| Reviews
Bhaag Saale Review
- శ్రీ సింహా నుంచి వచ్చిన 'భాగ్ సాలే'
- డైమండ్ రింగ్ చుట్టూ తిరిగే కథ
- సిల్లీ కామెడీని నడిపించిన దర్శకుడు
- ఎక్కడా కూడా కనెక్ట్ కాని సన్నివేశాలు
- శ్రీసింహా కామెడీ పరంగా కసరత్తు చేయవలసిందే
Movie Name: Bhaag Saale
Release Date: 2023-07-07
Cast: Sri Simha, Neha Solanki, John Vijay, Rajeev Kanakala, Nandini Rai, Sathya, Harsha, Sudarshan
Director: Praneeth Bramandapall
Music: Kaala Bhairava
Banner: Vedaansh Creative Works
Review By: Peddinti
Bhaag Saale Rating: 2.50 out of 5
Trailer