'గుడ్ నైట్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ

Good Night

Good Night Review

  • తమిళంలో రూపొందిన 'గుడ్ నైట్'
  • హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్ 
  • ఈ నెల 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • కుటుంబ సమేతంగా చూడదగిన కంటెంట్ 
  • సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు 

ప్రతి మనిషిలోను ఏదో ఒక బలహీనత ఉంటుంది .. వారికే తెలియని ఒక లోపం ఉంటుంది .. అంత తేలికగా పరిష్కారం దొరకని సమస్య ఉంటుంది. ఇలాంటివాటితో ఇతరులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ భార్యాభర్తల్లో ఏ ఒక్కరికీ సమస్య ఉన్నా, సహించేవారు .. సర్దుకుపోయేవారు చాలా తక్కువ. అలాంటి ఒక సమస్య చుట్టూ అల్లుకున్న కథనే 'గుడ్ నైట్'.  ఈ ఏడాది మే 12వ తేదీన తమిళనాట థియేటర్లకు వచ్చిన  ఈ సినిమా, జులై 3వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథలోకి అడుగుపెడితే ... మోహన్ (మణికందన్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతను ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ చేస్తుంటాడు. తండ్రిలేని ఆ కుటుంబానికి అతనే పెద్ద దిక్కు. తల్లి .. అక్క 'మహా' ... చెల్లెలు 'రాఘవి' ఇది అతని కుటుంబం. రమేశ్ (రమేశ్ తిలక్) అనే యువకుడితో మహా పెళ్లి జరిపిస్తాడు మోహన్. అయితే మహాకి సంతానం లేకపోవడం వలన అత్తింటివారు ఆమెను వేధిస్తూ ఉంటారు. భర్త రమేశ్ మాత్రం ఆమెను బాగానే చూసుకుంటూ ఉంటాడు. 

ఇక అనూ (మీతా రఘునాథ్) అనే యువతి మూడేళ్ల క్రితం తండ్రిని .. కొంతకాలం క్రితం తల్లిని కోల్పోతుంది. ఒక సంస్థలో జాబ్ చేస్తూ, సింగిల్ రూమ్ లో రెంట్ కి ఉంటుంది. ఆ ఓనర్ దంపతులు ఆమెను తమ కూతురు మాదిరిగానే చూసుకుంటూ ఉంటారు. అనూ ఒక కుక్కపిల్లను చేరదీస్తుంది. ఆ కుక్కపిల్ల వల్లనే మోహన్ - అనూ మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే ప్రేమగా మారుతుంది. మోహన్ తో అనూ పెళ్లికి ఆమె ఇంటి ఓనర్స్ ఒప్పుకుంటారు. ఓ శుభముహూర్తాన వారి పెళ్లి జరిగిపోతుంది. 

అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. మోహన్ కి గురకపెట్టే అలవాటు ఎక్కువ. అతనితో లవ్ లో పడిన అమ్మాయిలు కూడా, అతని గురక చప్పుడు భరించలేక బై చెప్పేస్తారు. కాలేజ్ లోనే కాదు .. ఆఫీస్ లోను అందరూ వెక్కిరిస్తూ ఉంటారు. 'మోటార్ మోహన్' అని పిలుస్తూ గేలి చేస్తుంటారు. పెళ్లి అయితే తన గురక కారణంగా భార్య విడాకులిచ్చి వెళ్లిపోతుందేమోనని అతని భయం. అందువలన ఆ రహస్యాన్ని దాచిపెట్టి అనూను పెళ్లి చేసుకుంటాడు.

తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరుగుతూ వచ్చిన అనూ, ఎన్నో ఆశలతో .. కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. తన వెంట తిరుగుతూ ఉండే కుక్కపిల్లను కూడా కొత్త ఇంటికి  తెచ్చుకుంటుంది. తన పట్ల ప్రేమానురాగాలు చూపించే భర్త దొరికినందుకు మురిసిపోతుంది. నిద్రపోతే గురకపెడతానేమోననే భయంతో,  మెలకువతో ఉండటానికి ట్రై చేస్తూనే నిద్రలోకి జారుకుంటాడు మోహన్. ఆ తరువాత ఏం జరుగుతుంది? కథ ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది? అనేది మిగతా కథ. 

ఓ అనాథ యువతి ... ఆమెకి సపోర్టుగా నిలిచే ఇంటి ఓనర్ దంపతులు .. తన గురక వలన తన వైవాహిక జీవితం నాశనమవుతుందేమోనని భయపడే ఒక మధ్యతరగతి యువకుడు. అతనికి సపోర్టుగా తల్లి .. ఒక అక్క .. బావ .. చెల్లి. కథ అంతా కూడా ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. వినాయక్ చంద్రశేఖరన్ ఈ పాత్రలను మలచిన విధానం .. ఆ పాత్రలను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో బలమైన కథ ఈ సినిమాలో మనకి దొరుకుతుంది. 

కొత్త దాంపత్యం .. అలకలు .. బుజ్జగింపులు .. ఒంటరితనాలు .. ఓదార్పులు .. ఇవన్నీ కూడా ఈ కథలో మనకి కనిపిస్తాయి. సహజత్వానికి దగ్గరగా నడిచే ఈ కథ, ప్రేక్షకులను కూడా పాత్రధారులను చేస్తూ .. తనలో కలుపుకుని తీసుకుని వెళుతుంది. రియల్ లొకేషన్స్ లో నడిచే ఈ కథ, మధ్యతరగతి కుటుంబాలకు మరింత త్వరగా కనెక్ట్ అవుతుంది. ఏ మాత్రం బోర్ కొట్టనీయని స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.

హీరో - హీరోయిన్ ఇద్దరూ కూడా తమ కుటుంబ సభ్యులను రమ్మని చెప్పి, తమ నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. కార్లో వస్తున్న ఆ కుటుంబ సభ్యులు, ఆ నిర్ణయాలకు తగినట్టుగా యూ టర్న్ లు తీసుకోవడం సరదాగా అనిపిస్తుంది. ఇక దారినపోయే ఒక కుక్కపిల్లను దర్శకుడు మనకి పరిచయం చేసినప్పుడు మనం పెద్దగా పట్టించుకోము.. కానీ ఆ కుక్కపిల్లను కూడా ఒక పాత్రగా చేస్తూ, ఆయా సందర్భాల్లో దాని ఎక్స్ ప్రెషన్స్ ను ఆయన తీసుకున్న తీరు హాయిగా నవ్విస్తుంది.

ఏ పాత్రకి మేకప్ వేయలేదు .. ఎక్కడా పరిసరాలను సినిమా కోసమని చెప్పి శుభ్రం చేయలేదు. సహజత్వం కోసం దర్శకుడు తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తూనే ఉంటుంది. మణికందన్ - మీతా రఘునాథ్ నటన చూస్తే, పాత్రలే తప్ప ఆర్టిస్టులు కనిపించరు. మిగతావారు కూడా అంతే .. పాత్రలో నుంచి బయటికి రాకుండా సహజత్వాన్ని తీసుకొచ్చారు. సీన్ రోల్డన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. జయంత్ సేతుమాధవన్ కెమెరా పనితనం .. భరత్ విక్రమన్ ఎడిటింగ్ బాగున్నాయి.   

'మనలను ఇష్టపడేవారే మన సమస్యలను అర్థం చేసుకుంటారు .. సర్దుకుపోతారు. అలాంటివారిని దూరం చేసుకోకూడదు. అపార్థమనేది అద్దం మీద దుమ్ము వంటిది .. అది తుడిచేస్తే జీవితం అందంగా కనిపిస్తుంది' అనే ఒక సందేశాన్నిస్తూ ఈ కథ నడుస్తుంది. ఎలాంటి హడావిడి .. ఆర్భాటం .. అసభ్యతకి తావు లేకుండా సాగే ఈ సినిమాను, ఇంటిల్లిపాది హాయిగా కలిసి చూడొచ్చు. 

కథ .. స్క్రీన్ ప్లే .. రియల్ లొకేషన్స్ .. సహజత్వం .. పాత్రలను మలిచిన విధానం .. హీరో - హీరోయిన్స్ నటన .. సున్నితమైన భావోద్వేగాల మధ్య ఇచ్చిన సందేశం ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తాయి. 

Movie Name: Good Night

Release Date: 2023-07-03
Cast: K. Manikandan, Meetha Raghunath, Ramesh Thilak, Balaji Sakthivel, Bagavathi Perumal
Director: Vinayak Chandraskharan
Music: Sean Roldan
Banner: Million Dollar Studios

Good Night Rating: 3.00 out of 5

Trailer

More Reviews