'ఏజెంట్' - మూవీ రివ్యూ

Agent

Agent Review

  • 'ఏజెంట్' గా వచ్చిన అఖిల్ 
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సినిమా
  • నిర్మాణ విలువలకు మంచి మార్కులు  
  • ఆకట్టుకోలేకపోయిన కథాకథనాలు 
  • సరిగ్గా డిజైన్ చేయని ప్రధానమైన పాత్రలు
  • నిరాశపరిచిన పాటలు

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి ' ఏజెంట్' సినిమాను రూపొందించాడు. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాతో, కథానాయికగా సాక్షి వైద్య పరిచయమైంది. సురేందర్ రెడ్డి సినిమాల్లో ఆయన మార్క్ యాక్షన్ ఉంటుంది. ఇక అఖిల్ కి కూడా యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమాలంటే ఇష్టం. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసి వదిలిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

రామకృష్ణ (అఖిల్)  ఓ మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన యువకుడు. 'రా'లో చేరాలనేది అతని కోరిక .. ఆ విషయం గురించే అతను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అదే పనిగా కలలు కంటూ ఉంటాడు. కూరగాయలు చూసినా అతనికి గన్స్ .. బుల్లెట్స్ లా కనిపిస్తూ ఉంటాయి. 'రా'లో చేరిపోయి ఒక రేంజ్ లో యాక్షన్ లో చెలరేగిపోవాలనేది తన కోరిక. అందుకోసం అతను వేసిన ఒక ప్లాన్ వర్కౌట్ అవుతుంది.  'రా' చీఫ్ మహాదేవ్ (మమ్ముట్టి) అతనికి ఒక ఆపరేషన్ అప్పగించేలా చేస్తుంది. 

ప్రపంచదేశాలలో తన అక్రమ వ్యాపారాలను విస్తరింపజేసే 'గాడ్' (డినో మోరియా)కి సంబంధించిన ఆపరేషన్ అది. ఒక సెంట్రల్ మినిస్టర్ ద్వారా అతను ఇక్కడ తన అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తూ ఉంటాడు. 'గాడ్' అక్రమాలకు చెక్ పెట్టడానికి సరైనవాడు రామకృష్ణ అని భావించిన మహాదేవ్, అతణ్ణి రంగంలోకి దింపుతాడు. అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడమే కాకుండా, అతను ప్రేమిస్తున్న వైద్యను వదిలేయాలని చెబుతాడు.

 అప్పటికే వైద్యను కొంతకాలంగా రామకృష్ణ ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతను లేకుండా బ్రతకలేని స్థితికి వస్తుంది. అలాంటి ప్రియురాలు ఒకవైపు. తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ వస్తున్న 'రా'లో అవకాశం మరో వైపు. అప్పుడు రామకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? ఎలాంటి అనూహ్యమైన మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది కథ. 

 హీరోను స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డికి మంచి పేరు ఉంది. యాక్షన్ సినిమాలపై తనదైన మార్క్ కనిపిస్తుంది. అలాంటి సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. సురేందర్ రెడ్డి సినిమాలో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ ఉంటాయి. పాత్రలను మలిచే విధానం బాగుంటుంది. అలాంటివే ఈ సినిమాలోనూ ఉండి ఉంటాయని భావించి ఈ సినిమాకి వెళ్లినవారికి నిరాశ  తప్పదు. 

అఖిల్ లుక్ ను .. ఆయన పాత్రను సురేందర్ రెడ్డి సరిగ్గా డిజైన్ చేయలేదు. ఆ పాత్రలో చూపించిన బాడీ లాంగ్వేజ్ అఖిల్ కి సెట్ కాలేదు. నిజం చెప్పాలంటే అఖిల్ వయసుకి మించిన పాత్ర ఇది. హీరోకు ఫ్యామిలీ ఉన్నా దానితో ఆయనకి పనిలేదు. హీరోయిన్ కి అసలు ఫ్యామిలీనే లేదు. 'నాసా'లో జాబ్ చేయాలనే స్థాయికి ఆమె ఎలా వచ్చిందనేది తెలియదు. పోనీ ఎక్కడ పెరిగితే మనకెందుకు హీరోతో ఉంటే అంతే చాలని అనుకుందామంటే, అసలు ఆమె కనిపించకుండానే కథ చాలా వరకూ నడుస్తుంది. 

ఇక ఆకతాయిగా .. అల్లరి పిల్లాడిలా 'రా'తో హీరో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. అతని విషయంలో 'రా' చీఫ్ గా మహాదేవ్ తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇక ఈ తరహా యాక్షన్ సినిమాల్లో శభాష్ అనిపించుకునే వరలక్ష్మి శరత్ కుమార్ ను, చిన్న రోల్ కి పరిమితం చేయడం మరింత అసంతృప్తిని కలిగించే విషయం. కథ ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి అప్పటికప్పుడు టేప్ తో అంటించి అక్కడి నుంచి మరికొంత ముందుకు తీసుకుని వెళుతున్నట్టుగా  ఉంటుంది. 

హీరో పాత్రను గానీ .. విలన్ పాత్రను గానీ ..  'రా' చీఫ్ పాత్రను గాని పర్ఫెక్ట్ గా మలచలేకపోయారు ..  స్క్రీన్ పై ఆవిష్కరించలేకపోయారు. ఈ మూడు పాత్రలు మినహా మిగతా పాత్రలన్నింటినీ డమ్మీ చేసి వదిలిపెట్టారు. హీరోయిన్ కి తెలంగాణ యాస అస్సలు నప్పలేదు. ఇలా నానా అవస్థలు పడుతూ ఆడియన్స్ ను క్లైమాక్స్ వరకూ తీసుకుని వెళ్లారు.  అప్పటికి కూడా ఇది సురేందర్ రెడ్డి సినిమానేనా? అఖిల్ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడు? అనే ఒక సందేహం మనసును తొలిచేస్తూనే ఉంటుంది. 

ఇక హిప్ హాప్ తమిళ సంగీతం విషయానికి వస్తే, కొన్ని బాణీలైతే చేశాడు. కానీ వీటిని పాటలంటారా? అనే డౌట్ రాకమానదు. ఈ పాట తెరపైకి ఎందుకు వచ్చింది? పాటలోని సాహిత్యాన్ని అర్థం చేసుకుందామనుకునేలోగా అయిపోతుంటుంది. రసూల్ ఎల్లోర్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ ను గొప్పగా చిత్రీకరించాడు. సన్నివేశాలను కాకుండా కథనే సాగదీస్తూ వెళ్లారు గనుక, ఎడిటర్ గా నవీన్ నూలి చేసేది కూడా ఏమీ లేదు. కథ తక్కువ .. తుపాకుల మోత ఎక్కువగా ఉన్న ఈ సినిమా, కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి జరుపుకునే దీపావళి పండుగలా అనిపిస్తుందంతే!

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. ఫొటోగ్రఫీ .. మమ్ముట్టి నటన 

మైనస్ పాయింట్స్: కొత్తదనం లేని కథ ... ఆసక్తికరంగా సాగని కథనం .. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయని తీరు .. ఆకట్టుకోలేకపోయిన పాటలు. 

Movie Name: Agent

Release Date: 2023-04-28
Cast: Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty, Dino Morea, Sampath Raj, Varalaxmi Sarathkumar
Director: Surendar Reddy
Music: Hiphop Tamizha
Banner: AK Entertainments

Agent Rating: 2.50 out of 5

Trailer

More Reviews