'మీటర్' - మూవీ రివ్యూ

Meter

Meter Review

  • మాస్ యాక్షన్ మూవీగా 'మీటర్' 
  • కథాకథనాల్లో కనిపించని వైవిధ్యం 
  • డిఫరెంట్ గా పాత్రలను డిజైన్ చేయలేకపోయిన దర్శకుడు 
  • హీరో - విలన్ మినహా ప్రాముఖ్యత లేని ఇతర పాత్రలు

కిరణ్ అబ్బవరం యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. వరుస సినిమాలు చేయడం ఒక విశేషమైతే, అవి పెద్ద బ్యానర్లలో చేయడం మరో విశేషం. మొదటి నుంచి కూడా తన సినిమాల్లో మాస్ అంశాలు ఉండేలా చూసుకుంటూ వస్తున్న కిరణ్, 'మీటర్' సినిమా పక్కా మాస్ యాక్షన్ సినిమా మాదిరిగానే ఉండేలా చూసుకున్నాడు. రమేశ్ కాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 2006లో 'రాజమహేంద్రవరం'లో మొదలవుతుంది. అర్జున్ కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన నిజాయతీ కారణంగా తరచూ బదిలీలు అవుతూ ఉంటాయి. పై అధికారులు .. రాజకీయనాయకులు తన తండ్రిని అవమానించడం చూస్తూ వచ్చిన అర్జున్, జీవితంలో పోలీస్ ఉద్యోగం మాత్రం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. అయితే తండ్రి మాత్రం తన కొడుకును తనకంటే పై స్థాయిలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. 

అర్జున్ పెద్దవాడవుతాడు .. పోలీస్ ఉద్యోగానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే, కొంచెంలో  మిస్సయింది అన్నట్టుగా తండ్రికి అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతుంటాడు. అదే సమయంలో తొలి చూపులోనే ఆయన అతుల్య రవి ప్రేమలో పడతాడు. అయితే తన అక్కయ్యకి ఎదురైన ఒక పరిస్థితి వలన, ఆమె పురుషులను ద్వేషిస్తూ ఉంటుంది. అలాంటి ఆమెను తన దారికి తెచ్చుకోవడానికి అర్జున నానా పాట్లు పడుతుంటాడు. 

మొత్తానికి అర్జున్ ఎస్.ఐ. పోస్ట్ కొడతాడు. తండ్రి బాధపడలేక అయిష్టంగానే ఆ ఉద్యోగంలో చేరిన ఆయన, సాధ్యమైనంత త్వరగా ఆ ఉద్యోగం మానేయాలని చూస్తుంటాడు. అందుకోసం ఆయన చేసే కొన్ని పనులు వికటించకపోగా, జనంలో మంచి పేరును తీసుకొస్తుంటాయి. అలా ఆయన చేసిన కొన్ని పనులు, హోమ్ మినిస్టర్ బైరెడ్డికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి. అర్జున్ ఉద్దేశం తెలుసుకున్న బైరెడ్డి, తాను చెప్పిన పని ఒకటి చేస్తే, ఆయనను ఆ ఉద్యోగంలో నుంచి తప్పిస్తానని చెబుతాడు. ఆ పని ఏమిటి? ఆ తరువాత అర్జున్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.

ఇది ఓ తండ్రి ఆశయానికీ .. తనయుడి ఆవేశానికి మధ్య నడిచే కథ. స్వార్థపరులైన రాజకీయనాయకులు .. అవినీతిపరులైన అధికారులు .. మధ్యతరగతి కుటుంబనికి చెందిన తండ్రీకొడుకుల జీవితాలతో ఎలా ఆడుకున్నారనేది కథ. ఈ సినిమాతోనే రమేశ్ కాదూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. కథ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. కాకపోతే ఆ పాయింటుకు ముందు .. వెనుక ఉత్కంఠభరితంగా చెప్పలేకపోయారు. 

ఫస్టాఫ్ విషయానికి వస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు వరకూ కూడా కథ సాదా సీదాగానే నడుస్తుంది. సెకండాఫ్ కాస్త ఊపందుకుని, ప్రీ క్లైమాక్స్ లో కొంత నాటకీయత నడిచి క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఈ మధ్యలో అతిగా అనిపించే సన్నివేశాలు .. అనవసరమైనవిగా అనిపించే సన్నివేశాలు లేకపోలేదు.
సాధ్యమైనన్ని తక్కువ పాత్రలతో దర్శకుడు ఈ కథను చెప్పాలనుకున్నాడు. హీరో .. అతని తండ్రి, హీరోయిన్ .. ఆమె తండ్రి, విలన్ అవినీతిలో పాలుపంచుకునే ఇద్దరు అవినీతి అధికారులు. హీరోకి తోడుగా కనిపించే సప్తగిరి. ఇవే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు. 

 కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే, తను డైలాగ్ చాలా బాగా చెబుతున్నాడు. బాడీ లాంగ్వేజ్ పరంగాను వంకబెట్టడానికి లేదు. కానీ కళ్లలో ఎక్స్ ప్రెషన్ పలికించడంలో చూస్తే వెనుకబడే ఉన్నాడు. ఇక ఇంతకుముందు సినిమాలతో పోల్చి చూస్తే, ఈ సినిమాలో తనకంటూ ఒక స్టైల్ సెట్ చేసుకోవడానికి ఆయన ట్రై చేయడం కనిపిస్తుంది. ఇక హీరోయిన్ ను ఎక్కువగా పాటలకే పరిమితం చేశారు. సప్తగిరిలోని కమెడియన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. 

అటు హీరో పాత్ర .. ఇటు విలన్ పాత్రపై మాత్రమే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ రెండు పాత్రలలో విలన్ ఆర్టిస్ట్ ముందు తేలిపోకుండా ఉండటానికి కిరణ్ బాగానే కష్టపడ్డాడని చెప్పాలి. ఒకానొక సమయంలో హీరో చెప్పిన ఒక మాటను విలన్  నమ్మేస్తాడు. సిల్లీగా నమ్మేస్తాడు. అక్కడ విలన్ పాత్రకి గల పవర్ పడిపోయింది. పోసాని .. వినయ్ వర్మ ఇద్దరూ కూడా మంచి ఆర్టిస్టులు. కాస్త డిఫరెంట్ గా వారి పాత్రలను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. 

ఈ సినిమాకి సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన బాణీల్లో 'చమ్మక్ చమ్మక్ పోరి' అనే పాట హుషారెత్తిస్తుంది. మిగతా పాటలు వచ్చాయంటే వచ్చాయి .. పోయాయంటే  పోయాయి అన్నట్టుగానే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది .. కథకి కొంతవరకూ బలంగా నిలిచింది. వెంకట్ ఫొటోగ్రఫీ .. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

ప్లస్ పాయింట్స్: కిరణ్ అబ్బవరం స్టైల్ .. విలన్ గా పవన్ యాక్టింగ్ .. సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్. 

మైనస్ పాయింట్స్: కథాకథనాలు .. పాత్రలను తీర్చిదిద్దిన విధానం .. ఉన్న పాయింటును ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించలేకపోయిన తీరు. ఈ కథను అన్ని  వైపుల నుంచి ఆసక్తికరంగా అల్లుకుంటూ రాకపోవడం వలన, కిరణ్ దీనిని హిట్టు వైపు లాక్కెళ్లడం కష్టమేనని చెప్పచ్చు.   

Movie Name: Meter

Release Date: 2023-04-07
Cast: Kiran Abbavaram, Athulya Ravi, Pavan, Posani, Vinay Varma, Sapthagiri
Director: Ramesh Kaduri
Music: Sai Karthik
Banner: Mythri - Clap

Meter Rating: 2.25 out of 5

Trailer

More Reviews