'గుణ 369' మూవీ రివ్యూ

03-08-2019 Sat 16:09
Movie Name: Guna 369
Release Date: 2019-08-02
Cast: kartikeya, Anagha, Adithya Menon, Manju Bhargavi, Naresh, Hema, Sivaji Raja, jabardasth Mahesh
Director: Arjun Jandyala
Producer: Anil kadiyala,Tirumal Reddy
Music: Chaitan Bharadwaj
Banner: Gnapika Entertainments, Sprint Films

మంచికిపోతే చెడు ఎదురైనప్పుడు .. ఎవరినైతే నమ్మామో వాళ్లే మోసం చేసినప్పుడు ఒక సాధారణ వ్యక్తి తెగిస్తాడు. తన మనసునే న్యాయస్థానంగా చేసుకుని తనే న్యాయమూర్తిగా మారిపోయి ఆ దుర్మార్గుల శిక్షకు తీర్పు రాస్తాడు. అలా తెగించిన ఒక గుణవంతుడైన ప్రేమికుడి కథే 'గుణ 369'. యూత్ నుంచి .. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫరవాలేదనిపించే సినిమా ఇది.

యూత్ లో ఇప్పుడు మంచి ఫాలోయింగ్ వున్న హీరోగా కార్తికేయ కనిపిస్తాడు. ఇంతకుముందు చేసిన 'హిప్పీ' పరాజయంపాలు కావడంతో, ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'గుణ 369' చేశాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కలగలిసిన ఈ కథకు ఆయన ఎంతవరకు న్యాయం చేశాడో, ఎన్ని మార్కులు కొట్టేశాడో ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 'ఒంగోలు'లో మొదలవుతుంది. ఆ ఊళ్లోని ఒక మధ్యతరగతి కుర్రాడిగా 'గుణ' (కార్తికేయ) కనిపిస్తాడు. ఎవరితో ఎలాంటి గొడవలు లేకుండా జీవితాన్ని అందంగా .. ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఆయన ఉంటాడు. బీటెక్ పూర్తిచేసి తన తల్లిదండ్రుల (నరేశ్ - హేమ) కలను నిజం చేయాలనే ప్రయత్నంలో ఆయనకి 'గీత' (అనఘ)తో పరిచయం అవుతుంది. తండ్రి (సాక్షి శివ) నిర్వహించే మొబైల్ షాప్ వ్యవహారాలు గీతనే చూస్తుంటుంది. తన స్నేహితుడైన భట్టూ (జబర్దస్త్ మహేశ్)తో కలిసి తిరిగే గుణ .. గీత ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని బలంగా  నిర్ణయించుకుంటాడు.

ఆ ఊళ్లో వాళ్లందరికీ గద్దలగుంట రాధ (ఆదిత్య మీనన్) అంటే హడల్. తన సెటిల్ మెంట్ల వ్యవహారంలో ఎవరు వేలుపెట్టినా వాళ్లను లేపేయడం ఆయనకి అలవాటు. అలాంటి ఆయన హత్యకు గురవడంతో, ఆ కేసులో 'గుణ' జైలుకెళతాడు. అయితే, అందుకు కారణం ఎవరు? జైలు నుంచి వచ్చిన గుణకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన మలుపులు మిగతా కథలో చోటుచేసుకుంటాయి.

దర్శకుడు అర్జున్ జంధ్యాలకి ఇదే తొలి సినిమా. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఈ కథను రాసుకున్నాడు. ఈ సినిమాతో ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఒక మంచి యువకుడిని పరిస్థితులు ఎలా మార్చేస్తాయి అనే నేపథ్యంతో తను రాసుకున్న కథకు కొంతవరకు మాత్రమే ఆయన న్యాయం చేయగలిగాడు. ఫస్టాఫ్ లో చాలా భాగం నాయికా నాయకుల ప్రేమకి సంబంధించిన సన్నివేశాలతోనే కాలక్షేపం చేయించాడు. ఆ సమయంలో రెండు మంచి పాటలు పడేలా చూసి, ప్రేక్షకులకు కొంత రిలీఫ్ ను ఇచ్చాడు. సెకండాఫ్ ను మాత్రం బలమైన ఎమోషన్స్ తో కాస్త పట్టుగానే నడిపించాడు. కాకపోతే కాస్త హింస ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది.

'గుణ' పాత్రలో కార్తికేయ బాగానే నటించాడు. పరిస్థితులకు తగినట్టుగా మారిపోయే ఈ పాత్రలో ఆయన మంచి నటనను కనబరిచాడు. తన కుటుంబం కోసం ఎంతకైనా తెగించే ఈ పాత్రలో బరువైన ఎమోషన్స్ ను పలికిస్తూ నటనలో పరిణతిని కనబరిచాడు. కథానాయికగా ఈ సినిమాతో పరిచయమైన 'అనఘ' కనుముక్కుతీరు బాగుంది. అయితే ఆమెను గ్లామరస్ హీరోయిన్ అని చెప్పలేం. పాత్ర పరిధిలో ఫరవాలేదనిపిస్తుంది. ఇక గద్దలగుంట రాధగా ఆదిత్య మీనన్ మెప్పించాడు. తన లుక్ తోను .. స్టైల్ తోను ఆ పాత్రని ఒక స్థాయిలో నిలబెట్టేశాడు. గద్దలగుంట రాధ తల్లి పాత్రలో మంజుభార్గవి .. నరేశ్ .. హేమ .. శివాజీరాజా ఓకే అనిపించారు. జబర్దస్త్ మహేశ్ పాత్ర ఒక దశలో కీలకమై నిలిచి కథను క్లైమాక్స్ దిశగా నడిపిస్తుంది. విభిన్నమైన ఈ పాత్రలో ఆయన వైవిధ్యభరితమైన నటనను కనబరిచాడు.

చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫస్టాఫ్ లో వచ్చే పాటల్లో 'ఉదయించే వేకువలోన' .. 'బుజ్జి బంగారం' పాటలు బాగున్నాయి. ఆయన అందించిన రీ రికార్డింగ్ ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుతూ తీసుకెళ్లింది. పై రెండు పాటలు కొరియోగ్రఫీకి కూడా మంచి మార్కులు తెచ్చిపెడతాయి. రామ్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫస్టాఫ్ లోని మూడు పాటలను ఆయన చాలా అందంగా చిత్రీకరించాడు. చక్కని లొకేషన్స్ ను తన కెమెరాలో బంధిస్తూ ఆహ్లాదాన్ని ఆవిష్కరించాడు. నాయికా నాయికలను కూడా మంచి అందంగా చూపించాడు. ఎడిటింగ్ విషయానికొస్తే ఫస్టాఫ్ లో మొబైల్ షాపు చుట్టూ తిరిగే సన్నివేశాలను కొంత ట్రిమ్ చేసి వుండాల్సింది. గుణ జైల్లో వున్నప్పుడు వచ్చే 'మనసుకి ఇది గరళం' అనే పాట సందర్భానికి అతకలేదు.  

దర్శకుడు అర్జున్ జంధ్యాలకి ఇది తొలి సినిమా కావడంతో, ఆ తడబాటు అక్కడక్కడా కనిపిస్తుంది. సాధారణంగా కార్తికేయ సినిమాల్లో రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఆయన యూత్ కి అలవాటు చేశాడు. ఆ రొమాన్సు పాళ్లు ఈ సినిమాలో కనిపించకపోవడం వాళ్లలో అసంతృప్తిని కలిగించే విషయం. కథలో బలమైన ప్రతినాయకుడిగా నిలబడతాడనుకున్న ఆదిత్య మీనన్ ను ఇంటర్వెల్ బ్యాంగ్ కి చంపించేయడం దర్శకుడు చేసిన పొరపాటుగా అనిపిస్తుంది. హంతకుల వెనక అంతకంటే బలమైన నాయకుడు వున్నాడా అంటే లేడు. భయంతో ఆకతాయిలు చేసిన హత్య అనేసరికి కథలో బలం తగ్గిపోయింది.

 ఆదిత్య మీనన్ హత్య తరువాత ప్రతీకారంతో రగిలిపోయే తల్లిగా మంజుభార్గవి పాత్రను మరింత పవర్ఫుల్ గా మలచలేకపోయారు. ఇంటర్వెల్ తరువాత 'అనఘ' ఇంటికి వెళ్లిన కార్తికేయకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది బలమైన ట్విస్ట్ అవుతుందని దర్శకుడు భావించి ఉంటాడు. కానీ అదీ ఒక రకంగా మైనస్సే అవుతుంది. ఇంటర్వెల్ తరువాత విలన్ .. హీరోయిన్ లేకుండా కథను నడిపించే సాహసాన్ని అర్జున్ జంధ్యాల చేశాడు. ఈ లోపాలు లేకపోతే ఈ కథ యూత్ ని .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకుని వుండేదేమో.      


More Articles
Advertisement
Telugu News
Prabhas Salar shoot in Singareni open cost area
సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'!
9 hours ago
Govt Green signal to increase seating capacity in theaters
థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
10 hours ago
Bony Kapoor fires on RRR team
'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ రగడ.. కస్సుమన్న బోనీకపూర్!
14 hours ago
Keerti Suresh to act in her fathers film
వాళ్ల నాన్న నిర్మిస్తున్న సినిమాలో కీర్తి సురేశ్!
18 hours ago
Samantha Best Memory in 2020
2020 బెస్ట్ మెమొరీ ఏంటని ప్రశ్నించగా... ఫోటో చూపించిన సమంత!
20 hours ago
Koratala Announces Acharya Teaser Date and Time
మెగా ఫ్యాన్స్ సస్పెన్స్ కు తెరదించిన కొరటాల శివ... టీజర్ విడుదల తేదీ ప్రకటన!
20 hours ago
Shruti Hassan opposite Prabhas in Salaar
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
23 hours ago
Vaishnav Tej Uppena film release date confirmed
తాజా మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' రిలీజ్ డేట్
1 day ago
Chiranjeevi conversation with Koratala Siva
ఏమయ్యా కొరటాలా... టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తావంటూ చిరంజీవి... రేపు ప్రకటన చేస్తాను సార్ అంటూ కొరటాల... ఆసక్తికర సంభాషణ
1 day ago
Soorari Pottru elected to contest in Oscars
ఆస్కార్ బరిలో సూర్య చిత్రం 'సూరారై పొట్రు'
1 day ago