క్రాంతి - మూవీ రివ్యూ

Kranthi

Kranthi Review

  • 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై 'క్రాంతి'
  • ఈ రోజునే స్ట్రీమింగ్ జరుపుకున్న సినిమా
  • బలహీనమైన కథాకథనాలు
  • పేలవమైన సన్నివేశాలు 
  • సినిమాస్థాయికి తగినట్టుగా లేని కంటెంట్

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కొత్త సినిమాలు .. వెబ్ సిరీస్ లు .. సాంగ్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ సందడి చేస్తున్నాయి. భారీ సినిమాలు .. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలతో పాటు, చిన్న సినిమాలను కూడా 'ఆహా' ఓటీటీ ద్వారా ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజున 'క్రాంతి' సినిమా 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. కొత్త ఆర్టిస్టులతో నిర్మితమైన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

ఈ కథ కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. రామ్ (రాకేందుమౌళి) సంధ్య (ఇనయా) ఇద్దరూ కూడా ఏడేళ్లుగా ప్రేమించుకుంటారు. పెళ్లికి పెద్దలను ఒప్పించాలని నిర్ణయించుకుంటారు. ఆ మరుసటి రోజునే సంధ్య హత్యకు గురవుతుంది. దాంతో రామ్ మానసికంగా దెబ్బతింటాడు. సంధ్యను గురించి ఆలోచన చేస్తూ, కాలం గడిపేస్తూ ఉంటాడు.

రామ్ కి ఒక చెల్లెలు ఉంటుంది .. ఆమె ఫ్రెండ్ రమ్య .. రామ్ ను అన్నయ్యగా భావిస్తూ ఉంటుంది. రాఖీ పండగ రోజున రాఖీ కడుతుంది. ఆ తరువాత ఆమె కిడ్నాప్ జరుగుతుంది. ఆడపిల్ల కష్టంలో ఉంటే ఆదుకోవాలని సంధ్య చెప్పిన మాట రామ్ కి గుర్తొస్తుంది. దాంతో రమ్య జాడ తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. అందుకోసం తన స్నేహితుల సాయం తీసుకుంటాడు. 

సంధ్యను హత్య చేసింది .. రమ్యను కిడ్నాప్ చేసింది ఒక్కరేననే విషయం రామ్ కి అర్థమవుతుంది. సంధ్యను హత్య చేసింది ఎవరు? రమ్యను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆ రహస్యాన్ని ఛేదించడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? ఆ సమయంలో ఆయనకి ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి? అనేదే కథ.

ఒక నగరంలో వరుస కిడ్నాప్ లు జరుగుతూ ఉండటం .. అందుకు కారణమైన వారిని పట్టుకోవటానికి హడావిడి జరగడం .. ఎవరూ ఊహించని వ్యక్తి వాటికీ పాల్పడుతున్నట్టుగా చివర్లో రివీల్ చేయడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి ఒక కథనే ఇది. కథాకథనాల్లో ఎక్కడా కూడా వైవిధ్యం అనేది కనిపించదు. 

ఇక ఈ తరహా కథల్లో హంతకుడు ఎవరైనా, ఒక వైపు నుంచి పోలీసుల హడావిడి .. మరో వైపు నుంచి కిల్లర్ వ్యూహాలు .. ఇంకో వైపు నుంచి హీరో తీసుకునే నిర్ణయాలు కథపై ఆసక్తిని పెంచుతూ వెళ్లాలి. కానీ ఈ కథలో ఈ మూడు విషయాలు లోపించాయి. ఇక అసలు హంతకుడు ఎవరు? ఏ సందర్భంలో ఆ పాత్రను రివీల్ చేయాలి? అనే ఒక కీలకమైన సమయం ఉంటుంది. అలాంటి టెన్షన్ పెట్టకుండానే సింపుల్ గా ఆ వ్యక్తిని చూపించారు.

ఇక ఒక దశకి వచ్చిన తరువాత కథ లేడీస్ తో ఉద్యమాలు చేయించడం .. అందుకు తగిన ప్లాన్ చేయడం వంటి నిర్ణయాలతో కథ ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. పోనీ క్లైమాక్స్ లోనైనా కాస్త కంగారు పెడతాడేమోనని అనుకుంటే, అక్కడ కూడా అంత రిస్క్ తీసుకోలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం .. ఎడిటింగ్ ఓ మాదిరిగానే అనిపిస్తాయి. కథాకథనాలు .. టేకింగ్ ఇలా ఎక్కడ చూసినా నిర్మాణ పరమైన విలువలేం కనిపించవు. అసలు సినిమాస్థాయి లేని ఈ కంటెంట్ ను 'ఆహా'వారు ఎలా అంగీకరించారు? అనే సందేహం రాకుండా మాత్రం ఉండదు. 

Movie Name: Kranthi

Release Date: 2023-03-03
Cast: Rakendumouli, Inaya, Sravani, Yamuna, Karthik
Director: Bheema Shankar
Music: Gnan Singh
Banner: Swathi Pictures

Kranthi Rating: 2.00 out of 5

Trailer

More Reviews