మొదటి నుంచి కూడా కల్యాణ్ రామ్ విభిన్నమైన కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఈ విషయంలో ఒక్కోసారి ఆశించిన ఫలితం అందకపోయినా ఆయన ధైర్యంగా ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన చేసిన మరో ప్రయోగమే 'అమిగోస్'. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం.
ఈ కథ హైదరాబాదులో మొదలవుతుంది. సిద్ధార్థ (కల్యాణ్ రామ్) శ్రీమంతుల అబ్బాయి. బిజినెస్ వ్యవహారాల్లో తన తండ్రికి సహకరిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు పెళ్లి మాటలు దాటవేస్తూ వచ్చిన ఆయన, తొలి చూపులోనే ఇషిక (ఆషిక రంగనాథ్) ప్రేమలో పడిపోతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన తల్లిదండ్రులతో చెప్పి, ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే కాబోయే భర్త విషయంలో ఆమెకి కొన్ని అభిప్రాయాలు ఉండటంతో, ఆలోచన చేస్తుంటుంది.
అదే సమయంలో .. ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే విషయం సిద్ధార్థకి తెలుస్తుంది. అలాంటివారిని కలపడానికి వేదికగా ఒక వెబ్ సైట్ కూడా ఉందని తెలుసుకుంటాడు. తనని పోలినవారు ఎవరైనా ఉన్నారేమో చూద్దామని సరదాగా ట్రై చేస్తాడు. దాంతో బెంగళూర్ కి చెందిన మంజునాథ్ (మరో కల్యాణ్ రామ్) కోల్ కతాకి చెందిన మైఖేల్ (మూడో కల్యాణ్ రామ్) సిద్ధార్థ్ కి టచ్ లోకి వస్తారు. ముగ్గురూ కూడా 'గోవా'లో కలుసుకుని సరదాగా పార్టీ చేసుకుంటారు.
ఆ తరువాత ఇషికను ముగ్గులోకి దింపడానికీ .. తనతో పెళ్లికి ఆమెతో ఓకే చెప్పించడానికి మంజునాథ్ - మైఖేల్ సాయం తీసుకుంటాడు సిద్ధార్థ్. ఇందుకుగాను వాళ్లిద్దరూ సిద్ధార్థతో పాటు హైదారాబాద్ వస్తారు. వాళ్ల హెల్ప్ వలన సిద్ధార్థ్ ప్లాన్ కొంతవరకూ సక్సెస్ అవుతుంది కూడా. ఇక హైదరాబాద్ నుంచి మైఖేల్ వెళ్లిపోవాలని అనుకుంటూ ఉండగా, అతనిని NIA ఆఫీసర్స్ అరెస్టు చేస్తారు. అయితే వాళ్ల అధీనంలో ఉన్నది మైఖేల్ కాదనీ .. అమాయకుడైన మంజునాథ్ అని సిద్ధార్థ్ కి తెలుస్తుంది.
మైఖేల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అతని కోసం వచ్చిన NIA ఆఫీసర్స్ కి మంజునాథ్ ఎలా పట్టుబడ్డాడు? మైఖేల్ టార్గెట్ మంజునాథ్ కాదనీ .. తానేనని తెలుసుకున్న సిద్ధార్థ్ ఏం చేస్తాడు? మైఖేల్ కారణంగా చిక్కుల్లో పడిన మంజునాథ్ ను రక్షించడానికీ .. మైఖేల్ బారి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి సిద్ధార్థ ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు? ఇలా కథ అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతుంది.
రాజేంద్ర రెడ్డికి దర్శకుడిగా ఇది ఫస్టు మూవీ. అయితే ఎక్కడా కూడా మెగాఫోన్ కి ఆయన కొత్త అనిపించదు. క్లైమాక్స్ కి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ సీన్ తో కథను మొదలుపెట్టి, మళ్లీ అక్కడికి తీసుకుని వచ్చే స్క్రీన్ ప్లే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ మధ్యలో కథ కూడా ఎక్కడా బోర్ కొట్టదు. తెరపై ఒకే సమయంలో ముగ్గురు కల్యాణ్ రామ్ లు సందడి చేస్తున్నా, వారి పాత్రల విషయంలో కన్ఫ్యూజన్ ఉండదు. లుక్స్ పరంగా హెవీగా కాకుండా చిన్నపాటి మార్పులతో మూడు పాత్రలను డిజైన్ చేశారు. డైలాగ్ డెలివరీ ద్వారా మూడు పాత్రల మధ్య తేడా తెలిసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ను సెట్ చేసిన తీరు, సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ నుంచి టెన్షన్ బిల్డప్ చేస్తూ వెళ్లి, క్లైమాక్స్ విషయంలోను ఆడియన్స్ సంతృప్తి చెందేలా చూసుకున్నాడు. కథలో కొత్త పాయింట్ ఉంది .. కథనంలో క్లారిటీ ఉంది. ప్రధానమైన మూడు పాత్రలను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే ముగ్గురు కల్యాణ్ రామ్ లు కథను .. తెరను ఆక్రమించడం వలన, సహజంగానే ఇతర పాత్రలకి ప్రాధాన్యత లేకుండా పోయింది.
జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సౌందరరాజన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. 'ఎన్నోరాత్రులొస్తాయిగానీ' పాట చిత్రీకరణ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ నీట్ గా ఉంది. మూడు పాత్రల్లోను వైవిధ్యం చూపించడానికి కల్యాణ్ రామ్ బాగానే కష్టపడ్డాడు. ఈ సినిమాలో హీరో ఆయనే .. విలనూ ఆయనే .. ఈ రెండు పాత్రల మధ్య నలిగిపోయే అమాయకత్వంతో కూడిన మూడో పాత్ర ఆయనే.
అయితే కల్యాణ్ రామ్ పోషించిన విలన్ పాత్రకి ఎక్కువ మార్కులు పడతాయి. ఇక ఈ సినిమాతోనే పరిచయమైన ఆషిక రంగనాథ్ అందంగా మెరిసింది. ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ ఆమెనే. ఇప్పుడున్న హీరోయిన్స్ కి ఆమె గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి 'అమిగోస్'లో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలు చేయడమనేది సాహసమనే చెప్పాలి.
అయితే కథలోను .. కథనంలోను .. పాత్రల రూపకల్పనలోను క్లారిటీ ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ఫైట్స్ .. హీరోయిన్ గ్లామర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి. కల్యాణ్ రామ్ చేసిన కొత్త ప్రయత్నం .. కొత్త ప్రయోగంగానే ఈ సినిమాను గురించి చెప్పాలి. అక్కడక్కడా లాజిక్కులు పక్కన పెట్టేస్తే, మంచి ఎంటర్టయిన్మెంట్ ను అందించే సినిమానే ఇది.
మూవీ రివ్యూ: 'అమిగోస్'
| Reviews
Amigos Review
- కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన 'అమిగోస్'
- కొత్త పాయింట్ తో వచ్చిన రాజేంద్ర రెడ్డి
- ఆసక్తికరంగా నడిచిన కథాకథనాలు
- జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ఫైట్స్ హైలైట్
- ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన ఆషిక రంగనాథ్
- ఇతర పాత్రలకి తగ్గిన ప్రాధాన్యం
Movie Name: Amigos
Release Date: 2023-02-10
Cast: Kalyan Ram, Ashika Ranganath, Brahmaji, Sapthagiri
Director: Rajendra Reddy
Music: Ghibran
Banner: Mythri Movie Makers
Review By: Peddinti
Amigos Rating: 3.00 out of 5
Trailer