రోజూ పొద్దునే కాసిన్ని తులసి ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా?

  • మనం ఎంతో పవిత్రంగా భావించే మొక్క తులసి
  • అందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్న నిపుణులు
  • నేరుగా నమిలిగానీ, టీ రూపంలోగానీ తీసుకుంటే మేలని సూచనలు
భారత సమాజంలో తులసి మొక్కలకు ఎంతో ప్రాధాన్యముంది. మనం ఎంతో పవిత్రంగా భావించి, ఇళ్ల ముందు పెంచే తులసి మొక్కల్లో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తులసిలో ఉండే పదార్థాలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు వ్యాధులను దూరం పెడతాయని స్పష్టం చేస్తున్నారు. తులసి ఆకులను నేరుగా నమిలి తినడంగానీ, ఎండబెట్టి పొడి చేసి టీ రూపంలో తీసుకోవడంగానీ చేయవచ్చని చెబుతున్నారు. రోజూ పొద్దున్నే కొన్ని తులసి ఆకులు తీసుకోవడం వల్ల ఎన్నో  ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు.

రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది 
రోజూ పొద్దున్నే కొన్ని తులసి ఆకులను తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ శరీరానికి అందుతాయి. అవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బ్యాక్టీరియా, వైరస్‌ లతో పోరాడే శక్తిని ఇస్తాయి.

కాలేయాన్ని శుభ్రపరుస్తుంది
తులసిలో ఉండే కొన్ని రసాయన పదార్థాలు శరీరం నుంచి విష పదార్థాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోయేందుకు తోడ్పడుతాయి. ముఖ్యంగా కాలేయాన్ని శుభ్రం చేస్తాయి. రోజూ పరగడపున తులసి ఆకులు తీసుకుంటే.. కాలేయం పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది.

ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గిస్తుంది..
తులసిలోని ‘అడాప్టోజెనిక్‌ కాంపౌండ్స్‌’గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అవి శరీరంలో ఒత్తిడిని తగ్గించి, యాంగ్జైటీని దూరం చేస్తాయి. పొద్దున్నే తులసిని తీసుకోవడం వల్ల మనలో మానసిక ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ప్రశాంతంగా ఉన్న భావన వస్తుంది.

జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు
తులసి మన శరీరంలో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైముల విడుదలను ప్రేరేపిస్తుంది. దీనిద్వారా ఆహారం బాగా జీర్ణమై, పోషకాలు శరీరానికి అందుతాయి. గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది
తులసిలోని యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస వ్యవస్థలో సమస్యలను దూరం చేస్తుంది. దగ్గు, ఆస్తమా, సైనస్‌, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రక్తంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రిస్తుంది
రోజూ ఉదయమే తులసి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సూలిన్‌ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనితో రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి దీనివల్ల మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది

శరీరంలో కొలెస్ట్రాల్‌, షుగర్‌ స్థాయులను నియంత్రించడం, రక్తపోటు తగ్గేందుకు తోడ్పడటం ద్వారా తులసి మన గుండె ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది.


More Telugu News