ఉక్రెయిన్‌పై మరోమారు క్షిపణిదాడికి సిద్ధమవుతున్న రష్యా

  • అమెరికా, బ్రిటన్ తయారీ ఆయుధాలను తమపై ప్రయోగించడంపై రష్యా ఆగ్రహం
  • ఇప్పటికే ఖండాంతర క్షిపణి ప్రయోగంతో హెచ్చరికలు
  • గురువారం ఒరెష్నిక్ మిసైల్‌ను ప్రయోగించిన రష్యా
  • మరో క్షిపణిని ప్రయోగించేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్న పుతిన్
అమెరికా, బ్రిటన్ తయారీ ఆయుధాలను తమ భూభాగంపై ప్రయోగించిన ఉక్రెయిన్‌పై రగిలిపోతున్న రష్యా మరో కొత్త క్షిపణి ప్రయోగానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ స్వయంగా వెల్లడించారు. ఉక్రెయిన్‌పై మిసైల్ ప్రయోగానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 

ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంపై గురువారం తాము ఒరెష్నిక్ మిసైల్‌ను ప్రయోగించినట్టు రష్యా తెలిపింది. పరస్పర క్షిపణి ప్రయోగాలతో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ నిన్న డిఫెన్స్ మంత్రిత్వశాఖ అధికారులు, ఆయుధ తయారీదారులతో సమావేశమై వారిని అభినందించారు.

అమెరికా సరఫరా చేసిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులతోపాటు యూకే తయారీ స్టార్మ్ షాడో మిసైల్స్‌ను తమపై ప్రయోగించడంతో మండిపడుతున్న రష్యా అణ్వాయుధాలు ప్రయోగించక తప్పదన్న హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖండాంతర క్షిపణి ప్రయోగంతో హెచ్చరికలు జారీచేసింది. ఉక్రెయిన్ ఇలాగే దూకుడు ప్రదర్శిస్తే మరిన్ని క్షిపణుల ప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరికలు జారీ చేసింది.


More Telugu News