కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • లగచర్ల ఘటనలో దాడికి పాల్పడింది కేటీఆర్ అనుచరులేనన్న మంత్రి
  • భూములు లేనివారు, స్థానికేతరులు వచ్చి దాడి చేశారన్న మంత్రి
  • నిందితుడు సురేశ్ తన అనుచరుడేనని కేటీఆర్ గతంలో చెప్పారని వెల్లడి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లగచర్ల ఘటనలో కలెక్టర్, అధికారుల మీద దాడికి దిగింది కేటీఆర్ అనుచరులేనని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆందోళనలు శాంతియుతంగా చేయడంలో తప్పులేదన్నారు. కానీ లగచర్లలో భూములు లేనివారు... స్థానికేతరులు వచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ ఘటనలో కీలక నిందితుడు సురేశ్ మాజీ ఎమ్మెల్యేతో 90సార్లు మాట్లాడినట్లు తెలిసిందన్నారు. అతను రేప్ కేసులోనూ నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. సురేశ్ తన అనుచరుడేనని కేటీఆర్ గతంలో అంగీకరించారని వెల్లడించారు. గతంలో తాము కూడా నిరసనలు, ఆందోళనలు చేపట్టామని, కానీ శాంతియుతంగా చేశామన్నారు. 

మూసీ పునరుజ్జీవంపై కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి

మూసీ పునరుజ్జీవంపై కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్ బయటకు వచ్చి వద్దని చెబితే ఆపేయడానికి తాము సిద్ధమన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేవలం మూసీ ప్రాంతానికి పరిమితమయ్యారని, ఆయన యాదాద్రి జిల్లాలో కూడా పర్యటించాలని సూచించారు. కేంద్రమంత్రిగా ఆయన సింగరేణి గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. మణిపూర్ ఘర్షణల గురించి ఈ కేంద్రమంత్రులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు.

ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే 90 శాతం భూసేకరణ చేసినట్లు మంత్రి తెలిపారు. జనవరిలో టెండర్లు పిలుస్తామన్నారు. రైతులకు పరిహారం చెల్లించాకే పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయలు వచ్చే ఓఆర్ఆర్‌ను కేవలం రూ.7 వేల కోట్లకే గత ప్రభుత్వం అప్పగించిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును పక్కకు పెట్టిందని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు ఇచ్చే నిధులపై నాడు కేంద్రం స్పష్టత కోరితే... ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం వైఖరి వల్ల ఈ ప్రాజెక్టుపై అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు.


More Telugu News