ఫ్యాక్టరీలు ఉన్నచోట... మంచు ఎందుకు ఎక్కువగా కురుస్తుంది?

  • ఇతర చోట్లతో పోలిస్తే... ఫ్యాక్టరీల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా కురిసే మంచు
  • ఆ ప్రాంతాల్లో ఏర్పడే పొగ మంచు కూడా ఎక్కువే
  • అక్కడి వాతావరణంలో ఏర్పడే కొన్ని ప్రత్యేక మార్పులే కారణం
చలికాలంలో తెల్లవారుజామున స్వల్పంగా మంచు కురవడం సాధారణమే. ముఖ్యంగా విపరీతంగా పొగ మంచు కమ్ముకోవడం కూడా అందరికీ తెలిసిందే. అయితే భారీ పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్లు వంటివి ఉన్న చోట మాత్రం మంచు ఎక్కువగా కురుస్తుంటుంది. పొగ మంచు కూడా కాస్త దూరంలో ఏముందో కూడా కనిపించనంత ఎక్కువగా కమ్ముకుంటుంది. అక్కడి కొంతదూరం వెళ్లి చూస్తే... సాధారణంగానే ఉంటుంది.

ధూళితో ‘క్లౌడ్ గ్లాసియేషన్’ పెరిగిపోయి...
ఇలా పరిశ్రమలు, ప్లాంట్లు ఉన్న చోట మంచు ఎక్కువగా కురవడంపై పలువురు శాస్త్రవేత్తలు నాసాకు చెందిన ‘టెరా’ పరిశోధక ఉపగ్రహం సాయంతో అధ్యయనం చేశారు. దూరదూరంగా ఉన్న కొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లోని మేఘాల్లో, ఇతర ప్రాంతాల్లోని మేఘాల్లో జరిగే మార్పులను పరిశీలించారు. ఫ్యాక్టరీలున్న చోట మంచు ఎక్కువగా కురవడానికి వాటి నుంచి వెలువడిన ధూళి కారణమని... దాని వల్ల ‘క్లౌడ్ గ్లాసియేషన్’ ఎక్కువగా జరుగుతోందని తేల్చారు. శాస్త్రవేత్తలు గుర్తించిన వివరాల ప్రకారం...

  • ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే పొగ, అతి సన్నని ధూళి వాతావరణంలోకి చేరుతాయి. ఆ ప్రాంతంలో ఉన్న మేఘాలను ఆవరిస్తాయి.
  • మేఘాలలోని అతి చిన్న నీటి బిందువులకు ఆ ధూళి అతుక్కుంటుంది.
  • వాతావరణం పైభాగంలోని శీతల పరిస్థితి కారణంగా ఈ నీటి బిందువులు... అతి చిన్న మంచు స్ఫటికాలుగా మారుతాయి. ఇవి ఒకదానికొకటి అతుక్కుపోతుంటాయి.
  • ఇలా కాస్త పెద్ద మంచు స్ఫటికాలుగా మారాక... వాటి బరువు వల్ల కిందికి జారుతాయి.
  • ఇందులో కొంత పొగ మంచుగా గాలిలో నిలుస్తుంది. మరికొంత మంచులా కురుస్తుంది.
  • నిజానికి ఈ ‘క్లౌడ్ గ్లాసియేషన్’ ప్రక్రియ ధూళి లేకుండా కూడా జరుగుతుంది. కానీ ఫ్యాక్టరీలు ఉన్న చోట ధూళి కారణంగా మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్యాక్టరీలు, ప్లాంట్లు ఉన్న చోట మంచు ఎక్కువగా కురుస్తుంది.


More Telugu News