కేజ్రీవాల్‌కు షాక్... బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత

  • నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి... ఈరోజు బీజేపీలో చేరిక
  • ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే ఆశయాలు ఆప్ లో కనిపించడం లేదని ఆరోపణ
  • నేతల రాజకీయ అంశాలు వాటిని అధిగమిస్తున్నాయని వ్యాఖ్య
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ తాజాగా బీజేపీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన కీలక నేతగా వ్యవహరించారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన నిన్న మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేజ్రీవాల్‌కు పంపించారు.

ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి హామీలు ఇస్తోందని, అందుకే ఆ పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు ఆ ఆశయాలు కనిపించడం లేదన్నారు. పార్టీ నేతల రాజకీయ అంశాలు వాటిని అధిగమించినట్లు పేర్కొన్నారు.

కైలాస్ సింగ్ బీజేపీలో చేరడంపై స్పందించిన ఆప్

ఢిల్లీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ రాజీనామాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, తన కుట్రలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. బీజేపీ ఒత్తిడి వల్లే తాజా పరిణామం చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న గెహ్లాట్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, ఇప్పుడు మాట్లాడటం ఏమిటన్నారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదువుతున్నారని ఆరోపించారు. 

సంజయ్ సింగ్ వ్యాఖ్యలకు కైలాశ్ కౌంటర్

సంజయ్ సింగ్ వ్యాఖ్యలకు కైలాశ్ కౌంటర్ ఇచ్చారు. 2011-12లో అన్నా హజారే సమయంలో ఉద్యమం నుంచి తాను ఉన్నానని, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని... అలాంటి తాను రాత్రికి రాత్రి ఎలా నిర్ణయం తీసుకుంటానని ప్రశ్నించారు. ఒత్తిడి వల్లే తాను ఈ అడుగు వేశానని చెబుతున్నారని, తాను ఎప్పుడూ అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. 


More Telugu News