అంబులెన్స్ కు దారివ్వని వ్యక్తి... పోలీసులు ఏం చేశారంటే...!

  • కేరళలో ఘటన
  • రెండున్నర కిలోమీటర్ల వరకు అంబులెన్స్ ను సతాయించిన వ్యక్తి
  • కారు పక్కకు తీయకుండా నడిపిన వైనం
  • రూ.2.5 లక్షల జరిమానా వేసిన పోలీసులు
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యంత కీలకమైనది... అంబులెన్స్. అందుకే ఎంతటి ట్రాఫిక్ ఉన్నప్పటికీ అంబులెన్స్ వస్తే దారిస్తారు. అంబులెన్స్ కు సిగ్నళ్ల నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. బెంగళూరు వంటి నగరాల్లో అంబులెన్స్ కు దారిచ్చేందుకు వాహనదారుల సిగ్నల్ జంప్ చేసినా జరిమానా ఉండదు. మరి, అంబులెన్స్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. 

కానీ కేరళలో ఓ ప్రబుద్ధుడు అంబులెన్స్ కు దారివ్వకుండా ఇబ్బందిపెట్టాడు. అతడికి అధికారులు ఎలాంటి షాకిచ్చారో తెలిస్తే, అతడికి తగిన శాస్తి జరిగిందని ప్రతి ఒక్కరూ అంటారు. 

కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్ కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోలేదు. 

ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ప్రతి ఒక్కరూ ఆ కారు యజమానిని తెగ తిట్టారు. ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. 

ఆ కారు ఎవరిదో గుర్తించి, నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. అంబులెన్స్ కు ఎందుకు దారి ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే ఆ కారు యజమాని చెప్పిన సమాధానాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండడంతో, పోలీసులు మండిపడ్డారు. ఆ కారు యజమానికి రూ.2.5 లక్షల ఫైన్ వేయడంతోపాటు అతడి డ్రైవింగ్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేశారు. 

ఆ దుర్మార్గపు కారు యజమానికి ఇలాగే జరగాలంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మంచి పని చేశారంటూ కేరళ పోలీసులను ప్రశంసిస్తున్నారు.


More Telugu News