మహారాష్ట్రలో పవన్​ కల్యాణ్​ 'జై తెలంగాణ' నినాదం

  • మహారాష్ట్రలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన అధినేత
  • ఆ ప్రాంతంలో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్నారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్
  • తెలంగాణ పోరాటాల గడ్డ అంటూ ప్రసంగం
మహారాష్ట్రలో జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'జై తెలంగాణ' నినాదం చేశారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పర్యటించిన ప్రాంతాల్లో తెలంగాణ వారు పెద్ద సంఖ్యలో ఉండటాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ పోరాటాల గడ్డ
“మీ అందరిలో చాలా మంది పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో... నాకు ఇష్టమైన పాట మీకు తెలుసుకదా! బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి... ఏ బండి వెనుక పోతవ్ కొడకో నైజాము సర్కారోడ... అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మీరు మహారాష్ట్రలో ఉన్నా తెలంగాణ పోరాట స్ఫూర్తితో గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది” అని పేర్కొన్నారు.

భారీగా స్పందన..
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అంశాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించినప్పుడు స్థానికుల నుంచి, అభిమానుల నుంచి భారీ స్థాయిలో హర్షం వ్యక్తమైంది. ఆయన ప్రసంగించినంత సేపూ మంచి స్పందన కనిపించింది.


More Telugu News