చాలా తక్కువ ఖర్చుతో... ఈ దేశాలు చుట్టేసి రావొచ్చు!

  • ఖర్చులు భరించలేమన్న ఉద్దేశంతో విదేశాలకు వెళ్లని చాలా మంది
  • కాస్త తక్కువ ఖర్చుతోనే కొన్ని దేశాల్లో పర్యటించే అవకాశం
  • కేవలం రూ.30 వేల నుంచి రూ.60 వేల లోపే వారం పాటు టూర్
చాలా మందికి విదేశాలకు వెళ్లాలని ఉంటుంది. కానీ ఖర్చెంత అవుతుందో, అంత మొత్తాన్ని భరించగలమో, లేదోనని వెనుకాడుతూ ఉంటారు. కానీ విదేశీ పర్యటనలు చేయాలన్న కోరిక మాత్రం అలాగే ఉంటుంది. అలాంటి వారు తక్కువ ఖర్చులో మన దేశం నుంచి వెళ్లి రాగల దేశాలు కొన్ని ఉన్నాయి. మన ఇరుగుపొరుగునే ఉన్న ఈ దేశాల్లో కొన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. బాగా ఎంజాయ్‌ చేయవచ్చు కూడా. మరి ఆ దేశాలేవో, సుమారుగా ఎంత ఖర్చుతో వెళ్లి రావొచ్చో తెలుసుకుందాం..

నేపాల్ - వారం ఖర్చు రూ.45,000 
హిమాలయ పాదాల వద్ద ఒదిగినట్టుగా ఉండే నేపాల్ ఎన్నో అందమైన ప్రాంతాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వెళ్లేందుకు భారతీయులకు పాస్ పోర్టు కూడా అవసరం లేదు. నేపాలీయుల సంస్కృతి కూడా విభిన్నం. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలు, పర్వతాలతో అలరిస్తుంటుంది. ఒక్కొక్కరికి వారం రోజుల టూర్‌ కు సగటున రూ.40 వేల నుంచి రూ.45 వేల ఖర్చు అవుతుంది.

భూటాన్‌.. వారం ఖర్చు రూ.30 వేలే!
అతి తక్కువ ఖర్చులో అద్భుతమైన అడ్వెంచర్‌ పర్యాటక అనుభవం పొందడానికి భూటాన్‌ అనువైనది. రానుపోను విమానం చార్జీలను కలుపుకొని చూసుకున్నా.. ఏడు రోజుల టూర్‌ కు రూ.30 వేల వరకే ఖర్చవుతుందని ట్రావెల్‌ ఏజెన్సీల లెక్కలు చెబుతున్నాయి.

వియత్నాం.. వారం ఖర్చు రూ.35 వేలలోపే!
ఘనమైన సంస్కృతి, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఈ దేశం సొంతం. విమాన చార్జీలు కలుపుకొని కూడా రూ.35 వేలలోపే వారం రోజుల టూర్‌ వేయవచ్చు. ఇక్కడ బస, భోజనం వంటి ఖర్చులు చాలా తక్కువ.

బాలి (ఇండోనేషియా)... వారం ఖర్చు రూ.60 వేలలోపే!
మన దేశానికి సమీపంలోని మంచి పర్యాటక ప్రాంతాల్లో ఒకటి ఇండోనేషియాలోని బాలి ద్వీపం. విమాన చార్జీలు కలిపి ఒకరికి వారం ఖర్చు రూ.60 వేలలోపే ఉంటుంది. కాస్త దూరం కాబట్టి విమాన చార్జీలకే సగం ఖర్చుపోతుంది. స్థానికంగా బస, భోజనం వంటివి చవకగానే ఉంటాయి.

కెన్యా... వారం ఖర్చు రూ.75 వేల వరకు!
వైల్డ్‌ లైఫ్‌ టూరిజానికి పెట్టింది పేరు కెన్యా. అక్కడి అభయారణ్యాలు ప్రపంచంలోనే ఫేమస్‌. విమాన చార్జీలు కలిపి ఒకరికి వారం ఖర్చు రూ.60 వేల నుంచి రూ.75 వేలలోపే ఉంటుంది. కాస్త దూరం కాబట్టి విమాన చార్జీలకే సగానికిపైగా ఖర్చుపోతుంది. స్థానికంగా బస, భోజనం వంటివి మధ్యస్తంగా ఉంటాయి.

ఈ అంశాన్ని మర్చిపోవద్దు..
ఇందులో చెప్పిన ఖర్చుల లెక్కలన్నీ ప్రయాణం, సాధారణ బస, భోజనం వంటివాటికి సంబంధించినవి మాత్రమే. అదనంగా స్థానికంగా టూర్‌లు, ఎంట్రీ ఫీజులు, కొనుగోళ్లు, ఇతర ఖర్చులు ఏవైనా... వెళ్లే పర్యాటకులు, వారి ఆసక్తిని బట్టి అదనంగా ఉంటాయి.


More Telugu News