మాకు చెప్పిందేంటి.. మీరు చేసిందేంటి..? కమలా హ్యారిస్ పై అమెరికన్ల విమర్శలు

  • విమానాలు వెదజల్లే కర్బన ఉద్ఘారాలతో గ్లోబల్ వార్మింగ్
  • ప్రయాణాలు తగ్గించుకోవాలని అమెరికన్లకు గతంలో హ్యారిస్ పిలుపు
  • ఎన్నికల ప్రచారంలో ప్రైవేట్ జెట్లను విపరీతంగా వాడిన హ్యారిస్
  • రెండు వారాలకు ప్రైవేట్ జెట్లకు అయిన ఖర్చే 26 లక్షల డాలర్లు
అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన కమలా హ్యారిస్ పై ప్రస్తుతం అమెరికన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జనాలకు చెప్పడమే తప్ప తను మాత్రం పాటించదంటూ మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో హ్యారిస్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

విమానాలు విడుదల చేసే కర్బన ఉద్ఘారాలతో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కమలా హ్యారిస్ కూడా శాస్త్రవేత్తలకు మద్దతు పలుకుతూ.. విమాన ప్రయాణాలను తగ్గించుకోవాలంటూ అమెరికన్లకు పిలుపునిచ్చారు. అయితే, ఇటీవలి ఎన్నికల సమయంలో హ్యారిస్ వ్యవహరించిన తీరు మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ప్రచారం తుది దశకు చేరుకున్న సమయంలో కేవలం రెండు వారాల వ్యవధిలో హ్యారిస్ ప్రైవేట్ జెట్లలో విపరీతంగా తిరిగారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలతో పాటు దగ్గర, దూరమనే తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ జెట్లపైనే ఆధారపడ్డారు. ప్రచారం కోసం ఆమె వెచ్చించిన దాంట్లో పెద్దమొత్తం వీటికే ఖర్చు పెట్టారు. అక్టోబర్ 3 నుంచి 15 వరకు.. కేవలం రెండు వారాల వ్యవధిలో ఉపయోగించుకున్న ప్రైవేట్ జెట్ల కోసం కమలా హ్యారిస్ 26 లక్షల డాలర్లు చెల్లించారు. ఇంత మొత్తం విమానాల కంపెనీలకు చెల్లించారంటే కమల ప్రైవేట్ జెట్లను ఏ స్థాయిలో వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చని అమెరికన్లు మండిపడుతున్నారు.


More Telugu News