అయ్యో హైదరాబాద్... ఫుడ్ సర్వేలో అట్టడుగు స్థానం

  • గత కొంతకాలంగా హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు
  • కొన్ని రెస్టారెంట్లలో తనిఖీల్లో బయటపడిన కుళ్లిన మాంసం
  • 19 నగరాల్లో సర్వే చేపట్టిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
  • అట్టడుగున హైదరాబాద్
ఆహారం విషయంలో హైదరాబాద్ కు ఎంతటి ఘనచరిత్ర ఉందో అందరికీ తెలుసు. హైదరాబాద్ బిర్యానీ, హలీం, మొఘలాయి వంటకాలు... ఇలా హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి చేరింది. అయితే, గత కొంతకాలంగా భాగ్యనగరం పేరు, ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి. కొన్ని హోటళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరగడం, అధికారుల తనిఖీల్లో కుళ్లిన చికెన్, పాడైపోయిన ఆహార పదార్థాలు బయటపడడం వంటి ఘటనలే అందుకు కారణం. 

కొన్ని చోట్ల బిర్యానీల్లో బొద్దింకలు, ఇతర జీవులు కూడా దర్శనమిచ్చాయి. గత రెండు నెలల కాలంలో నగరంలో 84 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయంటే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. దాంతో కొన్ని రెస్టారెంట్లలో భోజనం అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వీటన్నింటికీ పరాకాష్ఠగా... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయస్థాయిలో చేపట్టిన ఓ సర్వేలో హైదరాబాద్ చివరిస్థానంలో నిలిచింది. కల్తీ ఆహారానికి సంబంధించి భారత్ లోని 19 మేజర్ సిటీల్లో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే చేపట్టింది. ఆహార నాణ్యత ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ కు అట్టడుగు స్థానం దక్కింది. 

దారుణమైన విషయం ఏమిటంటే... హైదరాబాదులోని 62 శాతం హోటళ్లలో గడువు తీరిన ఆహార పదార్ధాలు వినియోగిస్తున్నారట.


More Telugu News