రేవంత్ రెడ్డికి ఏ కష్టమొచ్చినా ఆ నలుగురు బీజేపీ నేతలు రక్షణగా వస్తున్నారు: కేటీఆర్

  • బండి సంజయ్... సీఎంను కంటికిరెప్పలా చూసుకుంటున్నారని విమర్శ
  • రఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ రక్షణగా ఉంటున్నారని వ్యాఖ్య
  • వీరు రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్న
రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా కేంద్రమంత్రి బండి సంజయ్ ముందు నిలబడతారని, రెప్పవాల్చకుండా... రక్షణగా ఉంటూ కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర సహాయమంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డి సహాయమంత్రిగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డిని తిడితే... రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ వంటి బీజేపీ ఎంపీలకు కోపం వస్తోందని ఆరోపించారు. ఈ నలుగురు బీజేపీ నేతలు రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా ఉంటున్నారన్నారు. వీరు రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నారా? లేక బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు.

పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బఫర్ జోన్‌లో ఉన్నాయని ఇళ్లను కూలగొడుతున్నారని... మరి పెద్ద పెద్ద కంపెనీలకు అదే భూమి ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టుకోమని ఎందుకు చెబుతున్నట్టని సీఎంను నిలదీశారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లలో నుంచి మురికి నీరు, మాల్స్ నుంచి సుగంధపు వాసన వస్తుందా? అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో దేవుళ్ల మీద కూడా ఒట్టేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సాంకేతిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయని, అందుకే ఎత్తైన కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారని... లేదంటే రెండు కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోడివి అయిపోవని చురక అంటించారు. ప్ర‌జ‌ల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు.

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలో చూస్తే అదానీ దొంగ అని రాహుల్ గాంధీ అంటారని, కానీ అదే అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. అదానీ విషయంలో ఢిల్లీ కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ తీరు వేరుగా ఉందన్నారు.


More Telugu News