సంపద సృష్టించడం అంటే పన్నులు పెంచడమా?: మార్గాని భరత్

  • జీఎస్టీ ఒక శాతం పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరారన్న భరత్
  • ఐదు నెలల్లో రూ. 57 వేల కోట్ల అప్పులు చేశారని మండిపాటు
  • విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. జీఎస్టీని ఒక శాతం అదనంగా పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సంపద సృష్టించడం అంటే పన్నులు పెంచడమా? అని దుయ్యబట్టారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత ఐదు నెలల కాలంతో చంద్రబాబు ప్రభుత్వం రూ. 57 వేల కోట్ల అప్పులు చేసిందని భరత్ ఆరోపించారు. జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పు చేశారని గతంలో ఆరోపించారని... ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ. 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారని విమర్శించారు. 

స్మార్ట్ మీటర్ల పేరుతో రూ. 11 వేల కోట్ల భారాన్ని ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. నవంబర్ 15 నుంచి యూనిట్ విద్యుత్ కు రూపాయి 58 పైసలు పెంచేందుకు సర్వం సిద్ధం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారని విమర్శించారు.


More Telugu News