రోహిత్ శర్మకు కొడుకు పుట్టాడు.. టీమిండియా కెప్టెన్‌కు పుత్రోత్సాహం

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య రితికా
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు కెప్టెన్‌కు గుడ్‌న్యూస్
  • తొలి టెస్టుకు ముందే జట్టుతో కలిసే అవకాశాలు
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్‌న్యూస్ విన్నాడు. హిట్‌మ్యాన్‌కు కొడుకు పుట్టాడు. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ దంపతులకు ఇది రెండవ సంతానం. తొలి సంతానంలో కూతురు సమైరా జన్మించిన విషయం తెలిసిందే.

కాగా భార్య రితికా నిండు గర్భిణిగా ఉండడంతో కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా మిగతా ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయాడు. దీంతో పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు అందుబాటులో ఉండబోడంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే భార్య డెలివరీ పూర్తి కావడంతో సిరీస్ ఆరంభానికి ముందే రోహిత్ టీమిండియాతో కలిసే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 22 నుంచి జరగనున్న తొలి టెస్టులో కూడా ఆడే ఛాన్స్ ఉంది. రోహిత్ వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తాడని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న రోహిత్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటే మిగతా సభ్యులకు నైతిక బలం లభిస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కాగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 31.38 సగటుతో 408 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు.


More Telugu News