పడిపోతున్న బంగారం ధరలు.. 4 నుంచి ఇప్పటి వరకు ఎంత తగ్గిందంటే..!

  • పది రోజుల్లో రూ. 4,750 క్షీణించిన పసిడి ధర
  • ట్రంప్ ఎన్నిక తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్న పుత్తడి ధరలు
  • కొనుగోలుకు ఇదే మంచి సమయమంటున్న మార్కెట్ నిపుణులు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమాంతం పెరిగిన బంగారం ధరలు.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక క్రమంగా తగ్గుముఖం పడుతూ రూ.80 వేల దిగువకు చేరుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ధరలు దిగివస్తుండడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ (ఎంసీఎక్స్)లో పుత్తడి ధరలు 6 శాతం క్షీణించాయి. ఫలితంగా ఈ నెల 4వ తేదీ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 10 గ్రాములకు ఏకంగా రూ. 4,750 తగ్గింది. దీంతో బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి.

బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని నేషనల్ ఇండియా బులియన్ అండ్ జెవెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) కార్యదర్శి సురేంద్రమెహతా తెలిపారు. అమెరికా ఆర్థిక వృద్ధికి ట్రంప్ కనుక చర్యలు తీసుకుంటే బంగారం ధరల తగ్గుదల స్థిరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో నిన్న 10 గ్రాముల బంగారంపై రూ.700 తగ్గి రూ. 77 వేల స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధరపై రూ.1200 తగ్గి రూ. 75,650గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 1100 తగ్గి రూ. 70 వేల దిగువకు పడిపోయింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి రూ. 69,350గా రికార్డయింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ. 2,310 తగ్గి రూ. 90,190కి దిగొచ్చింది. అదే సమయంలో హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ. 2 వేలు తగ్గి రూ. 99 వేలుగా నమోదైంది.


More Telugu News