టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్

  • రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌతీ
  • ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ చివరిదని ప్రకటన
  • న్యూజిలాండ్ తరపున 104 టెస్టులు ఆడి 385 వికెట్లు తీసిన పేస్ దిగ్గజం
అంతర్జాతీయ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌ నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌతీ రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ చివరిదని వెల్లడించాడు. హామిల్టన్‌లోని తన హోమ్ గ్రౌండ్ ‘సెడాన్ పార్క్‌’ వేదికగా జరగనున్న మూడవ మ్యాచ్ కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ అని తెలిపాడు.

న్యూజిలాండ్‌‌కు ప్రాతినిధ్యం వహించాలనే కలలు కంటూ ఎదిగానని, ఏకంగా 18 సంవత్సరాలు జాతీయ జట్టుకు ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని టిమ్ సౌతీ వ్యాఖ్యానించాడు. అయితే వ్యక్తిగతంగా తనకు ఎంతో అందించిన ఈ ఆట నుంచి వైదొలగేందుకు ఇదే సరైన సమయం అనిపిస్తోందని చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని, టెస్ట్ కెరీర్ ఆరంభించిన ప్రత్యర్థిపైనే వీడ్కోలు కూడా చేయనుండడం విశేషమని చెప్పాడు. స్వదేశంలో తనకు చాలా ప్రత్యేకమైన మూడు మైదానాల్లో చివరి మూడు మ్యాచ్‌లు ఆడుతున్నానని పేర్కొన్నాడు.

కాగా 35 ఏళ్ల టిమ్ సౌతీ న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. మొత్తం 104 టెస్టు మ్యాచ్‌లు ఆడి 29.88 సగటుతో 385 వికెట్లు తీశాడు. సర్ రిచర్డ్ హ్యాడ్లీ (431 వికెట్లు) తర్వాత కివీస్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు టిమ్ సౌతీనే కావడం విశేషం. టెస్టుల్లో 15 సార్లు 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉండి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో సౌతీ మూడవ స్థానంలో ఉన్నాడు. నాథన్ లియాన్ (530 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (536 వికెట్లు) తర్వాత అతడే కావడం విశేషం.


More Telugu News