ఫైర్ అండ్ ఐస్ అంటే ఇదే.. మంచుపై అగ్నిపర్వతం లావా

  • ఐస్ ల్యాండ్ లో మంచుతో కప్పబడి ఉన్న అగ్ని పర్వతం పేలి వెలువడిన లావా
  • అతి శీతల పరిస్థితుల వల్ల మంచుపైనే పారిన లావా
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
 నీరు, నిప్పు పరస్పర విరుద్ధమైనవి. అలాంటిది మంచు, నిప్పు అయితే... మరింత విభిన్నం కదా! సాధారణంగా ఈ రెండూ ఒకేచోట ఉండటం చాలా అరుదే. కానీ తాజాగా ఐస్‌ ల్యాండ్‌ లో ఇలాంటి చిత్రం కనిపించింది. ఐస్‌ ల్యాండ్‌ లో నిండా మంచుతో కప్పి ఉన్న ‘సుంద్నుకగిగర్‌’ అగ్ని పర్వతం ఇటీవల క్రియాశీలకంగా మారింది. నిప్పులను మరిపించేలా ఎర్రటి లావాను వెదజల్లడం మొదలుపెట్టింది.

మంచుపై జారుతున్నట్టుగా లావా పారుతూ..
అగ్ని పర్వతం నుంచి వెలువడుతున్న లావా మంచుపై జారుతున్నట్టుగా దిగువకు పారుతూ వచ్చింది. నిజానికి లావా ఉష్ణోగ్రత 1,500 సెంటీగ్రేడ్‌ డిగ్రీల నుంచి 2 వేల డిగ్రీల వరకు అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆ వేడికి రాళ్లు, ఇనుము వంటివే కరిగిపోతాయి. అలాంటిది ఈ ప్రాంతంలో వాతావరణం శీతలంగా ఉండటంతో... అగ్ని పర్వతం చుట్టుపక్కల అంతా మంచుతో అలాగే నిండిపోయి ఉంది. దానిపైనే లావా పారుతూ, అది తగిలిన చోట మంచును కరిగిస్తూ ముందుకు సాగింది.

ఓ వీడియో విడుదలతో...
ఫిబ్రవరిలో అగ్ని పర్వతం వద్ద మంచుపై లావా ప్రవాహాన్ని ఓ వ్యక్తి వీడియో తీశారు. దానిని తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ గా మారింది. అది కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించినదని... మంచుపై లావా పారడం ఏమిటన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ అది ఒరిజినల్‌ వీడియోనేనని తేల్చారు. మరోవైపు ప్రకృతి ఎంతో చిత్రమైనదని, ఇలాంటివి చిన్న ఉదాహరణలేననే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోకు నాలుగున్నర లక్షలకుపైగా లైకులు వచ్చాయి కూడా.



More Telugu News