ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల ఎదుట హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోరెన్సిక్ నివేదిక
  • చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపిన పోలీసులు
  • జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి వచ్చిన చిరుమర్తి లింగయ్య నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నుంచి తాజా ఆధారాలు వెల్లడైన నేపథ్యంలో, పోలీసులు ఆ కోణంలో చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

ఈ కేసులో నిందితుడు, ఇప్పటికే సస్పెండైన అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న, చిరుమర్తి లింగయ్య మధ్య కీలక సంభాషణలు చోటుచేసుకున్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ పలు అంశాలను నిర్ధారించినట్టు సమాచారం. బీఆర్ఎస్ నేతలు... కొందరు వ్యక్తుల ఫోన్ నెంబర్లను నిందితుడికి పంపించినట్టుగా ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. 

కాగా, ఈ కేసులో చార్జిషీటు నమోదు చేసిన సమయంలో అప్పటికింకా ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన నేపథ్యంలో, పోలీసుల అభియోగాలకు మరింత బలం చేకూరినట్టయింది. దాంతో, ఈ కేసులో చాలామందికి నోటీసులు పంపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. చిరుమర్తి లింగయ్యకు కూడా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే నోటీసులు పంపారు.


More Telugu News