ఆసక్తికర ఘట్టం.. జో బైడెన్‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ

  • వైట్‌హౌస్‌లో ఇరువురి భేటీ.. ట్రంప్‌తో బైడెన్ కరచాలనం
  • శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధమన్న ఇరువురు నేతలు
  • ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ట్రంప్
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... పదవి నుంచి దిగిపోనున్న ప్రెసిడెంట్ జో బైడెన్‌తో భేటీ అయ్యారు. బుధవారం వైట్‌హౌస్‌కు వెళ్లి సమావేశమయ్యారు. వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి కార్యాలయం ‘ఓవల్ ఆఫీస్’లో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ట్రంప్‌తో కరచాలనం చేసి బైడెన్ అభినందనలు తెలిపారు. అధికార మార్పిడి ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఒకరికొకరు తెలుపుకున్నారు.

కాగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత వైట్‌హౌస్‌లో వీరిద్దరూ సమావేశమవడం ఇదే మొదటిసారి. ఓడిపోయిన అధ్యక్షుడు అధికారాన్ని శాంతియుత పద్ధతిలో గెలిచిన వారికి అప్పగించడం అమెరికాలో ఆనవాయతీ. అయితే నాలుగేళ్ల క్రితం ట్రంప్ అధికార మార్పిడికి సహకరించలేదు. ప్రక్రియలో స్వయంగా పాల్గొనేందుకు నిరాకరించారు. ఎన్నికల్లో కుట్ర జరిగిందంటూ యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి చేయడానికి వేలాది మంది మద్దతుదారులను ఉసిగొల్పారనే ఆరోపణలు కూడా ట్రంప్‌పై ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు కూడా ఉన్నాయి.

కాగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ తొలిసారి బుధవారం ఉదయం రాజధాని వాషింగ్టన్ నగరం చేరుకున్నారు. రిపబ్లికన్ చట్టసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


More Telugu News