సంజూ శాంసన్‌ పేరిట రెండు చెత్త రికార్డుల నమోదు

  • రెండు సార్లు వరుసగా డకౌట్ అయిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన సంజూ శాంసన్
  • అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత వికెట్‌ కీపర్‌గానూ అవాంఛిత రికార్డు
  • దక్షిణాఫ్రికాపై మూడో టీ20లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన సంజూ
టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచిన సంజూ శాంసన్.. ఆ తర్వాత వరుస రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు అయ్యాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే ఔట్ కావడంతో అతడి పేరు మీద రెండు అవాంఛిత రికార్డులు నమోదయాయి. టీ20 ఫార్మాట్‌లో రెండుసార్లు వరుస రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయిన తొలి భారతీయ క్రికెటర్‌గా సంజూ నిలిచాడు. ఈ ఏడాది జులై నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా సంజూ శాంసన్ ఇదే రీతిలో వరుస రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

కాగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సంజూ సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన తొలి ఓవర్‌లో కేవలం 2 బంతులు ఎదుర్కొని యన్‌సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అత్యధిక వరుస మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. వాషింగ్టన్ సుందర్ 2019-20 సీజన్‌లో గరిష్ఠంగా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో ఆశిష్ నెహ్రా, అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, రోహిత్ శర్మ, సంజు శాంసన్ (రెండు సార్లు) ఉన్నారు.

మరోవైపు టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన భారత వికెట్‌‌కీపర్‌గా కూడా సంజూ శాంసన్ నిలిచాడు. వికెట్ కీపర్‌గా అతడు 17 టీ20 మ్యాచ్‌లు ఆడగా అందులో 5 సార్లు డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. 54 మ్యాచ్‌ల్లో అతడు 4 సార్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్లు అయిన ఎంఎస్ ధోనీ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ ఒక్కోసారి మాత్రమే డకౌట్ అయ్యారు.


More Telugu News